జిల్లాల్లో ఐకేపీ ఉద్యమ సెగలు | Indira Kranti scheme movement heat hits AP government | Sakshi
Sakshi News home page

జిల్లాల్లో ఐకేపీ ఉద్యమ సెగలు

Published Tue, Dec 23 2014 3:04 AM | Last Updated on Sat, Sep 2 2017 6:35 PM

Indira Kranti scheme movement heat hits AP government

* 17 నెలల జీతాలివ్వడం లేదంటూ సర్కారుపై నిప్పులు
* సోమవారం చలో అసెంబ్లీకి తరలివస్తున్న ఉద్యోగుల అరెస్టు
* అరెస్టులు, నిర్బంధాలకు నిరసనగా అసెంబ్లీలో జగన్ వాకౌట్
* సర్కారు దమనకాండకు నిరసనగా జిల్లాల్లో ఆందోళనలు
* రాజధానిలో 600 మందిని అరెస్టు చేసి ఛలో అసెంబ్లీని భగ్నం చేసిన పోలీసులు


సాక్షి, విజయవాడ బ్యూరో: ఇందిరా క్రాంతి పథకం(ఐకేపీ) యానిమేటర్లు సోమవారం రాష్ట్రమంతటా ఉద్యమించారు. 27వేల కుటుంబాలు 15నెలలుగా జీతాలు రాకుండా ఇబ్బందులు పడుతున్నా సర్కారు పట్టించుకోవడంలేదంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. నెలకు కేవలం రూ.2 వేల గౌరవ వేతనంతో అర్ధాకలితో జీవిస్తున్న తమ పరిస్థితిని అర్థం చేసుకోకుండా నిర్బంధకాండను కొనసాగించడంపై విరుచుకుపడ్డారు.

 ఐకేపీ వీఓఏలు సోమవారం నిర్వహించిన ‘ఛలో అసెంబ్లీ’ కార్యక్రమాన్ని భగ్నం చేసేందుకు ప్రభుత్వం ఆదివారం రాత్రి నుంచి అన్ని ప్రయత్నాలు చేసింది. ఏపీలోని అన్ని బస్టాండ్, రైల్వేస్టేషన్‌ల వద్ద మోహరించిన పోలీసు బలగాలు ఐకేపీ యానిమేటర్లు హైదరాబాద్ వెళ్లకుండా అడ్డుకున్నాయి. వారికి నాయకత్వం వహించే మహిళలు, సీఐటీయూ నాయకుల ఇళ్ల వద్దకు వెళ్లి రాత్రి సమయంలో వారిని అదుపులోకి తీసుకుంది. నిర్బంధాన్ని నిరసిస్తూ సోమవారం అన్ని జిల్లాల్లోనూ ఉద్యమ సెగలు రేగా యి. నిర్బంధాలకు నిరసనగా ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాం గ్రెస్ పా ర్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు. దీనిపై యాని మేటర్ల కుటుంబాలు హర్షం వ్యక్తంచేశాయి.

జిల్లాల్లో రేగిన ఉద్యమ సెగలు: ఐకేపీ వీఒఏలపై ప్రభుత్వ నిర్బంధకాండను నిరసిస్తూ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ ఉద్యమ సెగలు రేగాయి.  శ్రీకాకుళం జిల్లాలో 12పోలీస్ స్టేషన్‌ల వద్ద ధర్నాలు నిర్వహించారు.  అనంతపురం జిల్లాలోని హిందూపురం, తాడిపత్రి, ధర్మవరంలో సీఎం దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. కడప జిల్లా కలెక్టరేట్ వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. చిత్తూరు జిల్లాలో ఐకేపీ యానిమేటర్ల అరెస్టులు కొనసాగాయి. విశాఖ, తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. పశ్చిమగోదావరి జిల్లాలో నల్లబ్యాడ్జీలు ధరించిన సీఐటీయూ కార్యకర్తలు, ఐకేపీ యానిమేటర్లు నిరసన ప్రదర్శన, ధర్నాలు నిర్వహించారు.

 కృష్ణా జిల్లా విజయవాడ సబ్‌కలెక్టర్ కార్యాలయాన్ని సీఐటీ యూ, ఐకేపీ ఆధ్వర్యంలో ముట్టడి కార్యక్రమం నిర్వహించారు.  గుంటూరులో కలెక్టరేట్ వద్ద ఆందోళన చేశారు. కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో సీఎం దిష్టిబొమ్మలు దగ్ఢం చేశారు. ప్రకాశం జిల్లాలో సీఐటీయూ, వీఓఏలు ధర్నాలు నిర్వహించారు.  అక్రమ అరెస్టులు చేయడాన్ని నిరసిస్తూ ఉద్యమాలను తీవ్రతరం చేస్తామంటూ ఏపీ అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పెర్స్ యూనియన్(సీఐటీయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రోజా ప్రకటించారు. హైదరాబాద్‌లో పలు చోట్ల ఐకేపీ ఉద్యోగులు ఆందోళన చేశారు. సుమారు ఆరు వందల మంది అరెస్ట్ అయ్యారు.

ఐకేపీ యానిమేటర్ల అరెస్టు అప్రజాస్వామికం
వారి ఆందోళనకు మద్దతు: జగన్
సాక్షి, హైదరాబాద్: తమ సమస్యల సాధన కోసం చలో అసెంబ్లీ ఆందోళన నిర్వహిస్తున్న ఐకేపీ యానిమేటర్లకు వైఎస్సార్ కాంగ్రెస్ నాయకుడు, ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డి తన సంపూర్ణ మద్దతు ప్రకటించారు. వారి ఆందోళనకు సంఘీభావం తెలిపారు. తమ సమస్యల సాధన కోసం చలో అసెంబ్లీ కార్యక్రమంలో పాల్గొనడానికి హైదరాబాద్ తరలివస్తున్న ఐకేపీ యానిమేటర్లను ఎక్కడికక్కడ అరెస్టులు చేశారు.

అసెంబ్లీలో ఉన్న జగన్‌కు ఆ విషయం తెలిసిన వెంటనే యానిమేటర్ల రాష్ట్ర సంఘం ప్రధాన కార్యదర్శి కె.ధనలక్ష్మితో ఫోన్‌లో మాట్లాడారు. అప్రజాస్వామికంగా జరిగిన ఈ అరెస్టులను తాను ఖండిస్తున్నానన్నారు. యానిమేటర్ల పట్ల ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తూ ఆందోళనకు తాను పూర్తి మద్దతు నిస్తున్నానని ఆమెకు ఫోన్‌లో జగన్ చెప్పారు. మహిళలు అనే విషయం కూడా విస్మరించి అన్యాయంగా వారిని పోలీస్‌స్టేషన్‌కు తరలించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు.

జగన్ మాకు నైతిక మద్దతునిచ్చారు
ధనలక్ష్మి సమస్యల సాధన కోసం తాము చేస్తున్న పోరాటానికి విపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డి ఫోన్ చేసి మద్దతు ప్రకటించడం తమకు ఎంతో నైతిక బలాన్ని ఇచ్చిందని కె.ధనలక్ష్మి పేర్కొన్నారు. వాస్తవానికి జగన్ తమను ప్ర త్యక్షంగా పరామర్శించేందుకు పోలీసు స్టేష న్‌కే రావాలని భావించారని, అయితే శాసనసభా సమావేశాల విరామ సమయం తక్కువ గా ఉండటం, తమను అరెస్టు చేసి ఉంచిన బొ ల్లారం పోలీస్‌స్టేషన్ అసెంబ్లీకి చాలా దూరంగా ఉండటంతో రాలేకపోయానని  వివరించారని ఆమె తెలిపారు. ప్రతిపక్ష నేత గా తమ సమస్యలను, ఆందోళనను అసెం బ్లీలో ప్రస్తావించడమే కాక వాకౌట్ చేయడం పట్ల జగన్‌కు ధన్యవాదాలు తెలిపారు.

ఆ హక్కు కూడా వారికి లేదా?
సాక్షి, హైదరాబాద్: ఐకేపీ వీఓఏలును ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేయడంపై సభ్యుల ఆందోళనతో సోమవారం శాసన మండలి దద్దరిల్లింది.   మొదట ఈ అంశంపై విటపు బాలసుబ్రమణ్యం మాట్లాడుతూ కాంగ్రెస్ హయాంలో  యానిమేటర్లు చేసిన ఆందోళనకు టీడీపీ నేతలు మద్దతు పలికి.. ఇప్పుడేమో  నిర్బంధించడం ప్రభుత్వ నిరంకుశ పాలనకు నిదర్శనమని మండిపడ్డారు. అదే సమయంలో  నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వ్యంగ్యంగా మాట్లాడటంతో.. టీడీపీ మినహా మిగిలిన పార్టీలకు చెందిన సభ్యులు ఆగ్రహంతో ఒక్కసారిగా పోడియం వద్దకు దూసుకొచ్చి బైఠాయించారు.  చర్చల సమయంలో మండలి సభ్యుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటామని మంత్రి యనమల హామీ ఇవ్వడంతో సభ్యులు శాంతించారు.  

ఐకేపీలపై సర్కారు తీరుకు నిరసనగా వాకౌట్
సాక్షి, హైదరాబాద్: కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ సిబ్బంది, ఇందిరా క్రాంతిపథం (ఐకేపీ) కింద గంటల వారీ పద్ధతిన పని చేయించుకుంటున్న సిబ్బంది క్రమబద్ధీకరణ అంశంపై సోమవారం ఏపీ శాసనసభలో తీవ్ర దుమారం చెలరేగింది. ఈ తరహా ఉద్యోగుల్ని క్రమబద్ధీకరించాల్సిన పని లేదని అధికార పక్షం అడ్డం తిరగగా.. ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీని విస్మరిస్తారా అంటూ విపక్షం ధ్వజమెత్తింది. పరస్పర వాగ్వాదం, ఆరోపణలతో సభ దద్దరిల్లింది. అధికార పక్షం తీరుకు నిరసనగా ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ నుంచి వాకౌట్ చేసింది. ఎమ్మెల్యేలు ఎస్.వి.మోహన్‌రెడ్డి, భూమా నాగిరెడ్డి అడిగిన ప్రశ్నకు ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు సమాధానమిస్తూ ‘కాదు, లేదు, ఆ ప్రసక్తే లేదు’ అంటూ ముక్తసరిగా జవాబు చెప్పినప్పుడు ప్రతిపక్షం ఆగ్రహం వ్యక్తం చేసింది.  

వైఎస్ హయాంలో లక్షన్నర ప్రైవేటు ఉద్యోగాలు వస్తే ఇప్పుడు వాటి ఊసే లేకుండా పోయిందన్నారు. రిటైర్డ్ ఉద్యోగులను తిరిగి నియమించే కన్నా కొత్తవారికి ఉద్యోగాలు ఇవ్వాలని, ఉర్దూ బ్యాక్‌లాగ్ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ ఐకేపీ యానిమేటర్ల సమస్యను, వారి అరెస్టును ప్రస్తావించారు. దీనికి మంత్రి యనమల జవాబిస్తూ ప్రతిపక్షం డిమాండ్లు నెరవేర్చాలంటే చాలా సమయం పడుతుందని ఒకింత వ్యం గంగా వ్యాఖ్యానించారు.  కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ సాధ్యాసాధ్యాలను పరిశీ లించేందుకు ఒక కమిటీని నియమించామని పేర్కొన్నారు. సభ్యులు సభ మధ్యలోకి దూ సుకు వచ్చే ప్రయత్నం చేయడంతో  జగన్‌మోహన్‌రెడ్డిని మాట్లాడాల్సిందిగా స్పీకర్ కోరారు.  

ఇది నిరంకుశ పాలన: జగన్
జగన్ మాట్లాడుతూ.. కాంట్రాక్ట్ ఉద్యోగుల పట్ల ప్రభుత్వ తీరును తీవ్రంగా నిరసిం చారు. యానిమేటర్లు హైదరాబాద్ వచ్చి నిరసన తెలపాలనుకుంటే దారిమధ్యలోనే అరెస్ట్ చేశారని, ఇది నిరంకుశ పాలనని దుయ్యబట్టారు. ‘‘కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని, జాబు కావాలంటే బాబు రావాలని ఎన్నికల ప్రణాళికలో చెప్పా రు. బాబు వచ్చాడు. ఈవేళ ఉన్న వాటిని తీసివేస్తున్నారు.

 ఇంటికో ఉద్యో గం ఏమైంది? రెండు వేల రూపాయల నిరుద్యోగ భృతి ఇవ్వడం లేదు ఎందుకని? అవసరం తీరాక పట్టించుకోరా? మీ తీరును మేము నిరసిస్తున్నాం. ఈ వైఖరికి వ్యతిరేకంగా మేం సభ నుంచి వాకౌట్ చేస్తున్నాం’’ అని ప్రకటించారు. ఆయనతోపాటు వైఎస్సార్ సీపీ సభ్యులంతా సభ నుంచి వాకౌట్ చేశారు. ఆ పార్టీ ఎమ్మెల్యేలు వై.విశ్వేశ్వరరెడ్డి, పి.రవీంద్రనాథ్‌రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, సర్వేశ్వరరావు, ఐజయ్య, నారాయణస్వామి తదితరులు మీడి యా పాయింట్ వద్ద మాట్లాడారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజ్‌పై ప్రభుత్వం నియంతృత్వంతో వ్యవహరిస్తోందని మండిపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement