
అద్దాల రైల్లో అందాల ప్రయాణం
విశాఖపట్నం: విస్టాడోం! విశాఖ–అరకు మధ్య అందాలను చూపించడానికి వచ్చిన అద్దాల కోచ్ పేరిది. పర్యాటక ప్రియులను మంత్రముగ్ధులను చేయడానికి సుందరంగా రూపుదిద్దుకుంది. అద్దాల్లోంచి ప్రకృతి రమణీయతను వీక్షించవచ్చు. ఏళ‍్ల తరబడి ఎదురుచూస్తున్న వారి కల నెరవేర్చడానికి ఆదివారం ఉదయం నెరవేరింది. రైల్వేశాఖ మంత్రి సురేష్ ప్రభు భువనేశ్వర్ నుంచి వీడియో లింక్ ద్వారా రైలును ప్రారంభించారు. రైలు 10 గంటలకు బయలుదేరింది.
విశాఖపట్నం నుంచి అరకులోయ వరకు రెండు విస్టాడోం కోచ్‌లను నడపాలని రైల్వేశాఖ గతంలోనే నిర్ణయించింది. విశాఖ- కిరండోల్ పాసింజర్‌కు ఈ కోచ్‌లను అమర్చనుంది. దేశంలోనే తొలిసారిగా ఈ తరహా కోచ్‌లను చెన్నైలో తయారు చేయించింది. అతి విశాలమైన గ్లాసుల కిటికీలు, పైన ఆకాశాన్ని కూడా చూసేలా అద్దాల టాప్‌ను సుందరంగా రూపొందించారు. బోగీ నుంచి 360 డిగ్రీలు తిరిగేలా కుర్చీలను ఏర్పాటు చేశారు. కోచ్‌లో జీపీఎస్‌తో అనుసంధానించిన ఎల్‌సీడీ ఆడియో, వీడియోలు ఉన్నాయి.
ఒక్కో కోచ్‌కు సుమారు రూ.3 కోట్లు
రైల్వే శాఖ ఒక్కో కోచ్‌కు సుమారు రూ.3 కోట్లు వెచ్చించింది. వీటిలో ఒకటి శుక్రవారం రాత్రి విశాఖ వచ్చింది. రెండోది మరో పక్షంలో రానుంది. ప్రయోగాత్మకంగా రెండు రోజులు నడిపాక ఈ నెల 19 నుంచి కిరండోల్ పాసింజర్‌కు అనుసంధానం చేసి రోజూ నడుపుతారు. ఇటు నుంచి రోజూ ఉదయం 7.05 గంటలకు విశాఖలో బయలుదేరి 11.05 గంటలకు అరకు చేరుకుంటుంది. 128 కిలోమీటర్ల దూరాన్ని చేరుకోవడానికి నాలుగ్గంటల సమయం పడుతుంది.
మార్గంమధ్యలో 11 చోట్ల ఆగుతూ 58 టన్నెల్స్‌ను, 84 వంతెనలను దాటుకుని వెళ్తుంది. అరకులో ఈ బోగీని తొలగిస్తారు. అటు నుంచి సాయంత్రం తిరుగు ప్రయాణంలో వచ్చే కిరండోల్–విశాఖపట్నం పాసింజర్‌కు అరకులో ఈ కోచ్‌ను తగిలిస్తారు. ఈ రైలు అక్కడ సాయంత్రం 4.10కి బయల్దేరి రాత్రి 8.50 గంటలకు విశాఖకు చేరుకుటుంది.
ధర భారమే..
విశాఖ–అరకుల మధ్య ఈ విస్టాడోమ్‌లో ప్రయాణం ఒకింత భారం కానుంది. ప్రస్తుతానికి టిక్కెట్ ధర నిర్ణయించలేదు. కానీ రూ.500–550 వరకు ఉంటుందని రైల్వే వర్గాలు అంటున్నాయి. పూర్తి ఏసీ బోగీ కావడం, అన్ని అత్యాధునిక సదుపాయాలు ఉండడం వల్ల ఈ ధర ఉంటుందని చెబుతున్నారు. విశాఖ నుంచి అరకుకు అదే రైలులో టిక్కెట్టు ధర రూ.30లు ఉంది. స్లీపర్‌కు రూ.150, సెకండ్ ఏసీకి రూ.400 వరకు ఉంది.
బోగీకి 40 సీట్లు
ఈ విస్టాడోం కోచ్‌కు 40 సీట్లు మాత్రమే ఉంటాయి. రెండో కోచ్ వస్తే అదనంగా మరో 40 సీట్లు పెరుగుతాయి. ఈ నెల 19 నుంచి రెగ్యులర్‌గా కిరోండోల్ పాసింజరుకు ఈ కోచ్‌ను అనుసంధానం చేసి నడపనున్నారు. ఇందుకోసం 18వ తేదీ నుంచి టిక్కెట్లను విక్రయిస్తారు. ఆదివారం నుంచి ఒక ఇంజన్‌తో విస్టాడోం కోచ్‌ను ట్రయలరన్‌గా నడుపుతారు. ప్రయాణికులను అనుమతించరు.