విజయవాడ నగరంలోని రైవస్ కాలువ గట్టుపై ఇళ్లు నిర్మించుకుని జీవిస్తున్న కార్మికులు తమ ఇళ్లను తొలగించరాదని పేర్కొంటూ ఆదివారం ఉదయం విశాఖ జాతీయరహదారిపై రాస్తారోకో చేశారు. ఫ్లై ఓవర్ నిర్మాణం కోసం రైవస్ కాలువ గట్టుపై ఉన్న 300 ఇళ్లను తొలగించేందుకు అధికారులు శనివారం రాత్రి నోటీసులు ఇచ్చారు. గతంలో కూడా ఇక్కడ కొన్ని ఇళ్లను తొలగించారు.
ఫ్లై ఓవర్ నిర్మాణానికి ఇంకా స్థలం కావాల్సి ఉందని భావించిన అధికారులు మిగిలిన 300 ఇళ్లను కూడా తొలగించాలని నిర్ణయించారు. దాంతో ఆగ్రహించిన బాధితులు రోడ్డెక్కి ఆదివారం ఉదయం హైవేపై ఆందోళనకు దిగారు. ఈ ఆందోళనలో స్థానిక ఎమ్మెల్యే వంశీమోహన్ కూడా పాల్గొన్నారు. పేదలు నిర్మించుకున్న ఇళ్లు తొలగించరాదని ఆయన కోరారు. రాస్తారోకోతో ఎక్కడి వాహనాలు అక్కడ నిలిచిపోవడంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఆందోళనకారులతో చర్చిస్తున్నారు.