సాక్షి, విజయవాడ : సిమీ ఉగ్రవాదులు తమ దాడులకు దుర్గగుడిని లక్ష్యం చేసుకునే అవకాశాలు ఉన్నాయని సమాచారం అందుకున్న దేవస్థానం అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో భక్తులు తమ తెచ్చుకునే సెల్‌ఫోన్లను భద్రపరుచుకునేందుకు ఒక కౌంటర్ ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు తెలిసింది. అయితే ఈ కౌంటర్‌ను దేవస్థానం సిబ్బందే నిర్వహిస్తారా? లేక కాంట్రాక్టర్‌కు లీజుకు ఇస్తారా? అనేది తేలాల్సి ఉంది.
పైరవికి సిద్ధమైన కాంట్రాక్టర్
ఇంద్రకీలాద్రిపై సెల్‌ఫోన్లు భద్రపరిచే కౌంటర్‌ను ఏర్పాటు చేసుకునే అవకాశం కల్పించాలంటూ దుర్గగుడిపై గతంలో వివిధ రకాల కాంట్రాక్టులు చేసిన ఒక కాంట్రాక్టర్ ఇప్పటికే దరఖాస్తు చేసినట్లు తెలిసింది. ఒకొక్క భక్తుడి నుంచి సెల్ ఫోన్ భద్రపరిచేందుకు రూ.5 లేదా రూ.10 వసూలు చేస్తానని, దేవస్థానం నిర్ణయించిన అద్దె చెల్లిస్తానని ఆ కాంట్రాక్టర్ ప్రతిపాదించాడని సమాచారం. ప్రస్తుతం సిమీ ఉగ్రవాదుల దాడులు జరుగుతాయని హెచ్చరికలు వచ్చిన నేపథ్యంలో ఈ కాంట్రాక్టర్ తన ఫైల్ పరిశీలించాలంటూ అధికారులపై వత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది.
ఆ కాంట్రాక్టర్‌కే అవకాశం ఇవ్వాలని ఈవో సీహెచ్.నర్సింగరావుపై ప్రభుత్వ పెద్దల నుంచి వత్తిడి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని సమాచారం. ప్రజాప్రతినిధుల వత్తిడికి తలొగ్గి సెల్‌ఫోన్లు భద్రపరిచే కౌంటర్‌ను కాంట్రాక్టర్‌కు అప్పగిస్తారా? లేక భక్తులకు ఉపయుక్తంగా ఉండేలా దేవస్థానం సిబ్బందితోనే నిర్వహిస్తారా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. లీజుకు ఇస్తే దేవస్థానానికి ఆదాయం వస్తుందంటూ ఈవోను తప్పదోవ పట్టించేందుకు లీజెస్ విభాగం సిబ్బంది ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. అసలు కౌంటర్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఇప్పుడు ఉందా? లేదా? అని కూడా ఈవో ఆలోచిస్తున్నట్లు ఇంద్రకీలాద్రిపై ప్రచారం జరుగుతోంది.
ఇంద్రకీలాద్రిపై సెల్‌ఫోన్ల కోసం కౌంటర్
Published Wed, Apr 22 2015 3:28 AM | Last Updated on Sun, Sep 3 2017 12:38 AM
Advertisement
Advertisement