
సాక్షి, అమరావతి: తెలుగు ప్రజల ముఖ్య పండుగ సంక్రాంతికి గత రెండ్రోజుల నుంచి ప్రయాణ కష్టాలు రెట్టింపవుతున్నాయి. రద్దీకి తగ్గట్లు ఆర్టీసీ, రైల్వే శాఖలు బస్సులు, రైళ్లు నడపకపోవడంతో సొంతూళ్లకు వెళ్లే వారిలో పండుగ ఉత్సాహం నీరుగారిపోతోంది. బస్టాండ్లలో, రైల్వే స్టేషన్లలో ప్రయాణికులు నిల్చొని పడిగాపులు కాస్తున్నారు. ప్రయాణికుల వెతలు సర్కారు ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. ఆర్టీసీ ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సులు ఏ మూలకూ సరిపోవడం లేదు. 50 శాతం అదనపు చార్జీలు వసూలు చేస్తూ విజయవాడ సిటీలో తిరిగే సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్‌లను సుదూర ప్రాంతాలైన రాజమహేంద్రవరం, కాకినాడ, విశాఖపట్నంలకు తిప్పుతున్నారు. వీటిలో సూపర్ లగ్జరీ బస్సుల్లో వసూలు చేసే చార్జీలను వసూలు చేయడంతో ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఏడాదికోమారు వచ్చే పండుగకు ప్రభుత్వం చేస్తున్న ఏర్పాట్లు ఇవేనా? అంటూ ప్రయాణికులు మండిపడుతున్నారు. రెగ్యులర్ సర్వీసుల్ని నిలిపేసి ఆదాయం కోసం ప్రత్యేక బస్సులను తిప్పడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బస్టాండ్లలో రిజర్వేషన్ కౌంటర్ల ముందు భారీ క్యూలైన్లు దర్శనమిస్తున్నాయి. ఆదివారం ఏలూరు, ఒంగోలు, తాడేపల్లిగూడెం, తణుకు ప్రాంతాలకు వెళ్లేందుకు ప్రయాణికులు నానాపాట్లు పడాల్సి వచ్చింది. వృద్ధులు, పిల్లలతో కలిసి సొంతూరికి వెళ్లే వారికి సీటు కోసం కష్టాలు తప్పలేదు. రద్దీకి తగ్గట్లు అదనపు కౌంటర్లు ఏర్పాటు చేయడం లేదు. 15 నుంచి 20 కిలోమీటర్లు తిరిగే బస్సులను 200 కిలోమీటర్ల ప్రయాణానికి వినియోగిస్తూ రూ.200 నుంచి రూ.250 వరకు వసూలు చేయడంపై ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీ అధికారులు కేవలం దూర ప్రాంత సర్వీసులపై దృష్టి కేంద్రీకరించారే తప్ప సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల్ని పట్టించుకోకపోవడంతో వారి ఇబ్బందులు వర్ణనాతీతమయ్యాయి. రైళ్లలో నిల్చొనేందుకు జాగా లేకపోవడంతో ప్రయాణం నరకంగా మారిందని పలువురు ప్రయాణికులు వాపోతున్నారు. ఈ ప్రయాణ కష్టాలు ఈనెల 21 వరకు తప్పేలా లేవని ఆర్టీసీ వర్గాలు చెప్పడం గమనార్హం.
రహదార్లపై తగ్గని రద్దీ
హైదరాబాద్–విజయవాడ, విజయవాడ–చెన్నై జాతీయ రహదార్లపై ఆదివారం రద్దీ తగ్గలేదు. టోల్‌గేట్ల వద్ద కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోతోంది. టోల్ రుసుం రద్దు చేశామని ప్రభుత్వం ప్రకటించినా.. తమకు ఎలాంటి ఆదేశాలు రాలేదని వాహనదారులతో నిర్వాహకులు చెబుతున్నారు. కనీసం అదనపు కౌంటర్లు కూడా ఏర్పాటు చేయకపోవడంతో గంటల తరబడి నిరీక్షణ తప్పడం లేదు.
జన్ సాధారణ్ రైళ్లను ప్రకటించిన రైల్వే శాఖ
పండుగ రద్దీ దృష్ట్యా ఏడు జన్ సాధారణ్ ప్రత్యేక రైళ్లను రైల్వే శాఖ ప్రకటించింది. సాధారణ రైలు చార్జీలతో ఈ రైళ్లలోని ఏ బోగీలో అయినా కూర్చుని ప్రయాణించవచ్చు. ఈ రైళ్లలో సికింద్రాబాద్ నుంచి విజయవాడకు రూ.130, విజయవాడ నుంచి హైదరాబాద్ కు రూ.135, కాకినాడ నుంచి తిరుపతికి రూ.175, విజయనగరం, విజయవాడ మధ్య ప్రయాణానికి రూ.145 టికెట్ ధరను నిర్ణయించినట్టు రైల్వే అధికారులు ప్రకటించారు.
దండుకుంటున్న ప్రైవేటు ఆపరేటర్లు
సంక్రాంతి రద్దీ ప్రైవేటు ఆపరేటర్లకు వరంగా మారింది. విజయవాడ నుంచి ఏలూరుకు సాధారణ రోజుల్లో కారులో వెళితే రూ.70 వసూలు చేస్తారు. ఇప్పుడు రూ.200 నుంచి రూ.300 వరకు వసూలు చేస్తున్నారు. అదేమంటే ఇష్టమైతే రండి..లేకుంటే పొండి.. అని ప్రైవేటు ఆపరేటర్లు చెబుతున్నారని, చేసేదేమీ లేక అడిగినంత ఇవ్వాల్సి వస్తోందని ప్రయాణికులు వాపోతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment