'విచారణకు ముందే మాళవిక విషం తాగింది'
హైదరాబాద్ : సీసీఎస్ కార్యాలయంలో ఓ మహిళ ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దాంతో ఆమెను పోలీసులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వివరాల్లోకి వెళితే ఎన్ఆర్ఐని మోసం చేసిన కేసులో మాళవిక అనే మహిళను నిన్న పోలీసులు విచారిస్తున్నారు. అయితే పోలీసులు విచారిస్తుండగానే ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. ఈ విషయాన్ని గమనించిన పోలీసులు మాళవికను హుటాహుటీన చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేర్చారు. ఆమె విషం తాగినట్లు వైద్యులు వెల్లడించారు. కాగా వెబ్సైట్లో వరుడు కావాలని ప్రకటనలు ఇస్తూ మాళవిక మోసాలకు పాల్పడుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఓ ఎన్ఆర్ఐని ఆమె మోసం చేయటంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించినట్లు తెలుస్తోంది.
మరోవైపు ఈ వ్యవహారంపై సీసీఎస్ డీసీపీ పాలరాజు మాట్లాడుతూ విచారణకు ముందే మాళవిక విషం తాగి సీసీఎస్కు వచ్చినట్లు తెలిపారు. ఆమో వద్ద సూసైడ్ నోట్ లభించినట్లు ఆయన పేర్కొన్నారు. కాగా ఓ ఎన్ఆర్ఐని మోసం చేసినట్లు ఫిర్యాదు అందిన నేపథ్యంలో మాళవికను విచారణకు పిలిచినట్లు డీసీపీ చెప్పారు.