ఇంద్రకీలాద్రిపై చీరలకు ‘టెండర్’
- కొత్త కాంట్రాక్టర్లు రాకుండా నిబంధనలు!
- పాత కాంట్రాక్టర్లపై ఎందుకంత ప్రేమ?
సాక్షి, విజయవాడ : శ్రీ అమ్మవారికి భక్తులు సమర్పించే చీరలు, జాకెట్ ముక్కలు సేకరించుకునేందుకు దేవస్థానం అధికారులు టెండర్లు పిలిచారు. వాస్తవంగా ఐదు నెలలు క్రితమే ఈ టెండర్లు పిలవాల్సి ఉన్నా అధికారులు జాప్యం చేస్తూ వచ్చారు. ఇప్పుడు పిలిచిన టెండర్లు కేవలం పాత కాంట్రాక్టర్లకు అనుకూలంగానే ఉన్నాయనే విమర్శలు వస్తున్నాయి.
రెండేళ్ల అనుభవం కావాలట!
ఇదే టెండర్లకు జూన్ 15న నోటిఫికేషన్ ఇచ్చారు. అప్పట్లో గత ఏడాది కాలంలో రూ.2 కోట్లు టర్నోవర్ చేసిన కాంట్రాక్టర్లే టెండర్లో పాల్గొనాలని పేర్కొన్నారు. టెండర్ కాలపరిమితి ఏడాది ఉండటంతో టర్నోవర్ కాలపరిమితి ఏడాది నిర్ణయించేవారు. అయితే సోమవారం పిలిచిన టెండర్లలో కాంట్రాక్టర్‌కు రెండు ఆర్థిక సంవత్సరాల్లో రూ.2 కోట్ల టర్నోవర్ ఉండాలనే నిబంధన విధించారు. ప్రస్తుత దుర్గగుడిలో చీరలు విక్రయించుకుంటున్న కాంట్రాక్టర్‌కు రెండేళ్లుగా రూ. 2కోట్లు టర్నోవర్ చేసిన అనుభవం ఉండటం వల్లనే ఆలయం అధికారులు అతనికి అనుకూలంగా నిబంధనలు విధించారని ఇంద్రకీలాద్రిపై గుసగుసలు వినవస్తున్నాయి.
గత నోటిఫికేషన్ ఎందుకు రద్దు చేశారు?
గత జూన్ 30 న చీరల టెండర్లు పిలుస్తూ జూన్ 15న నోటిఫికేషన్ ఇచ్చారు. టెండర్ ఒక రోజు ముందు దాన్ని రద్దు చేశారు. దేవాదాయశాఖ కమిషనర్ కార్యాలయం నుంచి జూన్ 6వతేదీన చీరల కాంట్రాక్టుకు సంబంధించి రిమార్కు అడిగారని, అందువల్ల టెండర్ రద్దు చేశామని అధికారులు చెబుతున్నారు. 6వ తేదీన కమిషనర్ కార్యాలయం రిమార్కు అడిగి టెండరు రద్దు చేయాలని అధికారులు భావించినప్పుడు 15వ తేదీన ఎందుకు చీరల కాంట్రాక్టు టెండరుకు నోటిఫికేషన్ ఇచ్చారనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.
ఆ నలుగురికే అనుకూలం....
దేవస్థానం ఆధ్వర్యంలో జరిగే టోల్‌గేట్, చెప్పుల స్టాండ్, చీరల కాంట్రాక్టు, కొబ్బరి చిప్పల కాంట్రాక్టు, పండగ రోజుల్లో సిబ్బందిని సరఫరా చేయడం తదితర కాంట్రాక్టులన్నీ రూ.కోట్లలో ఉంటాయి. వీటిని దక్కించుకుంటే లక్షల్లో లాభం ఉంటుంది. అందువల్ల కేవలం ముగ్గురు, నలుగురు కాంట్రాక్టర్లు మాత్రమే వీటిల్లో పాల్గొంటు, టెండర్లు వారికే దక్కే విధంగా చూసుకుంటు ఉంటారు. వీరు ఇచ్చే ముడుపులకు ఆశపడి వీరికి తగిన విధంగా టెండర్ నిబంధనలు తయారు చేస్తున్నారనే విమర్శలు లేకపోలేదు.