జిల్లాకు మళ్లీ అన్యాయమే | Injustice to district in budget-2014 | Sakshi
Sakshi News home page

జిల్లాకు మళ్లీ అన్యాయమే

Published Fri, Jul 11 2014 2:23 AM | Last Updated on Mon, Aug 20 2018 9:16 PM

Injustice to district in budget-2014

ఒంగోలు : రైల్వే బడ్జెట్‌లోనే కాదు... కేంద్ర ఆర్థిక బడ్జెట్‌లోనూ జిల్లాకు అన్యాయమే జరిగిందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. జిల్లాకు సంబంధించి స్పష్టమైన ప్రతిపాదన ఒక్కటీ బడ్జెట్‌లో లేకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పన్నుల్లోనూ, ఎక్సయిజ్ సుంకాల్లోనూ మినహాయింపు ఇచ్చాం... ధరలు దిగివస్తాయంటూ చెబుతున్నా ఎవరూ నమ్మడం లేదు.

 హ ఈ నెల 8వ తేదీ ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్‌లో జిల్లాకు తీవ్ర అన్యాయం జరిగింది. జిల్లాకు సంబంధించి ఎటువంటి అభివృద్ధి ప్రతిపాదన అందులో కనిపించలేదు. ఈ నేపథ్యంలో ఆర్థిక బడ్జెట్‌పై అందరూ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అందులో ప్రధానమైనది రామాయపట్నం పోర్టు. అయితే కాకినాడ పోర్టును అభివృద్ధి చేస్తాం. కృష్ణపట్నం పోర్టుతోపాటు స్మార్ట్ సిటీనీ అభివృద్ధి చేస్తామంటూ బడ్జెట్‌లో పొందుపరిచారు. జిల్లాకు మంజూరైన రామాయపట్నం పోర్టును చివరి క్షణంలో నెల్లూరు జిల్లా దుగ్గరాజపట్నానికి తరలిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఉత్తర్వులు వెలువడిన సంగతి తెలిసిందే.

దీనిపై అప్పట్లో ఆ పార్టీ నేతలే స్వయంగా సొంత పార్టీ ప్రజాప్రతినిధులపై ధ్వజమెత్తారు. దానిని ఎలాగైనా తిరిగి జిల్లాకు తీసుకురావాల్సిందే అంటూ టీడీపీ, బీజేపీలు నిలదీశాయి. ప్రస్తుతం అధికారం మారింది. అధికారంలో ఉన్న నాటి కాంగ్రెస్ నేడు అడ్రస్ లేకుండా పోయింది. ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం అధికారాన్ని చేజిక్కించుకుంది. ఎలాగైనా మరలా రామాయపట్నం పోర్టు మంజూరు చేయిస్తారని అన్ని రాజకీయ పార్టీలు భావించాయి. అందుకు తగ్గట్లుగానే తెలుగుదేశం, బీజేపీ నేతలు పోటీపడి మరీ ప్రకటనలు గుప్పించారు. తాజా బడ్జెట్‌లో దాని ఊసేలేకుండా పోయింది. మన నాయకులవి కోతలే గాని విశ్వసించదగ్గ మాటలు కాదంటూ జనం ఈసడించుకుంటున్నారు.

 రాష్ట్రం విడిపోకముందే ఒంగోలు రాజధాని అవుతుందని ప్రచారం మొదలైంది. రాయలసీమకు, ఉత్తరాంధ్రకు మధ్యలో అందరికీ అందుబాటులో ఉండే జిల్లా ఒంగోలు తప్పనిసరిగా రాజధాని అవుతుందంటూ మీడియా ద్వారా రాజకీయ నాయకులు సైతం జోరుగా ప్రచారం సాగించారు. ధడేల్‌మని పడుకున్న రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఊతమిచ్చేందుకు అవసరమైన హంగామా అంతా చేశారు. రాజధాని రావాల్సిందే అంటూ నినాదాలు చేసిన నేతలు ఇటీవల కాస్త సెలైంట్ అయ్యారు.

 ఒంగోలులో రాజధాని నిర్మాణం సాధ్యం కాదంటూ ప్రకటనలు చేయడంతోపాటు వెనుకబడిన జిల్లా అభివృద్ధి కోసం విద్యాసంస్థలు, పారిశ్రామిక సంస్థలు అనేకం తీసుకొస్తామంటూ హామీలు ఇచ్చారు.

 ప్రస్తుతం రాష్ట్రంలో ఎయిమ్స్(ఆల్ ఇండియా మెడికల్ సెన్సైస్) ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా జిల్లాలో ఏర్పాటుచేస్తామని ఎక్కడా ప్రకటించలేదు. ఎయిమ్స్ ఏర్పాటు చేయాలంటే సమీపంలో ఎయిర్‌పోర్టు తప్పనిసరి అంటూ వాదన లేవనెత్తారు. అదే జరిగితే ఈ బడ్జెట్‌లో ఒంగోలు సమీపంలో కొత్త ఎయిర్‌పోర్టు ఊసే కనిపించలేదు. దీంతో ఎయిమ్స్ కూడా జిల్లాలో లేనట్లే అనే భావన వ్యక్తం అవుతోంది.

 ఐఐటీ కూడా ఎక్కడ ఏర్పాటు చేస్తారో స్పష్టం చేయలేదు. మరో వైపు పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు చేస్తామంటున్నా జిల్లాలో దాని ప్రభావం ఏ మేరకు ఉంటుందనేది ఇప్పుడే చెప్పలేని పరిస్థితి. ఇక అగ్రికల్చరల్ యూనివర్శిటీని ఇప్పటికే లాంఫాంకు కేటాయించారు. ఒక్కొక్కటిగా పథకాలన్నీ పక్క జిల్లాలకు తరలిపోతుంటే మన జిల్లా ఏవిధంగా అభివృద్ధి చెందుతుందోనని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement