♦ సీసీఎస్ లో అక్రవూల బాగోతం
♦ సాక్షి పరిశోధనలో వెల్లడైన నిజాలు
♦ తవ్వేకొద్దీ అక్రమాలు
♦ 420 కేసులో 16 మంది నిందితుల పేర్లు తొలగింపు
♦ అధికారులకు రూ.80 లక్షలు నజరానా
సాక్షి, సిటీబ్యూరో : నగర సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్)లో తవ్విన కొద్దీ ఖాకీల అక్రమ భాగోతాలు వెలుగు చూస్తున్నాయి. ఇప్పటి వరకు దొంగ వాహనాలను పంచుకున్న ఖాకీల భాగోతం.. సీజ్ చేసిన మరో 54 కార్లను గోల్‌మాల్ చేసిన వైనంపై ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. తాజాగా ఓ చీటింగ్ కేసులో ఏకంగా 16 మంది నిందితులను తప్పించిన వైనం తెరపైకి వచ్చింది. ఇందుకుగాను నిందితుల నుంచి అందిన కాడికి దండుకుని వారి పేర్ల ఎఫ్‌ఐఆర్ నుంచి తొలగించారు. 17 మంది నిందితులుగా ఉన్న ఈ కేసులో కేవలం ఒక్కడిని మాత్రమే చార్జిషీట్‌లో చూపిస్తూ మిగతా వారినందరినీ కేసు నుంచి తప్పించారు.
ఇందుకు అధికారులకు దాదాపు రూ.80 లక్షలు నజరానా అందినట్లు సమాచారం. వివరాల్లోకి వెళితే..కర్నూల్ జిల్లా ఆళ్లగడ్డకు చెందిన రాకేష్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి స్నేహితులు. వీరికి ట్విట్టర్‌లో పశ్చిమ గోదావరి జిల్లా, ముచ్చర్లవారి తోటకు చెందిన షేక్ ఉమర్ అలీషా (30) పరిచయం అయ్యాడు. రాకేష్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డిలను ఆర్థిక స్తోమతపై కన్నేసిన ఆలీషా వారితో సాన్నిహిత్యాన్ని పెంచుకున్నాడు. ఆ తరువాత వారి డబ్బుతో‘7 క్యాబ్స్ ప్రైవేటు లిమిటెడ్’ పేరుతో ట్రావెల్స్ కంపెనీని ప్రారంభిన అద్దెకు వచ్చిన కార్లకు నకిలీ పత్రాలు సృష్టించి వాటిని విక్రయించడం, వాటిపై తిరిగి ఫైనాన్స్ కంపెనీల నుంచి పెద్ద మొత్తంలో రుణం తీసుకున్నాడు. అలీషా మోసాన్ని పసిగట్టిన మెహదీపట్నానికి చెందిన ఫైనాన్స్ కంపెనీ మేనేజర్ మీర్జాఫర్వేజ్‌బేగ్ సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతనిపై పోలీసులు డిసెంబర్ 16న అతనిపై క్రైమ్ నెంబర్ 289/2014 కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.
ఖాకీలకు వాటాలు..
దీనిపై దర్యాప్తు చేపట్టిన సీసీఎస్ ఆటోమొబైల్ టీం అలీషాను అరెస్టు చేసి అతని వాంగ్మూలం మేరకు మరో 16 మంది నిందితులుగా చేర్చారు. అలీషాతో పాటు శ్రీనివాస్‌రెడ్డి అలియాస్ బిచ్చు, వీరు, మధుగౌడ్, నర్సింహ్మా, శ్రీనివాస్‌రెడ్డి, మహ్మద్, ఇఫ్తఖార్, జగన్, అలిషా భార్య మానస, కంతకాడి మధుసూదన్, ప్రియదర్శిని, శివయ్యలతో పాటు మరో ముగ్గురిని నిందితులుగా పేర్కొంటూ కోర్టుకు సైతం ఎఫ్‌ఐఆర్ కాపీ అందజేశారు. అయితే అలీషాను రిమాండ్‌కు పంపిన అధికారులు మిగిలిన 16 మందిని అరెస్టు చేయకుండా వారితో బేరం కుదుర్చుకుని వారి పేర్లను నిందితుల జాబితాలోంచి తొలగించారు.
ఇందుకుగాను ఒక్కొక్కరి నుంచి రూ.2 లక్షల నుంచి రూ.15 లక్షలు తీసుకున్నట్లు సమాచారం. ఆ తరువాత ఆలీషా మినహా మిగిలిన వారికి ఈ కేసుతో సంబంధం లేనట్లుగా పేర్కొంటూ కోర్టుకు చార్జిషీట్ అందజేయడం గమనార్హం. ఇదిలా ఉండగా అరెస్టుకు ముందే అలీషా హైకోర్టు నుంచి ఐపీ తీసుకోవడం గమనార్హం.
అందరూ కలిసి మోసగించారు...
అలీషాను నమ్మి వ్యాపారంలోకి దిగడంతో తాము రూ.20 లక్షలు మోసపోయామని రాకేష్‌రెడ్డి,శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. అలీషాకు తాము ఏడు కార్లు ఇచ్చామని అందులో కేవలం నాలుగు కార్లను మాత్రమే పోలీసులు రికార్డులో రాశారని, మిగిలిన మూడు కార్లు రికార్డుల్లో చూప లేదన్నారు. ఈ కార్లు ఎక్కడ ఉన్నాయో ఫోటోలతో సహా పోలీసులకు ఆధారాలు ఇచ్చినా పట్టించుకోలేదన్నారు, కేసులో తమ ప్రయేయం లేకున్నా ఓ పోలీసు అధికారి బలవంతంగా ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారని, పేరు తొలగించేందుకు తమను బ్లాక్‌మెయిల్ చేసి డబ్బులు వసూలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
60 ఠాణాల్లో విచారణ షురూ..
సీసీఎస్‌లో అక్రమ భాగోతాలపై ‘సాక్షి’లో వస్తున్న వరుస కథనాలపై నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి తీవ్రంగా స్పందించారు. కార్లు పంచుకున్న ఖాకీలపై విచారణకు ఆదేశిస్తూ శుక్రవారం కమిషనరేట్ పరిధిలోని 60 పోలీసు స్టేషన్‌లలో రికవరీ చేసిన వాహనాల రికార్డులను సమర్పించాలని ఆదేశించారు. ఇందుకుగాను డీసీపీ నేతృత్వంలో ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ ప్రత్యేక బృందం అన్ని స్టేషన్‌లలో పదేళ్ల నుంచి రివకరీ చేసిన వాహనాల రికార్డులను పరిశీలించనుంది.
అంతేగాకుండా గోషామహల్ పోలీసు స్టేడియంలో కుప్పలు పడి ఉన్న వాహనాల రికార్డులను సైతం తిరిగి తోడనున్నారు. కేవలం ఈ ఒక్క సీసీఎస్‌లోనే గత ఏడాది కాలంలో 200 కార్లు సీజ్ చేసినట్లు విచారణలో తేలింది. ఆ కార్లు ఎక్కడ ఉన్నాయో నివేదిక ఇవ్వాలని కమిషనర్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
అక్రవూల పుట్ట పగిలింది
Published Sat, Apr 18 2015 1:43 AM | Last Updated on Tue, Aug 21 2018 5:46 PM
Advertisement