దేవరపల్లి, న్యూస్‌లైన్: నూతన సంవత్సరం సందర్భంగా పండ్లు, పూల బొకేల ధరలు చుక్కల నంటాయి. పెరిగిన పండ్ల ధరలను చూచి ప్రజలు కొనలేని పరిస్థితి ఏర్పడింది. ఏపండు కొందామన్నా అందుబాటులో లేవని వినియోగదారులు వాపోతున్నారు. ఇలాంటి ధరలు ఎప్పుడూ చూడలేదని వినియోగదారులు అంటున్నారు. గత ఏడాదితో పోల్చుకొంటే పండ్ల ధరలు 25 నుండి 30 శాతం పెరిగాయి. పూల బొకేల ధరలు కూడా పెరిగాయి.
గత ఏడాది యాపిల్ ధర రూ. 10 నుండి 15 ధర పలకగా ఈ ఏడాది రూ. 25 నుండి 30 పలుకుతున్నాయి. ప్రస్తుతం పండ్ల ధరలు ఈ విధగంగా ఉన్నాయి. దానమ్మ కాయ రూ. 40 నుండి 50, కమలాలు డజను రూ. 120 నుండి 150 ధర పలుకుతున్నాయి. పూల బొకేల ధరలు కూడా కొనలేని పరిస్థితిలో ఉన్నాయి. పచ్చిపూల బొకే రూ. 50, ప్లాస్టిక్ బొకే రూ. 100 నుండి 250 పలుకుతున్నాయి. ఈ ధరలు సామాన్యులకు అందుబాటులో లేకపోవటం వల్ల నిరూత్సహపడుతున్నారు.
కొత్త సంవత్సరానికి ఘన స్వాగతం
2013 సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ, 2014 నూతన సంవత్సరానికి ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఇళ్ల ముందు రంగురంగుల రంగవెల్లులతో సుందరంగా అలంకరించారు. బాణసంచా కాల్చుతూ సంబరాలు జరుపుకొన్నారు. యువత వీధుల్లో తిరుగుతూ సందడి చేశారు. చర్చిల్లో ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించారు. నూతన సంత్సరానికి స్వాగతం పలికారు. బార్లు, హోటళ్లు సాయంత్రం 5 గంటల నుండే కిక్కిరిసాయి. మాంసాహార వంటకాలతో రోడ్లు ప్రక్కన స్టాల్స్ ఏర్పాటు చేసి విక్రయాలు జరిపారు. ప్రత్యేక ఆఫర్లు ప్రకటించారు. కౌజుపిట్ట, పీత, చేప, రొయ్య వంటి రుచికరమైన వంటకాలను తయారు చేసి విక్రయించారు.
కానరాని సందడి
నల్లజర్లరూరల్: నూతన సంవత్సరానికి స్వాగతం పలికే సమయం ఆసన్నమైంది. నల్లజర్ల జంక్షన్‌లో ఆసందడేమి కనపడటం లేదు. గతంలో పది రోజుల ముందు నుంచే గ్రీటింగ్ కార్డులు, ముగ్గులు, అలంకరణ సామగ్రి షాపుల వద్ద విద్యార్థులు ఉద్యోగులుతో సందడిగా ఉండేది. కాని ఈ ఏడాది కొనేవారు లేక షాపులు వెలవెలబోతున్నాయి. ప్రతి వ్యక్తికి వ్యక్తి గతంగా సెల్‌ఫోన్లు ఉండటం సంక్షిప్త సమాచారం వాటి పంపే వీలుండటంతో అందరూ పరస్పరం సెల్‌ఫోన్ల ద్వారానే పంపడానికి ఇష్టపడుతున్నారు. దీంతో గ్రీటింగ్ కార్డుల అమ్మకం పూర్తిగా తగ్గిపోయిందని వ్యాపారి వినాయక్ వాపోయాడు.
నూతన సంవత్సరంలో ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకునేటప్పుడు ,పెద్దల వద్దకు వెళ్ళెటప్పుడు వట్టి చేతులతో వెళ్ళకుండా పండ్లు, ఫ్లవర్ బొకేలు తీసుకెళ్ళడం ఆనవాయితీ. ఈ ఏడాది పెరిగిన ధరలతో ఏ పండు పట్టుకుందామన్నా చేతులు కాలే పరిస్థితి. చిన్న యాపిల్‌కూడా రూ.20కి పైనే ఉంది. ఇవి సామాన్యుడికి ప్రియంగా మారాయి. దీంతో పండ్ల వ్యాపారులు తక్కువ మొత్తంలో పళ్ళు అమ్మకానికి పెట్టారు. వీటితో పాటు పూల అలంకరణ, రంగుల దుకాణాలు వినియోగదారులు లేక వెలవెలబోతున్నాయి. నూతన సంవత్సరం మరికొన్ని గంటలలో రానున్నా సందడి మాత్రం కానరావడం లేదు.