మొద్దుబారిన ప్రభుత్వం | Insensitive government | Sakshi
Sakshi News home page

మొద్దుబారిన ప్రభుత్వం

Published Sat, Aug 31 2013 3:28 PM | Last Updated on Wed, Aug 8 2018 5:51 PM

మొద్దుబారిన ప్రభుత్వం - Sakshi

మొద్దుబారిన ప్రభుత్వం

ఓ పార్టీ అధ్యక్షుడు, లోక్సభ సభ్యుడు కోట్ల మంది ప్రజల ఆకాంక్షకు మద్దతుగా ఆమరణ నిరాహారదీక్ష చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వంలో చలనంలేదు. రాష్ట్రాన్ని విభజించడం అనివార్యం అయితే ఇరు ప్రాంతాలకు సమన్యాయం చేయాలని, అలా చేయలేని పక్షంలో రాష్టన్ని యథాతథంగా ఉంచాలన్న డిమాండ్తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన రెడ్డి చంచల్గూడ జైలులోనే ఆమరణదీక్ష చేపట్టి ఏడురోజులైనా ప్రభుత్వంలో కదలికలేదు. ఆయన దీక్షకు సీమాంధ్రలోని అన్ని వర్గాల ప్రజల నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తున్నా ప్రభుత్వం మాత్రం  మొద్దుబారిపోయింది. ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కూడా ప్రభుత్వానికి తోడుపోయారు. ఆయన కూడా నోరు మెదపడంలేదు.

జగన్ ఈ నెల 25న నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభించారు. అయిదు రోజులకు ఆయన ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. నిరాహార దీక్ష విరమించమని జైలు అధికారులు, వైద్యులు చెప్పినా ఆయన వినలేదు. ఆయన బాగా నీరసించిపోవడం, ఆరోగ్యం ఆందోళనకర పరిస్థితులకు చేరడంతో అయిదవ రోజు గురువారం అర్ధరాత్రి ఆయనను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఆయన పల్స్ రేటు పడిపోయింది. సుగర్ లెవల్స్ పడిపోయాయి. ఆయన దీక్ష విరమించకపోతే శరీరంలోని అవయవాలపై ప్రభావం చూపుతుందని వైద్యులు హెచ్చరించారు. తాను అనుకున్న లక్ష్యం నెరవేరేవరకు దీక్ష విరమించేదిలేదని జగన్ స్పష్టం చేశారు. ఆయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు, సమైక్యాంధ్రవాదులు అందరూ ఆందోళన వ్యక్తం చేశారు. ఇంత జరుగుతున్న ప్రభుత్వం నుంచి స్పందనలేదు. ఒక్క ప్రభుత్వ ప్రతినిధి కూడా ఆస్పత్రివైపు కన్నెత్తి చూడలేదు.

జగన్ ఆరోగ్యం గంటగంటకు క్షీణిస్తోంది. దాంతో వైద్యులలో ఆందోళన ఎక్కువవుతోంది. ఆయన ఆరోగ్యంపై వైద్యుల బృందం రెండు గంటల పాటు సుదీర్ఘంగా చర్చించింది. చివరకు  జగన్‌ను వేరే ఆస్పత్రికి తరలించాలని కోరుతూ జైళ్ల శాఖ అధికారులకు ఉస్మానియా సూపరింటెండెంట్ శుక్రవారం సాయంత్రం ఒక లేఖ రాశారు. ‘‘ప్రస్తుతం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఒంట్లో కీటోన్స్ బాగా పెరిగాయి. దీనివల్ల కిడ్నీ సమస్యలు వచ్చే ఆస్కారముంది. ఫ్లూయిడ్స్ ఎక్కించడానికి జగన్‌మోహన్‌రెడ్డి నిరాకరిస్తున్నారు’’ అని వివరించారు. ఆయనను నిమ్స్‌కు పంపాల్సిందిగా  ఉస్మానియా సూపరింటెండెంట్ జైళ్ల శాఖ అధికారులకు సూచించారు. ‘‘ప్రాణం కంటే ముఖ్యమైనదేదీ లేదని వైద్యులు జగన్కు చెప్పాను. ఇక ఆలస్యం చేయకుండా ఆహారం తీసుకోవాలని సూచించాను. కానీ జగన్ సున్నితంగా తిరస్కరించారు. దీక్ష కొనసాగిస్తాను'' చెప్పారు. శారీరకంగా పూర్తిగా నీరసించిన స్థితిలో ఉండి కూడా జగన్ తమతో ఓపికగా, చిరునవ్వుతో మాట్లాడటం పట్ల వైద్యులు విస్మయం వ్యక్తం చేశారు. జగన్‌లోని సంకల్ప శక్తి తమను ఆశ్చర్యానికి గురి చేసిందని ఆయనకు పరీక్షలు చేస్తున్న ఒక వైద్యుడు ‘సాక్షి’తో అన్నారు.


‘‘నేనొక లక్ష్యం కోసం దీక్ష చేస్తున్నాను. అది నెరవేరే వరకూ దీక్ష విరమించబోను. రాష్ట్ర ప్రయోజనాల కంటే నా ప్రాణం విలువైనదేమీ కాదు. రాజకీయ దురుద్దేశాలతో ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయాలను ఎవరూ ప్రశ్నించకపోతే, పట్టించుకోకపోతే ఎలా? అన్ని ప్రాంతాలకూ న్యాయం చేయడం సాధ్యం కాదనుకుంటే ఈ రాష్ట్రాన్ని సమైక్యంగానే కొనసాగించాలి. అడ్డగోలుగా తీసుకున్న విభజన నిర్ణయం వల్ల కృష్ణా ఆయకట్టు పూర్తిగా ఎడారిగా మారే ప్రమాదంలో పడింది. అదే జరిగితే... కృష్ణా బేసిన్ ఇటు తెలంగాణలోనూ, అటు సీమాంధ్రలోనూ ఉన్నందున రెండు ప్రాంతాల ప్రజలూ తీవ్ర ఇక్కట్ల పాలవుతారు. కృష్ణా డెల్టా ఎడారవడమే గాక కొత్త అంతర్రాష్ట్ర వివాదాలు తలెత్తుతాయి. అటు రాయలసీమలో, ఇటు తెలంగాణలోనూ మిగులు జలాలపై ఆధారపడ్డ ఎన్నో సాగునీటి ప్రాజెక్టులు కూడా వట్టిపోతాయి. అవన్నీ మొండిగోడలుగా మిగులుతాయి. అందుకే నేను దీక్ష చేయాల్సి వస్తోంది. అనాలోచితంగా రాష్ట్రాన్ని విడదీసి ఇలాంటి పెను సమస్యలు సృష్టించే బదులు సమైక్యంగానే కొనసాగించడమే అందరికీ శ్రేయస్కరం. ప్రజల కోసం మనం చేసే పనుల రాష్ట్రానికి ప్రయోజనం కలిగి, తద్వారా ఓట్లయినా, అధికారమయినా రావాలి. అంతే తప్పితే కేవలం ఓట్ల కోసం, సీట్ల కోసమే పనులు చేయడం నైతిక రాజకీయం కాజాలదు.చంద్రబాబు నాయుడు ఒక బాధ్యతాయుతమైన ప్రతిపక్ష నేతగా ఏమాత్రం ఆలోచించినా ఈ దుస్థితి వచ్చేది కాదు. ఇంతటి కీలక తరుణంలో ఎవరూ గట్టిగా నిలదీయకపోతే ఎలా? పార్టీలన్నీ చిత్తశుద్దితో వ్యవహరించాల్సిన అవ సరముంది. ఇన్ని రోజులుగా నేను చేస్తున్న దీక్ష వల్ల ఏ కొద్దిగానైనా రాష్ట్ర హితం కోసం ఆలోచిస్తారని, ప్రజలకు కొంతయినా మేలు జరుగుతుందని ఆశిస్తున్నాను’’ అని ఉస్మానియా వైద్యులతో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వ్యాఖ్యానించారు.

పరిస్థితి విషమిస్తుండటంతో శుక్రవారం సాయంత్రం బలవంతంగా ఫ్లూయిడ్స్ ఎక్కించేందుకు  వైద్యులు ప్రయత్నించగా జగన్ అంగీకరించలేదు. ‘‘నాలో దీక్ష చేసే శక్తి ఇంకా ఉంది. మీరు అర్ధరాత్రి వేళ నా గదిలోకి వచ్చినా మీలో ప్రతి ఒక్కరినీ గుర్తు పట్టగల స్థితిలో ఉన్నాను. గతంలో ఏడు రోజులు దీక్ష చేశాను. దయచేసి నా దీక్షను మీరు బలవంతంగా నిలిపివేయవద్దు. మీరు చేసే వైద్య పరీక్షలకు నేను పూర్తిస్థాయిలో సహకరిస్తాను. కానీ మంచినీళ్లు మినహా ఏ రకమైన ద్రవహారాన్నీ తీసుకోను. మీరు కూడా బలవంతంగా నాకు ఆహారం ఇచ్చేందుకు ప్రయత్నించకండి. వైద్యులుగా మీరు చేస్తున్న సేవలకు నా కృతజ్ఞతలు...’’ అని వారితో అన్నారు. చివరకు చేసేదిలేక ఉస్మానియా ఆస్పత్రి సూపరింటెండెంట్ సూచన మేరకు శుక్రవారం రాత్రి 11.40 ప్రాంతంలో జగన్‌ను పోలీసులు నిమ్స్ ఆస్పత్రికి తరలించారు.

నిమ్స్లో కూడా జగన్ దీక్ష కొనసాగించారు. అప్పటికీ ప్రభుత్వం నుంచి గానీ, ప్రధాన ప్రతిపక్షం నుంచి గానీ స్పందనలేదు.  కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వానికి, ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబుకు కనీసం మానవత్వం కూడా లేదని తేలిపోయింది. ఒక ప్రజా నేత రాష్ట్రానికి సంబంధించిన ప్రధాన సమస్యపై  ఏడు రోజులుగా నిరాహార దీక్ష చేస్తుంటే వారు నోరు మెదపకపోవడం ఎంద దారుణం! ఇది రాజకీయంగా ఆలోచించే సమయమా?  

జగన్ శారీరకంగా బలహీనపడిపోయి, ఆరోగ్యం ప్రమాదకర స్థాయికి చేరడంతో వైద్యలు ఫ్లూయిడ్స్ ఎక్కించడానికి ప్రయత్నించినా ఆయన ససేమిరా అన్నారు. ఆయన పట్టుదలతో తెలుగు ప్రజల కోసం దీక్ష కొనసాగించాలనే నిర్ణయించుకున్నారు. జగన్ ఆరోగ్య పరిస్థితి చాలా ప్రమాదకరంగా వుందని, ఫ్లూయిడ్స్‌ ఎక్కించకపోతే ప్రాణానికే ప్రమాదమని నిమ్స్ వైద్యుల బృందం ఇచ్చిన సమాచారానికి చంచల్గూడ జైలు అధికారులు స్పందించారు. సెక్షన్‌ 593 నిబంధన ప్రకారం బలవంతంగానైనా ఐవి ఫ్లూయిడ్స్‌ ఎక్కించేందుకు నిమ్స్‌ డాక్టర్లకు అనుమతి ఇచ్చారు.  ఆరోగ్యం పూర్తిగా క్షీణించిన దశలో  151 గంటలుగా  చేస్తున్న జగన్ నిరాహర దీక్షను వైద్యులు బలవంతంగా  భగ్నం చేశారు. డాక్టర్లు బలవంతంగా జగన్‌కు  ఫ్లూయిడ్స్‌ ఎక్కించారు. అయితే జగన్‌ పూర్తిగా కోలుకోవడానికి మరికొన్ని రోజులపాటు చికిత్స అవసరమని డాక్టర్లు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement