‘చేతు’లెత్తేశారు | state bifurcation affect to municipal elections | Sakshi
Sakshi News home page

‘చేతు’లెత్తేశారు

Published Sun, Mar 16 2014 2:56 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

state bifurcation affect to municipal elections

సాక్షి, నెల్లూరు: రాష్ట్ర విభజన కాంగ్రెస్‌ను వెంటాడుతోంది. దీంతో మున్సిపల్ ఎన్నికల రేసులో ‘చేతు’లెత్తేశారు. నెల్లూరు కార్పొరేషన్‌తో పాటు ఆత్మకూరు, వెంకటగిరి, గూడూరు, కావలి, సూళ్లూరుపేట, నాయుడుపేట  మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సరైన అభ్యర్థులు దొరకని పరిస్థితి. బతిమలాడుకుని కొన్ని చోట్ల అభ్యర్థులను మొక్కుబడిగా నిలిపినప్పటికీ వారు జనం దగ్గరకెళ్లి ఓట్లు అడిగేందుకు సాహసించడం లేదు. కాంగ్రెస్‌కు ఓట్లు వేసే పరిస్థితి లేదని, పోటీకి దిగడం దండగని ఆ పార్టీ అభ్యర్థులే గుసగుసలాడుకుంటున్నారు. నెల్లూరు నగరంలో దశాబ్దాలుగా ఆనం సోదరుల హవా నడుస్తోంది. ముఖ్యంగా కార్పొరేషన్‌లో పాలన ఆనం సోదరుల ఇష్టానుసారం నడిచింది. టికెట్ల కోసం వారి ఇంటి ముందు నేతలు క్యూకట్టేవారు. ఇదంతా గతం. ఇప్పుడు సీన్‌రివర్స్ . కాంగ్రెస్ టికెట్ అడిగేవారి సంగతి దేవుడెరుగు ఎక్కడ  పోటీ చేయమంటారోనని చోటానేతలు ఆనం సోదరుడికి కనిపించ కుండా తిరిగారని వినికిడి. పిలిపించి పోటీ చేయమని బతిమలాడినా రకరకాల సాకులు చెప్పి తప్పుకున్నట్టు తెలుస్తోంది. డబ్బు కూడా తామే పెట్టుకొంటామని ఆశచూపినా  చాలామంది ససేమిరా అన్నట్టు ప్రచారం జరుగుతోంది. దీంతో అందుబాటులో ఉన్న కార్యకర్తలతో నామినేషన్ల ఘట్టాన్ని  తూతూ మంత్రంగా జరిపించినట్టు సమాచారం. కావలిలో  కాంగ్రెస్ అభ్యర్థులు దొరకక ఎవరో ఒకరులే అన్నట్టు కార్యకర్తలనే  నిలిపారు.
 
 జలదంకికి చెందిన బీవీ కృష్ణారెడ్డి కాంగ్రెస్‌పార్టీ ఇన్‌చార్జ్‌గా కొనసాగుతున్నారు. కాంగ్రెస్ నుంచి పోటీ చేసేందుకు అభ్యర్థులు ముందుకు రాకపోవడంతో ఒక్కో అభ్యర్థి నామినేషన్‌కు రూ.10వేలు ఇచ్చినట్టు సమాచారం. పోటీలో నిలబడిన ఒక్కో అభ్యర్థికి నూ.లక్ష నుంచి నూ.2లక్షల వరకు తామే ఖర్చు పెడతామని ఇప్పటికే ఆనం సోదరులు హామీ ఇచ్చినట్టు గుసగుసలు వినబడుతున్నాయి. అయినా కాంగ్రెస్ ఇక్కడ మిగిలిన పార్టీ అభ్యర్థులకు పోటీ ఇచ్చే పరిస్థితి లేదని పరిశీలకుల అంచనా. గూడూరు మున్సిపాల్టీలో 33 వార్డులు ఉండగా 10 వార్డులకు కాంగ్రెస్ అభ్యర్థులే లేరు. కేంద్రమంత్రి పనబాక లక్ష్మి  భర్త కృష్ణయ్య ఇక్కడ కాంగ్రెస్ ఇన్‌చార్జ్. దీంతో కాంగ్రెస్ శ్రేణులు పూర్తిగా డీలా పడ్డాయి. ఇప్పటి వరకు చైర్మన్ అభ్యర్థిని ప్రకటించలేదు.
 
 ఇక్కడ కూడా కాంగ్రెస్ పోటీ ఇచ్చే పరిస్థితి కానరావడంలేదు. నాయుడుపేట నగరపంచాయతీలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఇక్కడ కొంత మంది మాత్రమే మొక్కుబడిగా కాంగ్రెస్ అభ్యర్థులుగా నామినేషన్ వేశారు. వారిని పట్టించుకునే వారే కరువ్యారు. పోటీలో నిలబడితే డబ్బులు తామే పెట్టుకుంటామని జిల్లా కాంగ్రెస్ నేతలు చెప్పినట్టు సమాచారం. ఇక్కడ కాంగ్రెస్ పరిస్థితి మరింత దిగజారిందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. వెంకటగిరి మున్సిపాల్టీలోనూ కాంగ్రెస్ గడ్డు పరిస్థితి ఎదుర్కొంటోంది. ఇక్కడ నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి ఇన్‌చార్జ్‌గా కొనసాగుతున్నారు.
 
 అన్ని వార్డుల నుంచి అభ్యర్థులను పోటీ చేయించినప్పటికీ కాంగ్రెస్ వారికి గెలుపు అవకాశాలు లేవన్నది పరిశీలకుల అంచనా. ఒక్కో అభ్యర్థికి రూ.2లక్షలు నిధులు ఇస్తామని ఇక్కడ కాంగ్రెస్ నేతలు హామీలు ఇచ్చారు. సూళ్లూరుపేట నగర పంచాయతీలో కాంగ్రెస్ కొంత మేర పోటీ ఇస్తున్నట్టు పైకి కనబడుతున్నా.. వారికి ప్రజలు ఏ మాత్రం ఓట్లు వేస్తారో త్వరలోనే తేలనుంది. కాంగ్రెస్ నేతలు అభ్యర్థులకు పెద్ద ఎత్తున డబ్బులు ఇచ్చి ఇక్కడ పోటీ చేయిస్తున్నట్టు సమాచారం. ఇక్కడ చైర్మన్ అభ్యర్థి ఈశ్వరమ్మతోపాటు నేతలు హర్షవర్ధన్‌రెడ్డి, వాకాటి నారాయణరెడ్డి పార్టీకి బలమైన నేతలు. రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెస్‌కు ఓట్లేసే పరిస్థితి లేదన్నది పరిశీలకుల అంచనా. మాజీ మంత్రి ఆనం ప్రాతినిథ్యం వహిస్తున్న ఆత్మకూరు నగర పంచాయతీలోనూ ఆ పార్టీ పరిస్థితి ఆశాజనకంగా లేదు. ఇక్కడ  కాంగ్రెస్ గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్నట్టు సమాచారం. కాంగ్రెస్ అభ్యర్థులకు పెద్ద ఎత్తున నిధులు అందజేస్తున్నట్టు తెలుస్తున్నా.. వారి గెలుపు అవకాశాలు నామమాత్రమే అన్నది పరిశీలకుల అంచనా.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement