ఇంకెన్నాళ్లు.. | Have the two It's been months | Sakshi
Sakshi News home page

ఇంకెన్నాళ్లు..

Published Sat, May 24 2014 2:09 AM | Last Updated on Sat, Oct 20 2018 6:17 PM

Have the two It's been months

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ఎన్నికలు జరిగి రెండు నెలలు కావస్తోంది. ఫలితాలు వచ్చి పది రోజులు గడిచింది. గెలిచామన్న సంతోషమే లేకుండా పోయింది. ఎప్పుడెప్పుడు కుర్చీ ఎక్కుదామా? అని తెగ ఉత్సాహపడుతున్న కార్పొరేషన్, మున్సిపల్, ఎంపీపీ, జెడ్పీ చైర్మన్ల అభ్యర్థులకు కంటి మీద కునుకు లేకుండా పోతోంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఏర్పడ్డ ప్రత్యేక పరిస్థితుల కారణంగా వీరంతా వచ్చే నెల 15 వ తేదీ వరకు కుర్చీలెక్కడానికి ఎదురు చూపులు చూడక తప్పడం లేదు.
 
 నెల్లూరు కార్పొరేషన్‌తో పాటు జిల్లాలోని ఆత్మకూరు, వెంకటగిరి, నాయుడుపేట, సూళ్లూరుపేట, గూడూరు, కావలి మున్సిపాలిటీలకు మార్చి 30వ తేదీ ఎన్నికలు జరిగాయి. మండల పరిషత్, జెడ్పీటీసీ ప్రాదేశిక స్థానాలకు ఏప్రిల్ 6, 11వ తేదీల్లో  ఎన్నికలు ముగిశాయి. రాష్ట్ర ఎన్నికల సంఘం వెల్లడించిన నోటిఫికేషన్ షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు ముగిసిన వారం, పది రోజుల్లోపే ఆయా సంస్థలకు చైర్మన్లు, వైస్ చైర్మన్లు, మేయర్, డెప్యూటీ మేయర్ ఎన్నిక జరగాల్సి ఉంది. అయితే ఈ ఎన్నికల ఫలితాల ప్రకటనకు సంబంధించి న్యాయస్థానాల్లో  కేసులు దాఖలు కావడం, సార్వత్రిక ఎన్నికలు ముగిశాకే వీటి ఓట్ల లెక్కింపు చేపట్టాలని కోర్టు తీర్పు ఇవ్వడంతో ఎన్నికల్లో పోటీ చేసిన వారంతా ఎదురు చూపులు చూశారు.

ఈ నెల 11న మున్సిపాలిటీలు, 13వ తేదీ జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఇదే సందర్భంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర శాసనసభను రద్దు చేసింది. రాష్ట్రంలో ఎమ్మెల్యేలు లేకుండా పోయారు. దీంతో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల పదవీ ప్రమాణ స్వీకారం చేశాకే మేయర్, డెప్యూటీ మేయర్, చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక పరోక్ష పద్ధతిన నిర్వహిస్తామని రాష్ర్ట ఎన్నికల సంఘం ప్రకటించింది. కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎక్స్ అఫిషియో సభ్యులుగా ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉన్నందున ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది.
 
 విభజనతో ఆలస్యం:  కొత్తగా ఏర్పడబోతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభకు ఎన్నికలు జరిగి ఈ నెల 16వ తేదీ ఫలితాలు వెలువడ్డాయి. అయితే జూన్ 2వ తేదీ కొత్త రాష్ర్టం ఆవిర్భవించనున్నందువల్ల ఎన్నికైన వారు ఆ లోపు పదవీ ప్రమాణ స్వీకారం చేసే అవకాశం లేదు. వీరు పదవీ ప్రమాణం చేస్తేనే గానీ స్థానిక సంస్థల అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలు నిర్వహించే వీలులేదు. ముఖ్యమంత్రి కాబోతున్న చంద్రబాబునాయుడు జూన్ 9వ తేదీ పదవీ ప్రమాణ స్వీకారం చే స్తారని వార్తలు వచ్చాయి. ఇదే నిజమైతే ఆ తర్వాత ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయడం, వారు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ఆప్షన్ ఇవ్వడం వంటి ప్రక్రియ పూర్తి కావడానికి కనీసం 15వ తేదీ దాకా సమయం పట్టొచ్చు. ఆ తర్వాత నాలుగైదు రోజులకు గానీ ఈ ఎన్నికలు జరిగే అవకాశం లేదు. దీంతో గెలిచిన వారు పదవిలో కూర్చోవడానికి మరో మూడు వారాల దాకా సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది.
 
 మున్సిపాలిటీల్లో  ఉత్కంఠ : నెల్లూరు నగర పాలక సంస్థలోని 54 డివిజన్లకు 32 స్థానాలు వైఎస్సార్ సీపీ గెలిచింది. వీరికి తోడు సిటీ, రూరల్ ఎమ్మెల్యే స్థానాలు కూడా ఇదే పార్టీ గెలవడంతో వీరి బలం 34కు చేరింది. ఇక్కడ టీడీపీకి 17 మంది సభ్యులే గెలిచారు. కాంగ్రెస్, సీపీఎం, బీజేపీ కలిసినా మేయర్ పదవి దక్కించుకునే అవకాశం లేదు. దీంతో ఇక్కడ ఎలాంటి ఇబ్బందికర పరిస్థితి లేదు.
 
 కావలిలో 40 వార్డులకు గాను వైఎస్సార్ సీపీ 20 గెలిచింది. ఈ పార్టీ మద్దతుతో గెలుపొందిన ఒక స్వతంత్రుడు వైస్సార్‌సీపీకి మద్దతు ప్రకటించారు. ఇక్కడి నుంచి ఇదే పార్టీకి చెందిన ఎమ్మెల్యే గెలుపొందారు. దీంతో ఇక్కడ ఈ పార్టీ బలం 22కు చేరింది. ఇక్కడ చైర్మన్ పదవి ఎన్నికలో చక్రం తిప్పాలని తెలుగుదేశం వేస్తున్న ఎత్తుగడలు ఫలించే అవకాశాలు ఏ మాత్రం లేవు.

 ఆత్మకూరు మున్సిపాలిటీలోని 23 స్థానాలకు వైఎస్సార్‌సీపీ 10 గెలిచింది. కాంగ్రెస్ 8, టీడీపీ 4 స్థానాలు గెలవగా, స్వతంత్రంగా గెలిచిన ఒకరు వైఎస్సార్ సీపీకి మద్దతు ఇచ్చారు. దీంతో ఇక్కడ వైఎస్సార్ సీపీ బలం 11కు చేరింది. దీనికి తోడు ఎమ్మెల్యే, ఎంపీ ఓట్లు ఇదే మున్సిపాలిటీలో చేరితే ఈ పార్టీ బలం 13కు చేరుతుంది. ఈ బలంతో ఈ మున్సిపాలిటీని కూడా వైఎస్సార్‌సీపీ దక్కించుకుంటుంది.
 
 గూడూరులో వైఎస్సార్‌సీపీ, టీడీపీ చెరో 16 వార్డులు గెలిచాయి. వైఎస్సార్‌సీపీ రెబల్‌గా గెలిచిన ఒక స్వతంత్ర అభ్యర్థి టీడీపీకి మద్దతు ప్రకటించారు. దీంతో టీడీపీ బలం 17కు చేరింది. అయితే ఇక్కడ ఎమ్మెల్యే, ఎంపీ వైఎస్సార్‌సీపీ గెలుపొందడంతో వీరిద్దరి ఓటు బలం కలిపితే వైఎస్సార్‌సీపీకి ఒక ఓటు ఎక్కువ వచ్చి ఈ స్థానాన్ని కూడా గెలిచే అవకాశం కలుగుతుంది. ఇక్కడ తమ పాచికలు పారేలా చేయడానికి టీడీపీ చేస్తున్న తెర చాటు రాజకీయాలు, ప్రలోభ పర్వాలు ఫలించే వాతావరణం కనిపించడం లేదు.
 
   సూళ్లూరుపేటలో 23 వార్డులకు గాను వైఎస్సార్‌సీపీ 10 గెలిచింది. ఇక్కడ ఎమ్మెల్యే వైఎస్సార్‌సీపీ గెలుపొందడంతో ఈ బలం 11కు చేరింది. టీడీపీ 9, కాంగ్రెస్ 3 గెలవగా, ఒకరు స్వతంత్రులు గెలిచారు. ఇక్కడ కాంగ్రెస్, టీడీపీ కలిసిపోయి మున్సిపాలిటీని చెరో రెండున్నరేళ్లు పంచుకునేలా వ్యూహం రచించాయి. ఇక్కడ ఎమ్మెల్సీ ఓటు కాంగ్రెస్‌కు అదనంగా జత కానుంది. ఈ సమీకరణాల వల్ల క్యాంపు రాజకీయాలు ప్రారంభమయ్యాయి.
 వెంకటగిరి, నాయుడుపేట మున్సిపాలిటీల్లో  తెలుగుదేశం పార్టీకి స్పష్టమైన ఆధిక్యత దక్కడంతో ఈ రెండు మున్సిపాలిటీలు ఆ పార్టీకే దక్కనున్నాయి. దీంతో ఇక్కడ ఎలాంటి క్యాంపు రాజకీయాలు సాగడం లేదు.
 
 జెడ్పీ చైర్మన్ కోసం టీడీపీ ప్రలోభాలు
 జిల్లా పరిషత్‌లో 46 స్థానాల్లో వైఎస్సార్‌సీ 31 స్థానాలను గెలవగా, టీడీపీ  15 స్థానాల్లో గెలిచింది. ఇక్కడ ఏ రకమైన సమీకరణలు జరిగినా టీడీపీ చైర్మన్ కుర్చీ దక్కించునే అవకాశమే లేదు. అయినా ఆ పార్టీ ప్రలోభాలు ఎర చూపుతూ తెరచాటు రాజకీయం చేస్తోంది. ఇదిలా ఉంటే కొన్ని మండలాల్లో హంగ్ అవకాశం ఉండటంతో స్వతంత్రుల మద్దతు కోసం ఎంపీపీ అభ్యర్థులు ఎంపీటీసీ సభ్యులను కుటుంబ సమేతంగా వేసవి విడిదికి తీసుకుని వెళ్లారు. ఈ రకమైన విహార యాత్రలు నిర్వహించడం ద్వారా తమ ఎంపీటీసీ సభ్యులను రక్షించునే పనిలో పడిన వారికి మాత్రం వచ్చే నెల 15వ తేదీ దాకా వీరిని పోషించడం తలకు మించిన భారంగా మారుతోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement