సాక్షి, విమానాశ్రయం(గన్నవరం): ఇండిగో విమాన సంస్థ ఎట్టకేలకు గన్నవరం విమానాశ్రయానికి సర్వీసులు నడిపేందుకు ముందుకు వచ్చింది. వచ్చే ఏడాది మార్చి 2వ తేదీ నుంచి దేశంలోని మెట్రో నగరాలైన బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ నుండి ఇక్కడికి రోజుకు పది విమాన సర్వీసులను నడపనుంది. ఈ మేరకు ప్రయాణ షెడ్యుల్‌ను విడుదల చేయడంతోపాటు టికెట్ బుకింగ్‌ను కూడా ప్రారంభించింది. ఇండిగో నూతనంగా కొనుగోలు చేసిన 74 సీటింగ్ కెపాసిటి కలిగిన ఏటీఆర్ 72–600 విమానాలను నడపనుంది. ఇక్కడి నుంచి సర్వీసులు నడిపేందుకు ఇండిగో సంస్థ గతేడాది కాలంగా సన్నాహాలు చేస్తుంది. వచ్చే ఏడాది జనవరిలోనే సర్వీసులు ప్రారంభించాల్సి ఉండగా, అనివార్య కారణాలతో వాయిదా వేసుకుంటూ వచ్చింది. ఈ నేపథ్యంలో సర్వీసులను నడిపేందుకు అధికారిక వెబ్‌సైట్‌లో వెల్లడించింది. ఇండిగో ఏటీఆర్ రాకతో గన్నవరం విమానాశ్రయానికి సర్వీసులు గణనీయంగా పెరగడంతోపాటు ప్రయాణికుల ఆదరణ కూడా పెరుగుతుందని ఎయిర్‌పోర్టు వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.
సర్వీసుల వివరాలు
హైదరాబాద్ నుంచి ఉదయం 7.35కు, మధ్యాహ్నం 13.50, రాత్రి 20.10కు విమానాలు ఇక్కడికి చేరుకుంటాయి. తిరిగి ఇక్కడి నుండి మధ్యాహ్నం 12.10, సాయంత్రం 18.45, రాత్రి 21.35కు హైదరాబాద్‌కు బయలుదేరతాయి. ఇక్కడి నుంచి ఉదయం 8 గంటలకు విమానం బయలుదేరి 9.35కు బెంగళూరు చేరుకుని, అక్కడి నుంచి 10.15కు బయలుదేరి 11.50కు ఇక్కడికి చేరుకుంటుంది. ఇక్కడి నుంచి ఉదయం 15.15కు విమానం బయలుదేరి 16.35కు చెన్నైకు చేరుకుంటుంది. తిరిగి చెన్నై నుంచి 16.55కు బయలుదేరి 18.25కు గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుంటుందని ఇండిగో ప్రతినిధులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment