కర్నూలు : నగరంలోని ఉడ్‌ల్యాండ్ సమీపంలోని హంద్రీనదిలో బయటపడిన శిశువు శవం కలకలం రేపింది. పసిపిల్లను హత్య చేసి పూడ్చి పెట్టారని ప్రచారం జరగడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. గోనెగండ్ల మండలం ఎర్రబాడు గ్రామానికి చెందిన ఆలిబాషా భార్య నమ్మిబీ శుక్రవారం కోడుమూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఆడబిడ్డను ప్రసవించింది. శ్వాస సరిగా తీసుకోకపోవడంతో తల్లిని అక్కడే వదిలి శిశువును కర్నూలు ఆసుపత్రికి తీసుకువచ్చి వైద్యచికిత్సలు చేయించారు. శనివారం ఉదయం కోలుకోలేక మృతి చెందింది. కుటుంబ సభ్యులు శిశువు మృతదేహాన్ని ఊరికి తీసుకెళ్లడానికి ఇష్టం లేక ఆసుపత్రి సమీపంలోని హంద్రీలో పూడ్చిపెట్టారు.
అక్కడి నుంచి బస్టాండ్‌కు చేరుకుకునేందుకు ఆటో ఎక్కారు. వీరి చేతికి మట్టి ఉండటంతో ఆటో డ్రైవర్ అడగడంతో జరిగిన విషయాన్ని చెప్పారు. మధ్యాహ్నం సమయంలో మృతదేహం పూడ్చిన చోట కుక్కలు తవ్వడంతో బయటపడింది. గమనించిన ప్రజలు గుమిగూడి పరిశీలిస్తుండగా అదే మార్గం మీదుగా వెళ్తున్న ఎస్పీ రవి కృష్ణ వెళూ సంఘటనపై ఆరా తీశారు. శిశువు హత్య చేసి పూడ్చిపెట్టినట్లు కొంతమంది ఫిర్యాదు చేయడంతో కర్నూలు డీఎస్పీ రమణమూర్తితో కలసి మృతదేహంతో ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని ఆరా తీశారు. ఆసుపత్రిలోనే శిశువు మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
అయినప్పటికీ మూడవ పట్టణ సీఐ ప్రవీణ్‌కుమార్ చేత సాయంత్రంలోగా పూర్తిస్థాయి విచారణ జరిపించారు. ఈ క్రమంలో శిశువు హత్య అంటూ వచ్చిన పుకార్లు విన్న ఆటో డ్రైవర్ వెంకటేశ్వర్లు తన ఆటోలో ఉదయం ఎక్కిన వారి గురించి పోలీసులకు వివరించారు. అనారోగ్యం కారణాలతోనే ఆసుపత్రిలో చనిపోయినట్లు కుటుంబ సభ్యులు కూడా పోలీసుల విచారణలో తెలిపారు. ఆటోడ్రైవర్, పాటు కుటుంబ సభ్యుల వాంగ్మూలాన్ని రికార్డు చేశారు. దీంతో కథ సుఖాంతమయ్యింది.
మృత శిశువు కలకలం
Published Sun, Jun 28 2015 4:13 AM | Last Updated on Fri, May 25 2018 5:49 PM
Advertisement