ఎండుతున్న ఆశలు..!
కర్నూలు(అగ్రికల్చర్): అదును దాటుతుండటంతో అరకొర పదునులోనే జిల్లాలో పంటలు విస్తారంగా సాగు చేశారు. అయితే వర్షాలు లేకపోవడంతో ఇవి చేతికొచ్చే పరిస్థితి కానరావడం లేదు. ఖరీఫ్ సాధారణ సాగు 5.85 లక్షల హెక్టార్లు ఉండగా, ఇప్పటి వరకు 4.11 లక్షల హెక్టార్లలో పంటలు వేశారు. గతేడాది ఇదే సమయానికి 3.13 లక్షల హెక్టార్లు మాత్రమే సాగైంది. గతేడాదితో పోలిస్తే ఈ సారి దాదాపు లక్ష హెక్టార్లలో పంటలు అధికంగా సాగయ్యాయి. అయితే పదునైన వర్షాలు లేకపోవడంతో పైర్లలో ఎదుగుదల లోపించింది.
తగిన తేమ శాతం లేకపోవడంతో మొక్కల పెరుగుదలలో అభివృద్ధి కనిపించడం లేదు. జూన్ నెల సాధారణ వర్షపాతం 77.1 మి.మీ. ఉండగా 66.5 మి.మీ. మాత్రమే నమోదు అయింది. జూలై నెలలో 117 మి.మీ. సాధారణ వర్షపాతం ఉండగా 102 మి.మీ. మాత్రమే నమోదయింది. ఆగస్టు నెలలో 135 మి.మీ. వర్షపాతం నమోదు కావాల్సి ఉంది. మొదటి వారంలో జిల్లా మొత్తం మీద సగటున 34 మి.మీ. వర్షపాతం నమోదు కావాల్సి ఉంది. అయితే ఈ నెలలో ఇంతవరకు వర్షాల జాడ లేదు.
ఈ ఏడాది జిల్లాలో పత్తి విస్తారంగా వేశారు. సాధారణ సాగు 1,08,983 హెక్టార్లు ఉండగా 2,19,131 హెక్టార్లలో వేశారు. పత్తిలో పెట్టుబడి వ్యయం కూడా ఎక్కువగా ఉంది. అధిక దిగుబడులు రావాలంటే వర్షాలు పడాల్సి ఉంది. చినుకు జాడ లేకపోవడంతో పత్తితో పాటు వేరుశనగ, ఆముదం, కంది, మొక్కజొన్న, కొర్ర తదితర పంటలు కూడా క్రమంగా దెబ్బతింటున్నాయి. మరో పది రోజుల్లో వర్షం కురవకపోతే పంటలు దారుణంగా దెబ్బతింటాయని వ్యవసాయాధికారులు చెబుతున్నారు.
పంట రుణాలు లేనట్లే..
ఖరీఫ్ సీజన్ చురుగ్గా సాగుతున్నా.. రైతులకు బ్యాంకులు పంట రుణాలు పంపిణీ చేస్తున్న దాఖలాలు లేవు. ఈ ఏడాది పంట రుణాలుగా రూ.2888 కోట్లు పంపిణీ చేయాలనేది లక్ష్యం కాగా ఇప్పటి వరకు రూ.170.10 కోట్లు మాత్రమే రుణాలు పంపిణీ చేశారు. కొంతమంది రైతులు పంటల బీమా కోసం గతేడాది తీసుకున్న రుణాలను ప్రస్తుతం రెన్యూవల్ చేసుకుని కొత్త వాటిగా మార్చుకుంటున్నారు. దీంతో రూ.170 కోట్లు పంపిణీ చేసినట్లు బ్యాంకర్లు లెక్కలు చెబుతున్నారు.
మామూలుగా అయితే ఈ సమయానికి ఖరీఫ్ పంట రుణాల టార్గెట్‌లో 75 శాతం లక్ష్యాన్ని అధిగమించి ఉండాలి. రుణమాఫీ విషయంలో చంద్రబాబు వైఖరిలో స్పష్టత లేకపోవడం, ఇంతవరకు బ్యాంకులకు ఎటువంటి మార్గదర్శకాలు అందకపోవడంతో రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. బ్యాంకులు రుణాలు ఇవ్వకపోవడంతో జిల్లా వ్యాప్తంగా రైతులు ప్రైవేటు వ్యక్తుల దగ్గర రూ.500 కోట్లు అప్పులు తెచ్చి పంటలు వేశారు.
పెరుగుతున్న వరిసాగు.. ఎరువులకు డిమాండ్..
కర్ణాటకలో భారీ వర్షాలు పడటం.. అక్కడి ప్రాజెక్టులు నిండి దిగువకు నీరు విడుదల చేయడంతో ఆయకట్టు రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ఎల్లెల్సీ, కేసీ కెనాల్‌కు నీరు విడుదల చేయడంతో వరి సాగు పెరుగుతోంది. సాధారణ సాగు 88645 హెక్టార్లు ఉండగా, 6531 హెక్టార్లలో వరినాట్లు పడ్డాయి. ఎట్టకేలకు వరినాట్లు ఊపందుకోవడంతో ఎరువులకు డిమాండ్ పెరిగింది. యూరియాతోపాటు డీఏపీ కొన్ని రకాల కాంప్లెక్స్ ఎరువులను అధిక ధరలకు అమ్ముతుండటం గమనార్హం. ఎరువుల బ్లాక్ మార్కెటింగ్‌పై వ్యవసాయాధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.