కడపలోని టీడీపీ నేత శ్రీనివాసులరెడ్డి ఇంటి వద్ద ఐటీ అధికారులు, పోలీసుల బృందం
సాక్షి ప్రతినిధి కడప : ఇన్‌కం ట్యాక్స్, సెంట్రల్ విజిలెన్స్ దాడులతో జిల్లా టీడీపీ నేతల అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్‌బాబులతో ఆర్థిక లావాదేవీలు నెరిపిన పలువురి వ్యవహారాలు బహిర్గతమవుతున్నాయి. తాజాగా టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులురెడ్డి ఇల్లు, సంస్థలపైన ఐటీ దాడులు జరిగాయి. అంతకుముందు టీడీపీ రాష్ట్ర నేత గోవర్దన్‌రెడ్డికి చెందిన లా కళాశాలలో అక్రమాలు జరిగాయంటూ సెంట్రల్ విజిలెన్స్ దాడులకు దిగి కేసులు నమోదు చేసింది. ఇవేకాకుండా టీటీడీ మాజీ చైర్మన్, టీడీపీ మైదుకూరు నియోజకవర్గ ఇన్‌చార్జి పుట్టా సుధాకర్‌యాదవ్‌పైన ఇటీవల ఐటీ దాడులు చేసింది. అంతకుముందు ఎన్నికల సమయంలో చంద్రబాబుకు అత్యంత సన్నిహితంగా మెలిగి ఆర్థిక లావాదేవీల్లో కీలకపాత్రపోషించిన టీడీపీ పాతకాపు సీఎం రమేష్ ఇంటిపైన, సంస్థలపైన ఐటీ దాడులతోపాటు పోలీసుల తనిఖీలు జరిగాయి. దాడుల సందర్బంగా టీడీపీ నేతల ఇల్లు, వారి సంస్థల కార్యాలయాల నుంచి ఐటీ పలు కీలకపత్రాలు, నగదు సైతం స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. అధికారంలో ఉన్నప్పుడు అక్రమాలకు తెరలేపిన నేపథ్యంలోలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే విచారణలతోపాటు మరోవైపు ఐటీ దాడుల భయంతో సీఎం రమేష్ బెంబేలెత్తారు. చివరకు రక్షణ కోసం టీడీపీని ఆ పార్టీ అధినేతను వీడి షెల్టర్ జోన్ బీజేపీలో చేరిపోయారు. మాజీమంత్రి ఆదినారాయణరెడ్డి సైతం అదేబాట పట్టారు.
ఖాతాల్లోకి మళ్లింపు
టీడీపీ నేతలపై తాజాగా జరుగుతున్న ఐటీ, సెంట్రల్ విజిలెన్స్ దాడుల్లో పెద్ద ఎత్తున అక్రమాలు, ఆర్థిక లావాదేవీలు వెలుగు చూస్తున్నాయి. అధినేతకు పలు అక్రమ మార్గాల్లో సమకూరిన నిధులు వారికి బినామిలుగా ఉన్న కొందరు జిల్లా టీడీపీ నేతల ఖాతాల్లోకి మళ్లినట్లు ప్రాథమిక నిర్దారణకు వచ్చిన ఐటీ లోతైన విచారణకు దిగినట్లు తెలుస్తోంది. మూడు రోజుల క్రితం టీడీపీ జిల్లా అధ్యక్షుడు, ఆర్‌కే ఇన్‌ఫ్రా అధినేత శ్రీనివాసులురెడ్డి ఇల్లు, కార్యాలయాలపై ఐటీ దాడు లు జరిపింది. ఈ సందర్బంగా ప లు కీలకపత్రాలు, నగదు, బంగా రం సైతం స్వాధీనం చేసుకున్నారు. వందల కోట్ల లావాదేవీలకు సంబంధించి నిధులను లెక్కలు లేకపోవడంతో దీనిపై లోతైన విచారణ జరుపుతున్నట్లు తెలుస్తోంది. విచారణ పూర్తయితే మరిన్ని వాస్తవాలు వెలుగుచూస్తాయి.
తొలుత టీడీపీ రాష్ట్ర నేత, వైవీయూ మాజీ పాలక మండలి సభ్యుడు గోవర్దన్‌రెడ్డి లా కళాశాలపై సెంట్రల్ విజిలెన్స్ దాడులు నిర్వహించింది. గోవర్దన్‌రెడ్డికి చెందిన బసవతారకం లా కళాశాలలో సీట్ల కేటాయింపులో అక్రమాలు జరిగినట్లు విచారణలో వెల్లడైంది. నిబంధనలకు విరుద్దంగా కళాశాల నిర్వహించడంతోపాటు లాసెట్ ద్వారా 50 శాతం సీట్లు భర్తీకాకపోవడాన్ని అవకాశంగా తీసుకుని దాదాపు 90 శాతం సీట్లను తమిళనాడుతోపాటు బయటి రాష్ట్రాలకు చెందిన విద్యార్థులతో భర్తీ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. తమిళనాడుకు చెందిన ప్రభుత్వ ఉద్యోగులకు సైతం బసవతారకం లా కళాశాలలో సీట్లు ఇవ్వడాన్ని ప్రశ్నిస్తూ ఆ రాష్ట్రానికి చెందిన కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో సెంట్రల్ విజిలెన్స్ రంగంలోకి దిగింది. కళాశాలపై దాడులు చేసి రికార్డులను స్వాధీనం చేసుకోవడంతోపాటు కళాశాల ప్రిన్సిపల్‌పై కేసు నమోదు చేశారు. గతంలో మైదుకూరు టీడీపీ ఇన్‌ఛార్జి పుట్టా సుధాకర్ యాదవ్‌పైనే ఐటీ దాడులు జరిగాయి. రాజధాని ప్రాంతంలో సుధాకర్ యాదవ్ తనయుడు పేర భూములు కొనుగోలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనిపైనా విచారణ జరుగుతోంది. దీంతోపాటు చంద్రబాబు, లోకేష్‌లతోపాటు సన్నిహిత సంబంధాలు కలిగి ఉండడంతో సుధాకర్ యాదవ్‌పైన లోతైన విచారణ జరుగుతున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో టీడీపీకి అరకొరగా మిగిలిన నేతలు అక్రమ వ్యవహారాల్లో కూరుకుపోయి ఐటీ, విజిలెన్స్ దాడులు ఎదుర్కొండడంతో ఆ పార్టీ పరువు రోడ్డున పడింది. దీంతో జిల్లాలో నామమాత్రంగా ఉన్న టీడీపీ క్యాడర్ సైతం ఆ పార్టీకి దూరమైన పరిస్థితి కనిపిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment