నెల్లూరు (దర్గామిట్ట), న్యూస్‌లైన్ : రాష్ట్ర విభజన సెగ ఇందిరమ్మ ఇళ్లకు తాకింది. ఒక వైపు రాష్ట్ర విభజన, మరోవైపు సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రెండు నెలలుగా ఇందిరమ్మ లబ్ధిదారులకు చెల్లింపులు నిలచిపోయాయి. అప్పోసప్పో చేసి నిర్మాణాలు పూర్తి చేసుకున్న పలువురు లబ్ధిదారులు బిల్లులు కోసం పడిగాపులు కాస్తున్నారు. ఈ రీతిలో ఒక్క మన జిల్లా పరిధిలోనే సుమారు రూ.8 కోట్లు లబ్ధిదారులకు చెల్లించాల్సి ఉంది. సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతో వివిధ దశల్లో నిర్మాణాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి.
రాష్ట్ర విభజన ఒక కొలిక్కి వచ్చిన నేపథ్యంలో ఇకనైనా బిల్లులు చెల్లిస్తారనే ఆశతో లబ్ధిదారులు ఎదురు చూస్తున్నారు. జిల్లాలో మొత్తం మూడు విడతల్లో 3,13,268 ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయి. అవి ప్రస్తుతం వివిధ దశల్లో నిర్మాణాల్లో ఉన్నాయి. వీటిలో 1,03,702 ఇళ్లు ఇప్పటికీ నిర్మాణానికి నోచుకోలేదు. మరో 21,214 ఇళ్లు బేసిక్ లెవల్లో ఉండగా, లింటిల్ లెవల్లో 2,472 ఇళ్లు, రూఫ్ లెవల్‌లో 7,508 ఇళ్లు ఉన్నాయి. మరో 2,09,566 ఇళ్లు నిర్మాణం పూర్తి చేసుకున్నాయి. జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో 2,92,057 ఇళ్లు, పట్టణ ప్రాంతాల్లో 21,211 ఇళ్లు మంజూరు చేసినట్టు అధికారులు లెక్కలు చెబుతున్నారు. అందులో ఎస్సీ, ఎస్టీలకు కలిపి మొత్తం 1,52,443 ఇళ్లు మంజూరు చేశారు. ఈ ఏడాది మార్చి వరకు రాష్ట్ర ప్రభుత్వం జిల్లా వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్లకు రూ.774,99,75,471 కోట్లు విడుదల చేసింది. అయితే గృహ నిర్మాణ అధికారులు ఇంటి నిర్మాణాన్ని బట్టి లబ్ధిదారులు బిల్లులు చెల్లిస్తారు. ఎస్సీ, ఎస్టీలకు ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.1.05 లక్షలు, ఇతరులకు గ్రామీణ ప్రాంతాల్లో రూ.70 వేలు, పట్టణ ప్రాంతాల్లో రూ.80 వేలు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో ఎస్సీ, ఎస్టీలకు రూ.85 వేలు, ఇతరులకు రూ. 55 వేలు మాత్రమే చెల్లించారు. గృహ నిర్మాణ సామగ్రి పెరగడంతో ఇళ్ల నిర్మాణానికి లబ్ధిదారులు పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో ఆ మొత్తాన్ని పెంచారు. అందుకనుగుణంగా ఇంటి నిర్మాణం ఆధారంగా వివిధ దశల్లో లబ్ధిదారులకు అధికారులు బిల్లులు చెల్లిస్తారు.
బిల్లులు మంజూరు ఇలా..: గ్రామీణ ప్రాంతాల్లో ఇంటి నిర్మాణానికి మొత్తం 75 సిమెంట్ బస్తాలు ఇవ్వనున్నారు. ఇవిగాక బేసిక్ లెవల్‌కు రూ. 12,380, చార్జీల రూపంలో రూ. 2,100, రూఫ్‌లెవల్‌కు రూ.25,220, చార్జీల రూపంలో రూ.1100, ప్లాస్టింగ్ లెవల్‌కు రూ. 14,400, అదనపు చార్జీలు రూపంలో రూ. 1000 కలిపి మొత్తం రూ. 70 వేలు మంజూరు చేయనున్నారు. పట్టణ ప్రాంతాల్లో 75 సిమెంట్ బస్తాలు ఇవ్వనున్నారు.
బేసిక్ లెవల్‌కు రూ.12,380, అదనపు చార్జీలు రూ. 5,100, రూఫ్‌లెవల్‌కు రూ. 32,120, అదనపు చార్జీల కింద రూ. 1200, ప్లాస్టింగ్‌కు రూ. 11,200, ఇతరత్రా కలిపి మొత్తం రూ. 80 వేలు చెల్లించనున్నారు. అదే ఎస్సీ, ఎస్టీల ఇళ్ల నిర్మాణాలకు 75 సిమెంట్ బస్తాలతో పాటు బేసిక్ లెవల్‌కు రూ. 17,380, అదనపు చార్జీలకు రూ. 2100, రూఫ్‌లెవల్‌కు రూ. 34,670, అదనపు చార్జీల రూపంలో రూ. 1650, ప్లాస్టింగ్‌కు రూ. 33,900, అదనపు చార్జీల కింద రూ.1500 మొత్తం కలిపి రూ. 1.05 లక్షలు చె ల్లించనున్నారు.
రెండు నెలలుగా నిలిచిన చెల్లింపులు : రాష్ట్ర విభజన, సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఇందిరమ్మ లబ్ధిదారులకు బిల్లులు చెల్లింపులను నిలిపి వేశారు. సొంత ఇంటి కల నేరవేర్చుకుందామనుకున్న లబ్ధిదారులు నిర్మాణాలు త్వరిత గతిన పూర్తి చేసినా బిల్లులు చేతికి అందలేదు. జిల్లాలో మార్చి చివరి వారం నుంచి ఇప్పటి వరకు అధికారులు లబ్ధిదారులకు బిల్లులు చె ల్లించలేదు.
ఏప్రిల్‌కు సంబంధించి రూ. 3,69,21,475, మే నెలకు సంబంధించి రూ. 4,25,13,330 బిల్లులు ఆగిపోయాయి. ఇప్పటి వరకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి మొత్తం రూ. 7,94,34,805 బిల్లులు నిలిచిపోయాయి. నిర్మాణాలు పూర్తి చేసిన ఇళ్లకు సకాలంలో బిల్లులు చెల్లించక పోవడంతో మిగిలిన లబ్ధిదారులు తమ ఇళ్లను మధ్యలోనే నిలిపి వేశారు. నిర్మాణాలు పూర్తయితే బిల్లులు వస్తాయి కదా అని అప్పుచేసి ఇంటి నిర్మాణం పూర్తి చేసిన లబ్ధిదారులు బిల్లులు చేతికి అందక పోవడంతో లబోదిబోమంటున్నారు. పైగా అధికారులు జిల్లా గృహనిర్మాణ సంస్థకు సంబంధించి నివేదిక తయారు చేసే పనిలో నిమగ్నమయ్యారు. రాష్ట్ర విభజన ఒక కొలిక్కి వచ్చిన నేపథ్యంలో ఇప్పటికైనా ఇందిరమ్మ బిల్లులు వెంటనే చెల్లించాలని లబ్ధిదారులు కోరుతున్నారు.
‘ఇందిరమ్మ’కు విభజన సెగ
Published Sun, May 25 2014 2:22 AM | Last Updated on Sat, Oct 20 2018 6:17 PM
Advertisement
Advertisement