దాసరి-వంశీ సీటు ఫైటు
విజయవాడ సిటీ, న్యూస్‌లైన్ : గన్నవరం టీడీపీలో అసెంబ్లీ టిక్కెట్ల పోరాటం ఆ పార్టీలో కల్లోలాన్ని రేపుతోంది. ఇందుకోసం సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ దాసరి వెంకట బాలవర్థనరావు, డాక్టర్ వంశీమోహన్‌లు పోరాటాన్ని ఉధృతం చేశారు. తమకే గన్నవరం సీటు కేటాయించాలని ఇద్దరు నాయకులూ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడిపై ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. రాష్ట్ర పార్టీ ముఖ్య నాయకుల ద్వారా వారు అసెంబ్లీ టిక్కెట్టు కోసం పోరాటం చేస్తున్నారు.
గత మూడు మాసాలుగా వారిద్దరూ పార్టీ టిక్కెట్టు తనదంటే, తనదని ప్రచారం చేసుకుంటున్న విషయం విదితమే. టీడీపీ అధినేత చంద్రబాబు తనకు ఈసారి గన్నవరం నియోజకవర్గం నుంచి పార్టీ టిక్కెట్టు ఇస్తానని హామీ ఇచ్చినట్లు వంశీ బహిరంగంగా చెబుతున్నారు. గత ఎన్నికల్లో తనను విజయవాడ ఎంపీగా పోటీ చేయాలని పంపించారని, ఈసారి గన్నవరం నుంచి అవకాశం ఇస్తానని టీడీపీ పెద్దల ఒప్పందంపై తాను చంద్ర బాబును అడిగినట్లు వంశీ అంటున్నారు. నియోజకవర్గంలో పని చేసుకోమని చెప్పారని వంశీ పార్టీ శ్రేణులను కలుస్తున్నారు.
ఈ క్రమంలో వంశీ చెప్పేదంతా అభూత కల్పనగా సిట్టింగ్ ఎమ్యెల్యే దాసరి వెంకట బాలవర్థనరావు కొట్టిపారేస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలందరకీ టిక్కెట్లు ఇస్తానని చంద్రబాబు చెప్పిన విషయాన్ని గుర్తు చేస్తూ నిజాయితీగల నాయకునిగా తనకు పార్టీలో ప్రజల్లో గుర్తింపు ఉందన్నారు. ఎట్టిపరిస్థితిలోనూ తనకే గన్నవరం సీటు కేటాయిస్తారని ఆయన ఘంటాపథంగా చెబుతున్నారు. తనకే సీటు కేటాయించారని అసత్య ప్రచారం చేసి, తద్వారా ప్రజల్లో సానుభూతి పొంది ఇండిపెండెంటుగా పోటీ చేయాలనే ఉద్దేశంతో వంశీ పావులు కదుపుతున్నారని దాసరి వర్గీయులు ప్రచారం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఎంపీటీసీ, జడ్‌పీటీసీ ఎన్నికల తేదీలు ప్రకటించటంతో ఇరువురు నాయకులు తమతమ వర్గాలను బరిలోకి దించేందుకు పావులు కదుపుతున్నారు. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ టిక్కెట్టు ఆశిస్తున్న దాసరి వెంకట బాలవర్థనరావు, వంశీమోహన్‌లు తమ ఆధిపత్యం కోసం ఆరాట పడుతున్నారు. దాసరి గత వారం రోజులుగా నియోజకవర్గంలో గన్నవరం, ఉంగుటూరు, బాపులపాడు, విజయవాడరూరల్ మండలాల తెలుగుదేశం పార్టీ సమావేశాలు నిర్వహించారు.
ముఖ్యంగా జడ్‌పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్ధుల ఎంపికపై కసరత్తులు చేస్తున్నారు. ఈ సమావేశాలకు మండలాల పార్టీ బాధ్యులు వంశీమోహన్‌ను ఆహ్వానించటం లేదు. పిలవక పోయినా విజయవాడ రూరల్ మండల పార్టీ సమావేశానికి హాజరయ్యారు. తమ నాయకుడిని ఎందుకు సమావేశానికి ఆహ్వానించలేదని వంశీ వర్గీయులు సమావేశంలో తిరుగుబాటు చేశారు. వంశీ హాజరు కాగానే దాసరి నిష్ర్కమించారు. ఎంపీటీసీల కసరత్తు జరపకుండానే ఆయన సమావేశం నుంచి అర్థంతరంగా వెళ్లిపోయారు. పార్టీ టిక్కెట్టు విషయంలో పైచేయి ఎవరిదనే విషయమై నియోజకవర్గంలో చర్చనీయాంశమైంది.