నిఘా చీఫ్ అనురాధపై బదిలీ వేటు | Intelligence chief Anuradha On Transfer | Sakshi
Sakshi News home page

నిఘా చీఫ్ అనురాధపై బదిలీ వేటు

Published Tue, Jul 7 2015 2:17 AM | Last Updated on Sat, Aug 18 2018 8:49 PM

నిఘా చీఫ్ అనురాధపై బదిలీ వేటు - Sakshi

నిఘా చీఫ్ అనురాధపై బదిలీ వేటు

సాక్షి, హైదరాబాద్: ఊహించినట్టుగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిఘా విభాగం చీఫ్‌గా ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారిణి ఏఆర్ అనురాధపై వేటు పడింది. ‘ఓటుకు కోట్లు’ వ్యవహారం వెలుగులోకి వచ్చిన నాటి నుంచి ఈ అంశంపై తర్జనభర్జన పడుతున్న ప్రభుత్వం ఆమెను విజిలెన్స్ విభాగం డీజీగా బదిలీ చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇంటెలిజెన్స్ అదనపు డీజీగా విజయవాడ పోలీసు కమిషనర్‌గా ఉన్న ఏబీ వెంకటేశ్వరరావును నియమించింది. ఈయన బదిలీ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీసు ఫోర్స్ అదనపు డీజీగా ఉన్న గౌతమ్ సవాంగ్‌ను విజయవాడ సీపీగా బదిలీ చేసింది.

తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్ ఓటు కోసం టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి రూ.50 లక్షలు ఇస్తూ అడ్డంగా దొరికిపోయిన వీడియోలు, ఆ నామినేటెడ్ ఎమ్మెల్యేతో స్వయంగా చంద్రబాబు మాట్లాడిన ఆడియో టేపులు బయటపడిన వ్యవహారాన్ని ముందుగా పసిగట్టి సమాచారం ఇవ్వడంలో విఫలమయ్యారంటూ అనురాధపై ముఖ్యమంత్రి గుర్రుగా ఉన్నారు. గత నెల 9న సచివాలయంలో నిర్వహించిన అత్యవసర మంత్రివర్గ సమావేశానంతరం పలువురు మంత్రులు ఏపీకి చెందిన కీలకమైన పోలీసు ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు.

అప్పట్లో మంత్రులు, అధికారుల సమక్షంలో సీఎం అనురాధ పనితీరుపై తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇతర మంత్రులూ ఆమెపై అసహనం ప్రదర్శించారు. ఈ నిలదీతను తప్పుపడుతూ అనురాధ సైతం ఘాటుగానే స్పందించారు. పొరుగు రాష్ట్రంలో జరిగిన ‘ఓటుకు కోట్లు’ వ్యవహారంలో తమ వైఫల్యం ఏమాత్రం లేదని గట్టిగా చెప్పి సమావేశం నుంచి అర్ధాంతరంగా వచ్చేశారు.

ఇటీవల చంద్రబాబుతో జరిగిన ఓ సమావేశంలోనూ అనురాధ నిర్మొహమాటంగా మాట్లాడినట్లు తెలిసింది. తాను ఓ ఐపీఎస్ అధికారిణిగా, నిఘా విభాగం చీఫ్‌గా మాత్రమే పని చేయగలనని, రాజకీయ పార్టీల ప్రతినిధిగా విధులు నిర్వహించలేనని స్పష్టం చేశారని సమాచారం. అలాంటి పని తీరు ఆశిస్తే తనను బదిలీ చేయమని చెప్పారని తెలిసింది. అనురాధ నిఘా విభాగం చీఫ్‌గా ఉంటే తమ ఎజెండా అమలు చేయడం కష్టమని భావించిన సీఎం జపాన్ పర్యటనకు వెళ్లేముందే బదిలీ ఫైలుపై సంతకం చేశారని తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement