
సాక్షి, గుంటూరు: తాడేపల్లి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో స్వతంత్ర దినోత్సవ వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శాసన మండలి చీఫ్ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు పార్టీ కార్యాలయంలో జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దేశ, రాష్ట్ర ప్రజలకు 73వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ స్వాతంత్ర్య దినోత్సవానికి రెండు ప్రత్యేకతలు ఉన్నాయన్నారు. ఒకటి.. కశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దుతో దేశానికి పూర్తి స్థాయి స్వతంత్రం లభించిగా.. రెండు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారన్నారు.
గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం కోసం జగన్‌మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారని తెలిపారు. పంచాయతీలకు పూర్తి స్థాయి అధికారాలు అందజేసి.. గ్రామ సచివాలయం నుంచే పరిపాలన అందించనున్నారని పేర్కొన్నారు. గ్రామ వలంటీర్ల ద్వారా ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందజేయనున్నారని తెలిపారు. రెండున్నర నెలల పాలనలో సీఎం జగన్ అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారని ప్రశంసించారు.
యావత్ దేశం దృష్టిని ఆకర్షించేలా అభివృద్ధి: గట్టు శ్రీకాంత్ రెడ్డి
73వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా లోటస్ పాండ్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు డా. గట్టు శ్రీకాంత్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దేశ ప్రజలకు 73వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. రాబోయే రోజుల్లో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెంది, బంగారు తెలంగాణ దిశగా అడుగులు వేయాలని ఆకాంక్షించారు. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు విభజన సమస్యలు పరిష్కరించుకొని యావత్తు దేశం తమ వైపు చూసే విధంగా అభివృద్ధి చెందాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment