భీమవరం క్రైం, న్యూస్‌లైన్ : రైళ్లలో నేరాలు, చోరీ ముఠాలపై నిఘా పెంచినట్లు రైల్వే డీఎస్పీ (రాజమండ్రి) ఎస్‌వీవీ ప్రసాదరావు తెలిపారు. సోమవారం స్థానిక జంక్షన్ రైల్వే స్టేషన్‌లోని గవర్నమెంట్ రైల్వే పోలీస్ స్టేషన్‌ను సందర్శించిన ఆయన రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. రైల్వే స్టేషన్లలో, రైళ్లలో బీట్స్‌ను పెంచడం ద్వారా దొంగతనాలను గణనీయంగా తగ్గించగలిగామన్నారు. చోరీకి గురైన బంగారు ఆభరణాలను రికార్డు స్థాయిలో రికవరీ చేసి బాధితులకు అందించామన్నారు. గతేడాది అక్టోబర్ నుంచి ఈ సంవత్సరం అక్టోబర్ వరకు సుమారు కేజీన్నర బంగారాన్ని రికవరీ చేశామన్నారు.
ఇటీవల తణుకులో బీహార్, హర్యానా దొంగల ముఠాలను అరెస్టు చేసినట్లు చెప్పారు. జీఆర్పీ స్టేషన్లలో సరిపడా సిబ్బంది ఉన్నారని, దీంతో నేరాలకు అడ్డుకట్ట వేయగలిగామన్నారు. ఇటీవల కాలంలో రైళ్లలో చోరీలు తగ్గాయన్నారు. రాత్రిపూట రైళ్లలో గస్తీని పెంచామని చెప్పారు. రైల్వే స్టేషన్లలో తప్పిపోయిన బాలలను తల్లిదండ్రులకు అప్పగించడం, అనాధలను చైల్డ్‌హోమ్‌కు తరలిస్తున్నట్లు చెప్పారు. ఇటీవల తప్పిపోయి స్టేషన్లలో తిరుగుతున్న నలుగురు పిల్లలను వారి తల్లిదండ్రులకు అప్పగించామన్నారు. కేసులు పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రస్తుతం జంక్షన్ రైల్వే స్టేషన్‌లో శిథిలావస్థలో ఉన్న జీఆర్పీ స్టేషన్‌ను ఒకటో నెంబర్ ప్లాట్‌ఫామ్‌పైకి తరలిస్తున్నట్లు ఆయన చెప్పారు. భీమవరం జీఆర్పీలో పలు కేసులను త్వరితగతిన పరిశీలించాలని ఎస్సై ఏఎల్‌ఎస్ రవికుమార్‌కు సూచించారు. డీఎస్పీ వెంట జీఆర్పీ ఇన్‌చార్జి సీఐ కె.రాజీవ్‌నాయుడు, సిబ్బంది ఉన్నారు.
రైళ్లలో చోరీ ముఠాలపై నిఘా పెంపు
Published Tue, Nov 19 2013 2:54 AM | Last Updated on Sat, Aug 11 2018 6:04 PM
Advertisement