
దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మన్‌ను ఔట్ చేసిన ఆనందం
సాక్షి, విజయనగరం: టాస్ పడింది. ఆట ఆరంభమైంది. విజయనగరం జిల్లా క్రికెట్ అభిమానుల కల నేరవేరింది. మొట్టమొదటి సారిగా అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ తిలకించే అవకాశం జిల్లా అభిమానులకు లభించింది. ఎప్పుడూ ఎంతో కష్టపడి టిక్కెట్లు సంపాదించి... విశాఖ వెళ్లి ఆట చూసి సంతృప్తి చెందే క్రీడాభిమానులకు స్థానికంగానే వారి ఆట చూసే అవకాశం... అదీ ఉచితంగా లభించడంతో ఇక వారి ఆనందానికి అవధులు లేకుం డా పోయాయి. ఓ వైపు రోహిత్‌శర్మ... మరో వైపు జడేజా... ఉమేష్ యాదవ్ వంటి భారతీయ క్రికెట్ దిగ్గజాలనే కాకుండా... దక్షిణాఫ్రికా యోధుల్ని ప్రత్యక్షంగా చూసే అదృష్టం దక్కింది. మూడు రోజుల పాటు ఇండియా బోర్డ్ ప్రెసిడెంట్స్ ఎలెవన్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరగాల్సిన సన్నాహక టెస్ట్ మ్యాచ్ రెండో రోజు శుక్రవారం ప్రారంభమైంది. భారీ సంఖ్యలో తరలివచ్చిన అభిమానులు తమ అభిమాన క్రికెటర్లను, వారి ఆటను ప్రత్యక్షంగా వీక్షించి కేరింతలు కొట్టారు.
ఇరు జట్ల క్రీడాకారులు మైదానం వద్దకు చేరుకున్నప్పటి నుంచి తిరిగి విశాఖ వెళ్లేంత వరకు పెద్ద ఎత్తున సందడి చేశారు. క్రీడాకారులను తమ సెల్‌ఫోన్‌లలో బంధించేందుకు పోటీపడ్డారు. కొందరు అభిమానులు భారత త్రివర్ణ పతకాన్ని ఎగురవేస్తూ ఇండియా బోర్డ్ ప్రెసిడెంట్స్ ఎలెవన్ జట్టుకు మద్దతు పలికారు. మరికొందరు రోహిత్.. రోహిత్ అంటూ భారత్ స్టార్ బ్యాట్స్‌మన్ పేరును పెద్ద పెట్టున మార్మోగించారు. ప్రత్యర్ధి ఎవరనే పట్టింపులేకుండా దక్షిణాఫ్రికా జట్టు బ్యాట్స్‌మన్లు బౌండరీలు బాదినపుడు ఉరకలేసే ఉత్సాహంతో ఉప్పొంగిపోయారు. దీంతో మ్యాచ్‌కు అతిధ్యమిచ్చిన డెంకాడ మండలం చింతలవలస గ్రామంలో క్రీడోత్సాహం వెల్లివిరిసింది. మ్యాచ్ ముగిసిన అనంతరం విశాఖ వెళుతున్న రోహిత్‌శర్మకు ఎంవీజీఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థినులు మున్నీషా, కమల, రేష్మలు పెయింటింగ్ బహూకరించారు. రోహిత్ 45వ నంబర్ జెర్సీతో సెంచరీ అభివాదం చేస్తున్నట్లు ఈ పెయింటింగ్ వేశారు.
3గం. 50 నిమిషాల పాటు సాగిన మ్యాచ్
ఇండియా బోర్డ్ ప్రెసిడెంట్స్ ఎలెవన్– దక్షిణాఫ్రికా జట్ల మధ్య మూడు రోజుల పాటు నిర్వహించతలపెట్టిన సన్నాహక టెస్ట్ మ్యాచ్ మొదటి రోజు వర్షం కారణంగా పూర్తిగా రద్దయిన విషయం విదితమే. శుక్రవారం ఉదయం నుంచి వాతావరణం అనుకూలించటంతో డాక్టర్ పి.వి.జి.రాజు ఏసీఏ స్పోర్ట్స్ కాంప్లెక్స్ క్రీడామైదానం నిర్వాహకులు మ్యాచ్ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేశారు. మధ్యాహ్నం 12.10 గంటలకు ప్రారంభమైన మ్యాచ్ సాయంత్రం 4 గంటల వరకు సాగింది. మరల కారుమబ్బులు కమ్ముకోవటంతో మ్యాచ్ నిలిచిపోయింది. వెలుతురు లేమి కారణంగా మ్యాచ్‌ను నిలిపివేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. ఉదయం 10 గంటల సమయానికి విశాఖ నుంచి మైదానానికి చేరుకున్న ఇరుజట్ల క్రీడాకారులు గంటన్నర పాటు సాధన చేశారు. వాతావరణం అనుకూలిస్తే మూడో రోజైన శనివారం మ్యాచ్ కొనసాగనుంది.
మార్క్రమ్ సెంచరీ... దక్షిణాఫ్రికా 199/4
మూడు రోజుల పాటు నిర్వహించతలపెట్టిన సన్నాహక మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఓపెనర్ మార్క్రమ్ సెంచరీ చేశారు. టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా జట్టు మొదట బ్యాటింగ్ ప్రారంభించగా.. ఓపెనర్లు మార్క్రమ్, డిఎన్ ఎల్గర్‌లు బ్యాటింగ్ ప్రారంభించారు. బోర్డ్ ప్రెసెడెంట్స్ ఎలెవన్ జట్టు పేసర్ ఉమేష్‌యాదవ్ తొలి ఓవర్ బౌల్ చేశారు. మ్యాచ్ ఆరంభం నుంచి ధాటిగా ఆడిన మక్రమ్ 118 బంతుల్లో 100 పరుగులు సాధించి రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. ఆట నిలిచిపోయే సమయానికి దక్షిణాఫ్రికా జట్టు 50 ఓవర్లలో 199 పరుగులకు 4 వికెట్లు కోల్పోయింది. దక్షిణాఫ్రికా బ్యాటింగ్‌లో మక్రమ్ 118 బంతుల్లో 100(రిటైర్డ్ హర్ట్) పరుగులతో వెనుదిరగగా.. డీఎల్గర్ 18 బంతుల్లో 6 పరుగులు, తునీస్ డి బ్రుయన్ 17 బంతుల్లో 6 పరుగులు, హమజా 26 బంతుల్లో 22 పరుగులు వద్ద పెవిలియన్‌దారి పట్టారు. మ్యాచ్ నిలిచిపోయే సమయానికి టింబా బవుమ 92 బంతుల్లో 55 పరుగులు(నాటౌట్), కెపెన్ డూప్లెసిస్ 29 బంతుల్లో 9 పరుగులు(నాటౌట్) చేశారు.
బోర్డ్ ప్రెసిడెంట్ ఎలెవెన్ బౌలింగ్: ఉమేష్ యాదవ్ 7 ఓవర్లలో 31/1, సర్దూల్ 10 ఓవర్లలో 34/0, ఇసాన్ పోరెల్ 6 ఓవర్లలో 11/1, అవాస్ ఖాన్ 10 ఓవర్లలో 44/0, జలజ్ సక్సేనా 7 ఓవర్లలో 26/0, డి ఎ జడేజా 10 ఓవర్లలో 52/2.
వికెట్లు పతనం: 1–23, 2–33, 3–78, 4–199
Comments
Please login to add a commentAdd a comment