సాక్షి, కడప :
‘టీ’నోట్ మంటలు జిల్లాలో రగులుతునే ఉన్నాయి. రాష్ట్ర విభజనకు అనుకూలంగా ఏకపక్ష నిర్ణయం తీసుకున్న కేంద్రంపై సమైక్యవాదులు నిప్పులు చెరుగుతునే ఉన్నారు. జిల్లాలో 69వ రోజు సోమవారం సైతం ఆందోళనలు మిన్నంటాయి. అడుగడుగునా సోనియా, కేసీఆర్, రాష్ర్ట, కేంద్ర మంత్రుల దిష్టిబొమ్మలను తగలబెట్టారు. ఉద్యోగ, ఉపాధ్యాయులతోపాటు అన్ని వర్గాల ప్రజల రోడ్లపైకి చేరి కదం తొక్కారు. విద్యుత్ ఉద్యోగుల సమ్మెతో ఉద్యమం పతాక స్థాయికి చేరింది. ఆర్టీపీపీలో విద్యుత్ ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. విద్యుత్ సబ్‌స్టేషన్లను ఉద్యోగులే ట్రిప్ చేయడంతో జిల్లా వాసులకు కరెంటు కష్టాలు తప్పడం లేదు. జిల్లాలో రెండవరోజూ విద్యుత్ సరఫరాకు ఆటంకం ఏర్పడింది.
కడప నగరంలో ఎస్వీ డిగ్రీ కళాశాల విద్యార్థులు రాజంపేట ఎంపీ సాయిప్రతాప్ ఇంటిని ముట్టడించారు. న్యాయవాదులు,న్యాయశాఖఉద్యోగులు, సమైక్యరాష్ట్ర పరిరక్షణ వేదిక, ప్రైవేటు వృత్తి విద్య కళాశాలల సమాఖ్య, ఇరిగేషన్, పంచాయతీరాజ్, వాణిజ్యపన్నులశాఖ ఆధ్వర్యంలో ఉద్యోగుల రిలే దీక్షలు కొనసాగాయి.
రైల్వేకోడూరులో ఉపాధ్యాయులు శిబిరం వద్ద నిరసన చేపట్టారు. సోనియా దిష్టిబొమ్మను దహనం చేశారు. సమైక్యాంధ్రకు మద్దతుగా న్యాయవాదులు ర్యాలీ నిర్వహించారు. వీరికి జేఏసీ నాయకులు సంఘీభావం తెలిపారు.
రాజంపేటలో రాష్ట్రాన్ని విభజించడాన్ని నిరసిస్తూ రెవెన్యూ ఉద్యోగులు సర్వేయర్ వెంకట సుబ్బయ్య ఆధ్వర్యంలో రిలే దీక్షలు చేపట్టారు.
బద్వేలులో జేఏసీ నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు. నాలుగురోడ్ల కూడలిలో ఉన్న విజయ లాడ్జిపైకి ఉపాధ్యాయులు ఎక్కి రాష్ర్టం విడిపోతే ఆత్మహత్యలే శరణ్యమంటూ ఆందోళన నిర్వహించారు. జేఏసీ ఆధ్వర్యంలో దీక్షలు కొనసాగాయి. పోరుమామిళ్ల పట్టణంలో సెయింట్ ఆంతోనీస్ స్కూలు కరస్పాండెంట్ విజయప్రతాప్‌రెడ్డి నేతృత్వంలో భారీ ర్యాలీ నిర్వహించారు. సమైక్యవాదులు గుండు గీయించుకుని సోనియా, కేసీఆర్ దిష్టిబొమ్మలకు శాస్త్రోక్తంగా పిండ ప్రదానం చేశారు.
పులివెందులలో ఉపాధ్యాయులు, ఎన్జీఓలు పాత బస్టాండు నుంచి పూల అంగళ్ల కూడలి వరకు భారీ ర్యాలీ నిర్వహించి మానవహారంగా ఏర్పడ్డారు. కేంద్ర మంత్రుల ఫ్లెక్సీలకు సాంప్రదాయబద్దంగా పిండ ప్రదానం చేశారు. యురేనియం ప్రాజెక్టు పనులు మూడోరోజూ ఆగిపోయాయి.
మైదుకూరులో సోనియా ఫ్లెక్సీని ఊరేగిస్తూ చుట్టూ కేంద్ర మంత్రుల మాదిరి భజన చేస్తూ వినూత్న ర్యాలీ నిర్వహించారు. న్యాయవాదులు, ఉపాధ్యాయుల రిలే దీక్షలు కొనసాగాయి.
ప్రొద్దుటూరులో తొండలదిన్నె గ్రామానికి చెందిన రైతులు స్వచ్ఛందంగా వచ్చి ర్యాలీ చేపట్టి దీక్షల్లో పాల్గొన్నారు. ఎన్జీఓలు, ఉపాధ్యాయులు, న్యాయవాదులు, వైద్యుల రిలే దీక్షలు కొనసాగాయి.
రాయచోటిలో ఆర్టీసీ ఉద్యోగులు, ఉపాధ్యాయులు బస్సును తాడుతో పురవీధుల్లో లాగుతూ తమ ఆందోళన వ్యక్తం చేశారు. పంచాయతీరాజ్, న్యాయసమాఖ్య, క్రైస్తవ సమాఖ్య ఆధ్వర్యంలో రిలే దీక్షలు కొనసాగాయి.
జమ్మలమడుగులో 15 ప్రైవేటు పాఠశాలలకు చెందిన వేలాది మంది విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. గాంధీ విగ్రహం వద్ద బైఠాయించారు. ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి, తాతిరెడ్డి సూర్యనారాయణరెడ్డి, మాజీమంత్రి పి.రామసుబ్బారెడ్డి సంఘీభావం తెలిపారు. ఆర్టీపీపీలో రెండవరోజూ విద్యుత్ ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. విద్యుత్ ఉద్యోగులు వేంపల్లె రోడ్డులో ఉన్న 220 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్‌ను ముట్టడించారు.
సడలని సంకల్పం
Published Tue, Oct 8 2013 3:44 AM | Last Updated on Mon, Jun 18 2018 8:10 PM
Advertisement
Advertisement