- ఉత్తరాది గాలులే కారణం
సాక్షి, విశాఖపట్నం: దాదాపు నెలరోజుల పాటు దూరంగా ఉన్న చలి ఇప్పుడిప్పుడే విజృంభిస్తోంది. వాస్తవానికి నవంబర్ ఆరంభం నుంచే చలి ప్రభావం మొదలవుతుంది. కానీ నెలన్నర రోజులుగా బంగాళాఖాతంలో అల్పపీడనాలు, ద్రోణులు ఏర్పడడంతో ఆకాశంలో మేఘాలు ఏర్పడుతున్నాయి. దీనివల్ల చలి చొచ్చుకురావడానికి వీల్లేకుండా పోయింది. ఫలితంగా నవంబర్ నెలంతా తెలుగు రాష్ట్రాల ప్రజలు సాధారణ వాతావరణాన్నే చవిచూశారు.
ఇప్పుడు పరిస్థితుల్లో మార్పు వచ్చింది. నైరుతి బంగాళాఖాతంలో తాజాగా కొనసాగుతున్న అల్పపీడనం దక్షిణ శ్రీ లంక వైపు (హిందూ మహాసముద్రానికి అనుకుని) పయనిస్తోంది. దీంతో మేఘాలు కూడా అటువైపు ఆవరించాయి. మరోవైపు కొద్ది రోజులుగా ఉత్తరాదిలో చలి పెరుగుతోంది. అదే సమయంలో అటు నుంచి ఆంధ్ర, తెలంగాణల వైపు చల్లగాలులు వీస్తున్నాయి. ఫలితంగా రెండు, మూడు రోజులుగా చలి ప్రభావం అధికమవుతోంది. దీనికి మంచు కూడా తోడవుతోంది.
ఆకాశంలో మేఘాలు కూడా కనిపించడం లేదు. వెరసి కనిష్ఠ ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో సాధారణం కంటే 2-5 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు తక్కువగా రికార్డవుతున్నాయి. రానున్న రోజుల్లో చలి, మంచు ప్రభావం మరింత అధికమవుతుందని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం మాజీ అధికారి మురళీకృష్ణ గురువారం రాత్రి ‘సాక్షి’కి తెలిపారు. గడచిన 24 గంటల్లో రాష్ట్రంలో ఎక్కడా వర్షపాతం నమోదు కాలేదు. ఆంధ్రప్రదేశ్‌లోని ఆరోగ్యవరంలో 15, తెలంగాణలోని ఆదిలాబాద్‌లో 11 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.