Vamsi Mohan
-
రెవెన్యూ అధికారులను అడ్డుకున్న బాధితులు
విజయవాడ నగరంలోని రైవస్ కాలువ గట్టుపై ఇళ్లు నిర్మించుకుని జీవిస్తున్న కార్మికులు తమ ఇళ్లను తొలగించరాదని పేర్కొంటూ ఆదివారం ఉదయం విశాఖ జాతీయరహదారిపై రాస్తారోకో చేశారు. ఫ్లై ఓవర్ నిర్మాణం కోసం రైవస్ కాలువ గట్టుపై ఉన్న 300 ఇళ్లను తొలగించేందుకు అధికారులు శనివారం రాత్రి నోటీసులు ఇచ్చారు. గతంలో కూడా ఇక్కడ కొన్ని ఇళ్లను తొలగించారు. ఫ్లై ఓవర్ నిర్మాణానికి ఇంకా స్థలం కావాల్సి ఉందని భావించిన అధికారులు మిగిలిన 300 ఇళ్లను కూడా తొలగించాలని నిర్ణయించారు. దాంతో ఆగ్రహించిన బాధితులు రోడ్డెక్కి ఆదివారం ఉదయం హైవేపై ఆందోళనకు దిగారు. ఈ ఆందోళనలో స్థానిక ఎమ్మెల్యే వంశీమోహన్ కూడా పాల్గొన్నారు. పేదలు నిర్మించుకున్న ఇళ్లు తొలగించరాదని ఆయన కోరారు. రాస్తారోకోతో ఎక్కడి వాహనాలు అక్కడ నిలిచిపోవడంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఆందోళనకారులతో చర్చిస్తున్నారు. -
శ్రీకాకుళం అబ్బాయి, జపాన్ అమ్మాయి
ఒక్కటి చేసిన ప్రేమ ఈనెల 3వ తేదీన వివాహం అప్పన్నకు పూజలు సింహాచలం : విశాఖలో ఈనెల 3వ తేదీన వివాహం చేసుకున్న ఇండియా అబ్బాయి మోహన్ వంశీ దుంగా, జపాన్ అమ్మాయి అసాకొ తోడా శుక్రవారం వరాహ లక్ష్మీనృసింహస్వామిని కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకుని స్వామికి పూజలు నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా దరివాడకి చెందిన మోహన్ వంశీ దుంగాకు, జపాన్‌కి చెందిన అసాకొ తోడాకి యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో ఎంఎస్ చేస్తున్న సమయంలో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారింది. ఇరువర్గాల పెద్దల అంగీకారంతో ఈనెల 3న వారు వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం వీరిరువురూ యుఎస్ఏలో ఉద్యోగం చేస్తున్నారు. వరుడు తండ్రి మల్లేశ్వరరావు గంగవరం పోర్టు వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. -
వంశీకి ఎదురు ‘గాలి’
విజయవాడ సిటీ, న్యూస్‌లైన్ : గన్నవరం టీడీపీ అభ్యర్థి వంశీమోహన్‌కు నియోజకవర్గంలో ఎదురు గాలి వీస్తోంది. నియోజకవర్గంలో నాలుగు రోజులుగా మారిన సమీకరణాలు, పరిణామాలతో టీడీపీ శ్రేణులు తీవ్ర ఆందోళనలో ఉన్నట్లు సమాచారం. టీడీపీకి నామినేషన్ల ప్రక్రియకు ముందు ఉన్నంత ఊపులో సగానికి సగం తగ్గిందని పరిశీలకులు భావిస్తున్నారు. దశాబ్ధ కాలంగా ఎడమొఖం పెడముఖంగా ఉన్న దాసరి, వంశీ వర్గాల నాయకుల మధ్య మనసులు కలవలేదని చెబుతున్నారు. వంశీ ప్రచారంలో దాసరి వర్గీయులు మొక్కుబడిగా పాల్గొంటున్నారనే వార్తలు వినవస్తున్నాయి. వంశీకి వెన్నుపోటు పొడిచేందుకు దాసరి వ ర్గీయులు తెరవెనుక పొంచి ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది. దీనికితోడు దాసరి కూడా ప్రచారంలో అంటీముట్టనట్టుగానే వ్యవహరిస్తున్నారు. మైన్స్, వైన్స్ వ్యాపారంలో పాతుకుపోయిన తెలుగుతమ్ముళ్లు వంశీ వస్తే తమ ఆధిపత్యం కోల్పోవలసి వస్తుందనే ఆందోళనలో ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలో వారు సిండికేట్ అయి సెలైంట్‌గా టీడీపీ అభ్యర్థికి గోతులు తవ్వుతున్నట్లు చెబుతున్నారు. టీడీపీ ప్రచారంలోనూ అంత స్పందన ఉండటం లేదని అంటున్నారు. వంశీ వెనుక ప్రచారంలో కుర్రకారు మినహా పెద్దతలకాయలు లేకపోవడటంతో గన్నవరం ప్రాంత ప్రజలు టీడీపీ అభ్యర్థిపై ఆసక్తి చూపటం లేదంటున్నారు. సారథిరాకతో టీడీపీకి బీసీల్లో గండి ... మాజీ మంత్రి కె. పార్థసారథి వైసీపీ మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిగా రంగంలోకి దిగడంతో టీడీపీకి గన్నవరం నియోజకవర్గంలో బీసీ ఓట్లలో భారీగా గండి పడిందంటున్నారు. సామాజికంగా బీసీలు తమ ఆధిపత్యం కోసం సారథి అండతో వైసీపీలో చేరుతున్నారు. పార్థసారథి కూడా గన్నవరంపై ప్రత్యేక దృష్టి సారించి కాంగ్రెస్, టీడీపీలకు చెందిన నాయకులను వైసీపీలో చేరుస్తున్నారు. ఈ క్రమంలో కొద్ది రోజులుగా పలువురు మాజీ సర్పంచులు ముఖ్య నాయకులపై మాజీ మంత్రి గురిపెట్టారు. సీపీఎంతో భారీ నష్టం ... ఒకప్పుడు కమ్యూనిస్టుల కంచుకోటగా పేరున్న గన్నవరం నియోజకవర్గంలో చాలా కాలం తర్వాత సీపీఎం పార్టీ తమ అభ్యర్థిని బరిలోకి దింపింది. సీపీఎం అభ్యర్థిగా కాట్రగడ్డ స్వరూపరాణి భారీ ఎత్తున నామినేషన్ వేసి ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. తమ ఉనికిని కాపాడుకునేందుకు సీపీఎం, సీపీఐతో కలిసి పోరాడుతోంది. గన్నవరం నియోజకవ వర్గంలో వామపక్షాలకు టీడీపీతో పొత్తులుండేవి. ఈ క్రమంలో సీపీఎం అభిమానులు దాదాపు సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీకి ఓట్లు వేసేవారు. ఒక దశలో సీపీఎం అభిమానులు టీడీపీలో మమేకమయ్యారు. సింబల్ సెంటిమెంట్‌తో సీపీఎం ఎన్నికల బరిలో ప్రచారం చేస్తోంది. ఈ ధపా ఎన్నికల్లో సీపీఎం ఒంటరిగా పోటీ చేయటంతో టీడీపీకి భారీగా నష్టం వచ్చే అవకాశాలున్నాయని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. సీపీఎం గన్నవరం మండలంలో గన్నవరం, దావాజిగూడెం, బుద్దవరం, ముస్తాబాద, సూరంపల్లి, సావరగూడెం, గొల్లనపల్లి, ప్రాంతాల్లో టీడీపీ ఓటింగ్‌కు భారీగా గండి కొడుతుందని అంచనా వేస్తున్నారు. ఉంగుటూరు మండలంలో ఈ ప్రభావం తక్కువగా ఉన్నప్పటికీ, ఉంగుటూరు వెన్నూతల, పెదావుటపల్లి, ఆత్కూరు, తేలప్రోలు, సీతారామపురం, ఆరుగోలను, తదితర గ్రామాల్లో ఎంతోకొంత టీడీపీకి సీపీఎం నష్టం చేస్తుందని అంచనా. అదే విధంగా బాపులపాడు, విజయవాడ రూరల్ మండలాల్లో సీపీఎం ప్రభావం అంతగా లేనప్పటికీ కొంతమేర ఆపార్టీ అభ్యర్థివల్ల టీడీపీ ఓట్లు పోతాయని చెబుతున్నారు. ఉధృతంగా ైవె ఎస్ గాలి... నియోజకవర్గంలో నాలుగు మండలాల్లో పేద వర్గాల్లో దివంగత నేత డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి గాలి ఉధృతంగా వీస్తోంది. ప్రతి గ్రామంలో వైఎస్సార్ పార్టీ అభ్యర్థుల ప్రచారానికి ప్రజలు తండోప తండాలుగా తరలివచ్చి స్వాగతం పలుకుతున్నారు. ఎంపీ అభ్యర్థి కె. పార్థసార థి, ఎమ్మెల్యే అభ్యర్థి దుట్టా రామచంద్రరావుకు ప్రజలు మద్దతు పలుకుతున్నారు. వారిద్దరూ గ్రామాల్లో పర్యటించి ప్రజా సమస్యలు పరిష్కరిస్తామని, ప్రణాళికాబద్ధంగా ప్రచారం చేస్తున్నారు. పార్టీ అధినేత జగన్మోహనరెడ్డి బాటలో దివంగత నేత రాజశేఖర్‌రెడ్డి ఆశయాలకు కృషిచేస్తామని ప్రజలకు హామీ ఇస్తున్నారు. దాంతో గన్నవరం నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నారు. -
గన్నవరం టీడీపీ రెండు ముక్కలు !
బజారుకెక్కిన దాసరి, వంశీ పోరాటం టపాసులు పేల్చిన వంశీ వర్గీయులు విజయవాడ సిటీ, న్యూస్‌లైన్ : గన్నవరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ రెండు ముక్కలైంది. పార్టీ టికెట్టు ఆశిస్తున్న సిట్టింగ్ ఎమ్మెల్యే దాసరి వెంకట బాలవర్థనరావు, డాక్టర్ వంశీమోహన్ మధ్య ఎంతో కాలంగా కొనసాగుతున్న అంతర్గత గొడవలు బజారు కెక్కాయి. స్థానిక సంస్థల ఎన్నికలే వేదికగా బలాబలాలు తేల్చుకునేందుకు వారిద్దరూ సమాయత్తమైనట్లు సమాచారం. టీడీపీలో తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించేందుకు పావులు కదుపుతున్నారు. తమ నాయకునికి టీడీపీ అధినేత గన్నవరం సీటు ఇస్తానని హామీ ఇచ్చారని ఆదివారం గ న్నవరంలో వంశీ వర్గీయులు టఫాసులు కాల్చి హంగామా చేశారు. ఈ సమాచారం తెలుసుకున్న దాసరి వెంకట బాలవర్దనరావు, ఆయన వర్గీయులు కలవరం చెందారు. అదంతా పచ్చి అబద్దమని పార్టీ నాయకులు కార్యకర్తలకు దాసరి స్వయంగా ఫోన్ చేసి చెప్పుకున్నారు. ఈ నేపథ్యంలో దాసరి, వంశీ వర్గాలు పోటాపోటీగా స్థానిక సంస్థల ఎన్నికల అభ్యర్థులను నిలబెట్టేందుకు కసరత్తు ప్రారంభించారు. రానున్న ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిగా వంశీని పనిచేసుకోమన్నారని ఆయన వర్గీయులు గ్రామాల్లో నాయకులకు ఫోన్లు చేసి ప్రచారం చేశారు. ఈ హడావిడితో నియోజకవర్గంలో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. ప్రతి ఎన్నికల మాదిరిగా ఈ సారీ గన్నవరం టీడీపీ టికెట్టు విషయం వివాదాస్పదం కాక తప్పదని భావిస్తున్నారు. మండల స్థాయిలో పార్టీ నాయకులు, కార్యకర్తలు సంకట స్థితి నెదుర్కొంటున్నారు. ఈ ప్రభావంతో కొద్ది రోజుల్లో జరుగనున్న ఎంపీటీసీ,జెడ్పీటీసీ ఎన్నికల్లో ఏ వర్గంలో చేరాలో తెలియక పార్టీ నాయకులు అయోమయం చెందుతున్నారు. గత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలలోనూ టీడీపీలో వంశీ, దాసరి వర్గాలు ప్రత్యక్ష పోరాటానికి దిగాయి. పలు గ్రామాల్లో టీడీపీ రెబల్స్ అభ్యర్థులు రంగంలో దిగారు. మళ్లీ అదే పరిస్థితి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ అదే పునారావృతం కానుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. సోషల్ మీడియాలో వంశీ వర్గీయుల ప్రచారం .... సోషనల్ మీడియాలోనూ వంశీమోహన్‌కు గన్నవరం టికెట్ కేటాయించినట్లు ఆయన అభిమానులు ప్రచారం చేస్తున్నారు. ఫేస్‌బుక్‌లలో, నెట్లో వంశీ అభిమానులు హల్ చల్ చేస్తున్నారు. వంశీకి శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియాలో ఆయన అభిమానులు హంగామా సృష్టిస్తున్నారు. టికెట్ నాదే : వంశీ గన్నవరం, న్యూస్‌లైన్ : గతంలో కుదిరిన పెద్ద మనుషుల ఒప్పందం మేరకు గన్నవరం నియోజకవర్గ టీడీపీ అసెంబ్లీ టికెట్‌ను పార్టీ అధినేత చంద్రబాబునాయుడు తనకే కేటాయించారని ఆ పార్టీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి వల్లభనేని వంశీమోహన్ పునరుద్ఘాటించారు. శ్రీనగర్‌కాలనీలోని వల్లభనేని అరుణ ట్రస్టు కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ర్ట పార్టీ కార్యాలయం నుంచి వచ్చిన పిలుపు మేరకు జిల్లా పార్టీ పరిశీలకులు సుజానాచౌదరి, బందరు ఎంపీ కొనకళ్ళ నారాయణరావు, జిల్లా అధ్యక్షులు దేవినేని ఉమామహేశ్వరరావు సమక్షంలో బాబు తనతో, దాసరితో విడివిడిగా సమావేశమయ్యారని తెలిపారు. గతంలో కుదుర్చుకున్న ఒప్పందంతో పాటు దాసరి గత ఎన్నికల్లో ఇదే చివరిసారని చెప్పడంతో ప్రస్తుత ఎన్నికల్లో సీటు తనకే కేటాయిస్తున్నట్లు బాబు హామీ ఇచ్చారని చెప్పారు. అది తప్పుడు ప్రచారం : దాసరి రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ టికెట్టు తనకు కేటాయించారని, తానే అభ్యర్థినని గ్రామాల్లో వంశీ తప్పుడు ప్రచారం చేస్తున్నారని గన్నవరం సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ దాసరి వెంకట బాలవర్థనరావు చెప్పారు. ఆదివారం ఆయన న్యూస్‌లైన్‌తో మాట్లాడుతూ వంశీమోహన్, ఆయన వర్గీయులు చేస్తున్న అసత్య ప్రచారాన్ని ఖండించారు. తాను చంద్రబాబును కలిసి ఇక్కడ జరుగుతున్న విషయాలను వివరించినట్లు తెలిపారు. కేవలం ప్రజలను, పార్టీ నాయకులను అయోమయం చేయటానికే వంశీ ఇటువంటి కుయుక్తులు పన్నుతున్నారని దాసరి విమర్శించారు. శనివారం సాయత్రం తాను, వంశీ చంద్రబాబును కలిసినట్లు, ఆయన పార్టీ టికెట్టు వంశీకి కేటాయించినట్లు అసత్య ప్రచారం చేస్తున్నారని చెప్పారు. శనివారం ఉదయం తాను చంద్రబాబును కలిసి వంశీ చేస్తున్న అసత్య ప్రచారం గురించి ఫిర్యాదు చేశానని, ఆయన స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత మాట్లాడదామని చెప్పారని దాసరి వివరించారు. గతంలో గద్దే రామ్మోహనరావు, 2009 ఎన్నికల్లో వల్లభనేని వంశీమోహన్ ఎన్నికల ముందు ఇదే తరహాలో తమకు పార్టీ టికెట్ వచ్చేసిందని ప్రజల్లో తప్పుడు ప్రచారం చేసుకున్నారని తెలిపారు. గన్నవరం అసెంబ్లీ టికెట్ విషయమై చంద్రబాబు ఎవరికీ ఎటువంటి హామీ ఇవ్వలేదని, వంశీ చెబుతున్నట్లుగా ఒప్పందాలు ఏమీ లేవని దాసరి చెప్పారు. గతంలో చంద్ర బాబు నాయుడు సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ రానున్న ఎన్నికల్లో పార్టీ టికెట్ ఇస్తానని చెప్పిన మాటను దాసరి గుర్తు చేశారు. గన్నవరం నుంచి పోటీ చేస్తానని ఆయన తెలిపారు. -
దాసరి-వంశీ సీటు ఫైటు
విజయవాడ సిటీ, న్యూస్‌లైన్ : గన్నవరం టీడీపీలో అసెంబ్లీ టిక్కెట్ల పోరాటం ఆ పార్టీలో కల్లోలాన్ని రేపుతోంది. ఇందుకోసం సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ దాసరి వెంకట బాలవర్థనరావు, డాక్టర్ వంశీమోహన్లు పోరాటాన్ని ఉధృతం చేశారు. తమకే గన్నవరం సీటు కేటాయించాలని ఇద్దరు నాయకులూ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడిపై ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. రాష్ట్ర పార్టీ ముఖ్య నాయకుల ద్వారా వారు అసెంబ్లీ టిక్కెట్టు కోసం పోరాటం చేస్తున్నారు. గత మూడు మాసాలుగా వారిద్దరూ పార్టీ టిక్కెట్టు తనదంటే, తనదని ప్రచారం చేసుకుంటున్న విషయం విదితమే. టీడీపీ అధినేత చంద్రబాబు తనకు ఈసారి గన్నవరం నియోజకవర్గం నుంచి పార్టీ టిక్కెట్టు ఇస్తానని హామీ ఇచ్చినట్లు వంశీ బహిరంగంగా చెబుతున్నారు. గత ఎన్నికల్లో తనను విజయవాడ ఎంపీగా పోటీ చేయాలని పంపించారని, ఈసారి గన్నవరం నుంచి అవకాశం ఇస్తానని టీడీపీ పెద్దల ఒప్పందంపై తాను చంద్ర బాబును అడిగినట్లు వంశీ అంటున్నారు. నియోజకవర్గంలో పని చేసుకోమని చెప్పారని వంశీ పార్టీ శ్రేణులను కలుస్తున్నారు. ఈ క్రమంలో వంశీ చెప్పేదంతా అభూత కల్పనగా సిట్టింగ్ ఎమ్యెల్యే దాసరి వెంకట బాలవర్థనరావు కొట్టిపారేస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలందరకీ టిక్కెట్లు ఇస్తానని చంద్రబాబు చెప్పిన విషయాన్ని గుర్తు చేస్తూ నిజాయితీగల నాయకునిగా తనకు పార్టీలో ప్రజల్లో గుర్తింపు ఉందన్నారు. ఎట్టిపరిస్థితిలోనూ తనకే గన్నవరం సీటు కేటాయిస్తారని ఆయన ఘంటాపథంగా చెబుతున్నారు. తనకే సీటు కేటాయించారని అసత్య ప్రచారం చేసి, తద్వారా ప్రజల్లో సానుభూతి పొంది ఇండిపెండెంటుగా పోటీ చేయాలనే ఉద్దేశంతో వంశీ పావులు కదుపుతున్నారని దాసరి వర్గీయులు ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల తేదీలు ప్రకటించటంతో ఇరువురు నాయకులు తమతమ వర్గాలను బరిలోకి దించేందుకు పావులు కదుపుతున్నారు. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ టిక్కెట్టు ఆశిస్తున్న దాసరి వెంకట బాలవర్థనరావు, వంశీమోహన్లు తమ ఆధిపత్యం కోసం ఆరాట పడుతున్నారు. దాసరి గత వారం రోజులుగా నియోజకవర్గంలో గన్నవరం, ఉంగుటూరు, బాపులపాడు, విజయవాడరూరల్ మండలాల తెలుగుదేశం పార్టీ సమావేశాలు నిర్వహించారు. ముఖ్యంగా జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్ధుల ఎంపికపై కసరత్తులు చేస్తున్నారు. ఈ సమావేశాలకు మండలాల పార్టీ బాధ్యులు వంశీమోహన్‌ను ఆహ్వానించటం లేదు. పిలవక పోయినా విజయవాడ రూరల్ మండల పార్టీ సమావేశానికి హాజరయ్యారు. తమ నాయకుడిని ఎందుకు సమావేశానికి ఆహ్వానించలేదని వంశీ వర్గీయులు సమావేశంలో తిరుగుబాటు చేశారు. వంశీ హాజరు కాగానే దాసరి నిష్ర్కమించారు. ఎంపీటీసీల కసరత్తు జరపకుండానే ఆయన సమావేశం నుంచి అర్థంతరంగా వెళ్లిపోయారు. పార్టీ టిక్కెట్టు విషయంలో పైచేయి ఎవరిదనే విషయమై నియోజకవర్గంలో చర్చనీయాంశమైంది. -
ఆంగ్ల విద్యలో ప్రగతి అభినందనీయం
గీసుకొండ, న్యూస్‌లైన్ : ప్రభుత్వ పాఠశాలల్లో అమలవుతున్న ‘వంద రోజుల్లో ఆంగ్ల విద్య’ అభినందనీయమని డీఈఓ విజయ్‌కుమార్ అన్నారు. కొమ్మా ల కాంప్లెక్స్ పరిధిలోని పాఠశాలల విద్యార్థుల ఆంగ్ల విద్య పురోగతిని శుక్రవారం ఆయన పరీక్షించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించేందుకు విద్యా శాఖ అనేక కార్యక్రమాలు చేపట్టిందన్నారు. ప్రాథమిక స్థారుులో ఎల్టా మాడ్యుల్ ప్రకారం ఉపాధ్యాయులు ఆంగ్ల విద్యను విద్యార్థులకు అందించాలన్నారు. దీంతో భాషపై వారు పట్టు సాధిస్తారని అన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ప్రభుత్వ పాఠశాలల్లో కల్పిస్తున్న వసతులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రభుత్వం విద్యార్థులకు అనేక రాయితీలు కల్పించే అవకాశం ఉందన్నారు. కార్యక్రమంలో ఎంఈఓ జనార్దన్‌రెడ్డి, ఎల్టా అధ్యక్షుడు బత్తిని కొమురయ్య, పాఠశాల హెచ్ఎం నారాయణస్వామి, పోగ్రాం ఇన్చార్జి దేవేందర్‌రెడ్డి, ఆర్పీలు రవికుమార్, వంశీమోహన్, లక్ష్మణ్, సత్యం, 13 పాఠశాలల నుంచి వచ్చిన విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
గన్న‘వరం’ ఎవరికి!?
సాక్షి, విజయవాడ : గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ రాజకీయం రసకందాయంలో పడింది. ఎమ్మెల్యే దాసరి బాలవర్ధనరావు విజయా డెయిరీ డెరైక్టర్‌గా ఎన్నిక కావడంతో ఆయన త్వరలోనే చైర్మన్ పదవిపై దృష్టిసారించే అవకాశం ఉంది. ఆయనకు చైర్మన్ గిరి దక్కితే.. గన్నవరం ఎమ్మెల్యే సీటు ఎవరికి ఇస్తారనే అంశంపై జిల్లా, అర్బన్ తెలుగుదేశం పార్టీల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ సీటుపై పార్టీ అర్బన్ మాజీ అధ్యక్షుడు వల్లభనేని వంశీమోహన్ (వంశీ) ఎప్పటి నుంచో ఆశపెట్టుకున్నారు. ఇప్పటివరకు తనకు పక్కలో బల్లెంలా ఉన్న వంశీ కోసం దాసరి సీటును వదులుకుంటారా? లేదా తన కుటుంబం నుంచే మరొకరిని రంగంలోకి దింపుతారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నందమూరి వారసుల దృష్టి? తెలుగుదేశం పార్టీకి పట్టున్న గన్నవరం సీటుపై నందమూరి వారసులు దృష్టిసారిస్తున్నారు. ఎన్టీఆర్ తనయుడు, సినీనటుడు హరికృష్ణకు ఈ సీటు కేటాయిస్తారని గతంలో ప్రచారం జరిగింది. అరుుతే, సమైక్యాంధ్ర కోసం హరికృష్ణ ఎంపీ సీటును వదులుకోవడం, గుడివాడ నుంచి యాత్ర చేస్తానని ప్రకటించడం పార్టీ అధినేత చంద్రబాబును సందిగ్ధంలో పడేసింది. ప్రస్తుతం చంద్రబాబు, హరికృష్ణ మధ్య సఖ్యత లేకపోవడంతో ఆయనకు ఈ సీటుకు దక్కుతుందా? అనే అనుమానాలు పార్టీ కేడర్‌లో వ్యక్తమవుతున్నారుు. దీంతో గన్నవరం నుంచి సినీనటుడు బాలకృష్ణ పోటీచేసే అవకాశం ఉందని పార్టీలో చర్చ జరుగుతోంది. బాలకృష్ణ గత ఏడాదిగా కృష్ణాజిల్లా రాజకీయాలపై దృష్టి సారించారు. వాస్తవంగా ఆయన గుడివాడ నుంచి పోటీ చేస్తారని తొలుత అందరూ భావించారు. అయితే, అక్కడ వైఎస్సార్ సీపీ నేత కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(నాని)ను ఢీకొనడం అంటే ఇబ్బందేన ని జిల్లా టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో గన్నవరం సీటు అయితే కచ్చితంగా గెలవవచ్చని లెక్కలేస్తున్నారు. వల్లభనేని వంశీమోహన్, టీడీపీ జిల్లా అధ్యక్షుడు దేవినేని ఉమామహేశ్వరరావు(ఉమ) మధ్య భేదాభిప్రాయాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో బాలకృష్ణను గన్నవరం నుంచి పోటీకి దింపితే వంశీమోహన్‌కు కూడా చెక్ పెట్టినట్లు ఉంటుందని పార్టీ నేతలు భావిసున్నట్లు సమాచారం. అయితే, బాలకృష్ణను ఎమ్మెల్యేగా పోటీ చేయించేందుకు చంద్రబాబు ఎంతమేరకు అంగీకరిస్తారనేది ప్రశ్న. వంశీకి సీటు దక్కేనా? యూత్ ఐకాన్‌గా గుర్తింపుపొందిన వంశీమోహన్‌కు చంద్రబాబు గన్నవరం సీటు కేటాయిస్తారా, లేదా అనే దానిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీలో ఎంత నమ్మకంగా పనిచేసినప్పటికీ ఆయన్ను దూరంగా పెట్టడానికే బాబు ప్రయత్నిస్తున్నారు. 2009 ఎన్నికల్లోనే ఆయన గన్నవరం సీటుకు పోటీ పడ్డారు. చివరి నిమిషంలో విజయవాడ పార్లమెంట్ సీటు కేటాయిచారు. ఈ ఎన్నికల్లో ఓడిన తర్వాత అర్బన్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టి పార్లమెంట్ పరిధిలో ఆరు నియోజకవర్గాలపై దృష్టి సారించారు. ముఖ్యంగా యూత్‌ను ఆకర్షించి, విజయవాడ రాజకీయాలపై తన ముద్ర వేయడానికి ప్రయత్నించారు. నగరంలో బలపడుతున్నాడనే సమయంలో అర్బన్ అధ్యక్ష పదవి, పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి పదవి నుంచి ఆయనను తప్పించి, రాష్ట్ర పార్టీలో సాధారణ పదవికి మాత్రమే పరిమితం చేశారు. ప్రస్తుతం నగరంలో వంశీ మార్కు లేకుండా చెరిపేసేందుకు అర్బన్, జిల్లా నాయకులు శక్తివంచన లేకుండా కృషిచేస్తున్నారు. గతంలో వంశీ నియమించిన తెలుగు విద్యార్థి అధ్యక్షుడు వడ్లమూడి మోహన్‌ను హత్యచేసిన నిందితుడిని చంద్రబాబు తన వాహనంలో ఎక్కించుకోవడమే ఇందుకు ఉదాహరణ. కీలక నిర్ణయాలు తీసుకునే సమయంలో చంద్రబాబు వంశీని దూరంగా ఉంచుతున్నారని పార్టీలోని కొందరు నేతలు పేర్కొంటున్నారు. జిల్లా పార్టీకి చెందిన కొందరు నేతలు వంశీకి వ్యతిరేకంగా చెప్పటం వల్లే బాబు ఆయన్ను దూరంగా ఉంచుతున్నారని సమాచారం. ఈ నేపథ్యంలో ఆయనకు గన్నవరం సీటు కేటాయిస్తారా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.