కరీంనగర్ క్రైం, న్యూస్‌లైన్ : కరీంనగరంలో పరిస్థితి మరీ దారుణంగా మారింది. ప్రతిరోజూ ఎక్కడో ఒక చోట చోరీలు జరుగుతూనే ఉన్నాయి. వివిధ రూపాల్లో వస్తున్న దొంగలు ఒంటరిగా మహిళ కనిపించినా.. తాళమేసిన ఇల్లు కనిపించినా అంతే. దర్జాగా దోపిడీ చేస్తూ పోలీసులకు సవాల్ విసురుతున్నారు.
కొద్ది నెలలుగా దొంగలు రెచ్చిపోతున్నా వారిని పోలీసులు మాత్రం ఏమీచేయలేకపోతున్నారు. నగరంలో నాలుగు పోలీస్‌స్టేషన్లు, క్రైం కంట్రోల్ స్టేషన్ (సీసీఎస్)కూడా ఉంది. నేరాలు, చోరీలను నివారించి దొంగలను పట్టుకునేందుకే ప్రత్యేకంగా సీసీఎస్ ఏర్పాటైంది. నేరాలు మాత్రం జరుగుతూనే ఉన్నాయి.
సీసీఎస్ ఏం చేస్తోంది..
2008లో ఏర్పాటైన సీసీఎస్ పోలీస్‌స్టేషన్ ప్రా రంభంలో బాగానే పనిచేసింది. ఎందరో నేరగాళ్లను పట్టుకుంది.పోలీసులులపై ఆధారపడకుండా దొంగల కదలికలపై ప్రత్యేక నిఘావేసి చోరీ జరిగిన తీరు పరిశీలించి నిందితులు ఎవ రో చేయగల నిపుణులు ఇక్కడ ఉన్నారు. అంతరాష్ట్ర దొంగల అలవాట్లు, చోరీలు చేసే విధానంపైనా వీరికి పట్టు ఉంటుంది.
దొంగిలించిన బంగారం అమ్మకాలు, వారి స్థావరాలు వీరికి దాదాపు తెలిసే ఉంటుంది. కొంతకాలంగా సీసీఎస్ అనుకున్న స్థాయిలో పనిచేయకపోవడంతో నేరాల సంఖ్య పెరుగుతూనే ఉంది. అసమర్థులను కేటాయిం చడం.. యువకులకు బదులు విరమణకు సమీపంలో ఉన్నవారిని ఇక్కడకు పంపుతుండడంతో ఈ పరిస్థితి నెలకొందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇక్కడ సీఐతోపాటు 50 మంది సిబ్బంది ఉండాలి. కానీ.. 19 మంది మాత్రమే ఉన్నారు. 20 మంది కానిస్టేబుళ్లకు 9 మంది, ఎనిమిది మంది హెడ్‌కానిస్టేబుళ్లకు ఆరుగురు, 16 మంది ఎస్సైలకు ఇద్దరు ఉన్నారు. వీరిలో ఒకరే అందుబాటులో ఉన్నారు. నలుగురు సీఐలకు ఇద్దరిని మహిళా పీఎస్, వన్‌టౌన్‌కు అటాచ్డ్ చేశారు.
నిఘా వ్యవస్థల తీరు
జిల్లాలో ఎక్కడ ఏం జరిగిన క్షణాల్లో సమాచారం సేకరించే స్పెషల్ బ్రాంచ్ కూడా వెనుకబడుతోందనే ఆరోపణలున్నాయి. నక్సల్స్ ప్రభావం ఉన్న సమయంలో రాష్ట్రంలోనే ప్రశంసలు అందుకున్న ఎస్‌బీ ఇప్పుడు ఆ స్థాయిలో పని చేయడం లేదు. వీరిలో కొందరు సిబ్బంది పోలీస్‌స్టేషన్ల పైరవీలు, వినని వారిపై ఉన్నతాధికారుల వద్ద ఆరోపణలు చేయడం, వ్యాపారాలు, సెటిల్‌మెంట్‌లు చేస్తూ పోలీస్‌శాఖకే కొరకరాని కొయ్యగా మారారు.
జిల్లాలో జరుగుతున్న పరిణామాలపై కనీసం సమాచారం కూడా ఉండడం లేదని, ప్రజలు స్వచ్ఛందంగా సమాచారం ఇవ్వాలన్నా.. కనీసం ఫోన్లలోనైనా స్పందించడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇంటెలిజెన్స్, ఐడీ పార్టీ పోలీసులూ అదనపు భారం, పనులతో ఇబ్బందులు పడుతున్నారు. చివరకు వీరిని బందోబస్తులకు సైతం వినియోగిస్తుండడంతో నేరాలపై దృష్టి సారించలేకపోతున్నారనే ఆరోపణలున్నాయి. రెండు రోజుల క్రితం శంకరపట్నం మండలం మొలంగూర్, జగిత్యాలలో మేడిపెల్లి ఏఎస్సై ఇంట్లో జరిగిన చోరీ ఘటనలు పోలీసులకు సవాల్ విసురుతున్నాయి.
నిద్దరోతున్న నిఘా
Published Thu, Aug 29 2013 2:49 AM | Last Updated on Tue, Aug 21 2018 5:44 PM
Advertisement
Advertisement