సాక్షి ప్రతినిధి, కర్నూలు: జెడ్పీ పీఠంపై లేనిపోని ఆశలు కల్పించారు. ‘మద్దతు ఇస్తే నువ్వే జెడ్పీ చైర్‌పర్సన్’ అని ఆ ముగ్గురు మహిళా జెడ్పీటీసీ సభ్యులకు హామీ ఇచ్చారు. తీరా డబ్బు, ఆధిపత్యం కోసం వారిని కాదని ఓర్వకల్లు జెడ్పీటీసీ సభ్యుడు రాజశేఖర్‌కు కట్టబెట్టారు. కొందరు నేతలు కలిసి పక్కా పథకంతో వెన్నుపోటు రాజకీయాలకు తెరలేపి ఇలా చేసినట్లు టీడీపీ శ్రేణులు చెబుతున్నాయి.
ఆలూరు అసెంబ్లీ టికెట్ ఆశించిన కప్పట్రాళ్ల బొజ్జమ్మకు జెడ్పీ పీఠం కట్టబెడతామని టీడీపీ అధినేత చంద్రబాబానాయుడే హామీ ఇచ్చారు. అందుకే ఆమె ఎంపీ, ఎమ్మెల్యే, ఎంపీటీసీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థుల గెలుపుకోసం కృషి చేశారు. జెడ్పీటీసీ ఎన్నికలు ముగిసి చిప్పగిరి స్థానం నుంచి బొజ్జమ్మ గెలవడంతో జెడ్పీ చైర్‌పర్సన్ ఆమెకే నంటూ టీడీపీకి చెందిన ముఖ్యనాయకులు ప్రచారం చేశారు. ఆమెను హైదరాబాద్‌కు పిలిపించి మాట్లాడినట్లు సమాచారం. అయితే పదవి చేతికొచ్చే సమయంలో బొజ్జమ్మకు ఇచ్చిన హామీ అటకెక్కింది. కపట్రాళ్ల కుటుంబానికి వచ్చినట్లే వచ్చి చేజారటం ఇది రెండో సారి.
గతంలో కపపట్రాళ్ల వెంకటప్పనాయుడుని జడ్పీ చైర్మన్ చేస్తామని చెప్పారు. అయితే అనూహ్యంగా బత్తిన వెంకట్రాముడుకి కట్టబెట్టారు. ఇలా ప్రతిసారీ కపపట్రాళ్ల కుటుంబానికి టీడీపీలో తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆ పార్టీకి చెందిన కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డోన్, పత్తికొండ, ఆలూరు, కోడుమూరు నియోజకవర్గాల్లో టీడీపీ బలోపేతానికి ఆ కుటుంబం కృషి చేసింది. అయితే కొందరు టీడీపీ నా యకులకు ఆ కుటుంబానికి అండగా నిల బడ్డారు. అయితే నేటికీ ఆ కుటుంబానికి టీడీపీలో పదవులు అందని ద్రాక్ష లా మారాయని కపట్రాళ్ల వర్గీయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పీఠం దక్కించుకునేందుకు మహిళలకు అన్యాయం...
జిల్లా పరిషత్ పీఠానికి అసరమైన బలం టీడీపీకి లేకపోయినా అధికార బలంతో అడ్డదారిలో దక్కించుకుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన శివానందరెడ్డి, మాజీ ఎంపీపీ విష్ణువర్థన్‌రెడ్డిని టీడీపీ నేతలు ఉపయోగించుకున్నారు. ఒక పార్టీ గుర్తుపై గెలిచిన జెడ్పీటీసీ సభ్యులను ఈ నాయకులు బలవంతంగా టీడీపీలో చేర్పించారు. ఇష్టం లేకున్నా మభ్యపెట్టి క్యాంపులకు తీసుకెళ్లారు. అందులో నందికొట్కూరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన జెడ్పీటీసీ సభ్యురాలు లక్ష్మీదేవి పేరు తెరపైకి తెచ్చారు.
నందికొట్కూరు నియోజక వర్గానికి చెందిన వైఎస్సార్‌సీపీ జెడ్పీటీసీ సభ్యులంతా టీడీపీకి మద్దతు తెలిపితే లక్ష్మీదేవికి జెడ్పీ పీఠాన్ని కట్టబెడతామని హామీ ఇచ్చారు. అయితే పరిణామాలు అమెకు అనుకూలంగా లేవని తెలియటంతో తిరిగి వైఎస్సార్‌సీపీలోకి రావటానికి ప్రయత్నించినట్లు సమాచారం. అయితే ఆమెను తిరిగి పార్టీలోకి రాకుండా స్థానిక నాయకుడొకరు అడ్డుకున్నట్లు తెలిసింది. అదే విధంగా పత్తికొండ టీడీపీ జెడ్పీటీసీ సభ్యురాలు సుకన్యకు టీడీపీ నేతలు మాటిచ్చారు.
దాదాపు సుకన్యనే జెడ్పీ చైర్‌పర్సన్ అభ్యర్థి అని టీడీపీ నేతలు నిర్ణయించారని ప్రచారం జరిగింది. లేనిపోని ఆశలు చూపి ఈ ఇద్దరు మహిళలకూ టీడీపీ నేతలు అన్యాయం చేశారని మహిళా లోకం మండిపడుతోంది. అదే విధంగా టీడీపీ కోసం మొదటి నుంచి కష్టపడి పనిచేస్తున్న నాయకులను కాదని కేవలం పదవి కోసం టీడీపీలోకి వచ్చిన వ్యక్తికి జెడ్పీ పీఠాన్ని ఎలా కట్టబెడుతారని తమ్ముళ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం జెడ్పీ పీఠం చిచ్చు టీడీపీలో చాపకింద నీరులా అసంతృప్తి జ్వాలలు అంటుకున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందోనని టీడీపీ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి.
ఊరించి..ఉసూరుమనిపించారు!
Published Fri, Jul 11 2014 12:29 AM | Last Updated on Sat, Sep 2 2017 10:06 AM
Advertisement
Advertisement