నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట) : రాష్ట్ర విభజన అనంతరం అక్టోబర్ 2 నుంచి ఆప్కాబ్ కూడా రెండు రాష్ట్రాల్లో రెండు కమిటీలతో పనులు ప్రారంభించే అవకాశం ఉందని ఆప్కాబ్ చైర్మన్ ఎన్.వీరారెడ్డి అన్నారు. జిల్లా కేంద్ర సహకార బ్యాంకును ఆయన మంగళవారం సందర్శించారు. అధికారులు, సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. విభజన ప్రక్రియ సామరస్యంగా జరుగుతుందన్నారు. రైతు రుణాలమాఫీతో వైఎస్సార్ హ యాంలో సహకార బ్యాంకులు పేద రైతులకు మరిం త చేరువయ్యాయన్నారు. 2004 సంవత్సరం నుంచి చిన్న, సన్నకారు రైతులు లబ్ధిపొందారని తెలిపారు. ఐదు ఎకరాల భూములున్న రైతులకు రుణాలమాఫీతోపాటు రూ.5 వేలు ప్రోత్సాహకాలుగా రైతులు అం దుకున్నారని తెలిపారు.
పస్తుతం రుణమాఫీ విషయమై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పష్టత లేకపోవడం రైతుల్లో గందరగోళ పరిస్థితి నెలకొందన్నారు. ఉమ్మడి ఆప్కాబ్‌లో రూ.8,343 కోట్లు వ్యవసాయ రుణాలు ఉన్నాయన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో రూ.5,625 కోట్లు, తెలంగాణ రాష్ట్రంలో రూ.2,720 కోట్ల రుణాలు ఉన్నాయన్నారు. ఇందులో నాబార్డుకు రూ.4,600 కోట్లు చెల్లించాల్సి ఉందన్నారు. నాబార్డుకు చెల్లించాల్సిన మొత్తం చెల్లిస్తే రానున్న రోజుల్లో రెండు రాష్ట్రాల్లో కలిపి 25 నుంచి 30 లక్షల మంది రైతులకు రుణాలను అందించే అవకాశం ఉందన్నారు.
ఆర్‌బీఐ, నాబార్డు నియమ నిబంధనల ప్రకారం రుణమాఫీ జరుగుతుందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో రూ.లక్ష రుణమాఫీ జరుగుతుందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేయడంతో రైతులు రుణమాఫీపై ఓ అభిప్రాయానికి వచ్చారన్నారు. ఆ రాష్ట్రంలో 15 నుంచి 19 కోట్ల వరకు రుణమాఫీ జరిగే అవకాశం ఉందన్నారు. అయితే ఆంధ్రప్రదేశ్‌లో రూ.70వేల నుంచి రూ.90వేల కోట్ల రుణాలపై స్పష్టత ఇంకా రాలేదన్నారు.
రుణమాఫీ జరిగితే చిన్న, సన్నకారు రైతులకు లాభమేనని తెలిపారు. ఆప్కాబ్ విభజన కూడా ఎటువంటి సమస్యలు లేకుండా జరుగుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఆప్కాబ్ 37 శాఖల్లో, తెలంగాణలో 35 శాఖలు ఉన్నాయన్నారు. దీంతో ఆస్తుల పంపకంలో బుక్ వ్యాల్యూ కాకుండా రిజిస్ట్రేషన్ వ్యాల్యూతో విభజన జరుగుతుందన్నారు.
బుక్ వ్యాల్యూను అనుసరించి ఆస్తులు కేవలం రూ.3 కోట్లు విలువ చేస్తుందన్నారు. రిజిస్ట్రేషన్ వ్యాల్యూ ప్రకారం ఆస్తులు రూ.60 కోట్ల విలువ ఉండడంతో ఆస్తుల పంపిణీలో రిజిస్ట్రేషన్ వ్యాల్యూనే ప్రాతిపదికగా తీసుకున్నామన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 22 డీసీసీబీలు 624 శాఖలతో కోర్ బ్యాంకింగ్ విధానంతో పనిచేస్తున్నాయన్నారు. విభజన అనంతరం ఉద్యోగులు, ఆస్తులు, అప్పులు, పదవీ విరమణ వ్యవధి, పదోన్నతులు తదితర అంశాలపై తలెత్తే సమస్యలను ఆయా ప్రభుత్వాల చేతిలో ఉందని స్పష్టం చేశారు. డీసీసీబీ సీఈఓ రమణారెడ్డి, బ్యాంక్ అధికారులు పాల్గొన్నారు.
అక్టోబర్ నుంచి ఆప్కాబ్‌కు రెండు కమిటీలు
Published Wed, Jun 18 2014 2:26 AM | Last Updated on Sat, Oct 20 2018 6:19 PM
Advertisement
Advertisement