AR Anuradha
-
ఏపీపీఎస్సీ ఛైర్‌పర్సన్‌గా రిటైర్డ్ ఐపీఎస్ అనురాధ
సాక్షి, విజయవాడ: ఏపీపీఎస్సీ ఛైర్‌పర్సన్‌గా రిటైర్డ్ ఐపీఎస్ ఎఆర్ అనురాధను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. రేపు ఉదయం 11 గంటలకి ఎపీపీఎస్సీ చైర్మన్‌గా ఆమె బాధ్యతలు చేపట్టనున్నారు. స్త్రీ శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేస్తూ గత ఏడాది అక్టోబర్ నెలాఖరున అనురాధ పదవీ విరమణ చేశారు. గతంలో ఏపీ ఇంటిలిజెన్స్ డీజీగా, విజిలెన్స్ డీజీగా, హోం శాఖ ముఖ్య కార్యదర్శిగా పలు కీలక శాఖలు ఆమె నిర్వహించారు.ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతం సవాంగ్‌ను జులై నెలలో కూటమి ప్రభుత్వం బలవంతపు రాజీనామా చేయించిన సంగతి తెలిసిందే. అయితే, గత మూడు నెలలుగా చైర్మన్ లేకుండా ఏపీపీఎస్సీ ఉంది. చైర్మన్ లేకపోవడంతో జులై 28 న జరగాల్సిన గ్రూప్-2, అలాగే సెప్టెంబర్ 2 నుంచి పది వరకు నిర్వహించాల్సిన గ్రూప్-1ను చంద్రబాబు సర్కార్ వాయిదా వేసింది. ఏడాది పాటే ఏపీపీఎస్సీ చైర్మన్‌గా అనురాధ ఉండనున్నారు. చైర్మన్ పదవికి గరిష్ట వయస్సు 62 ఏళ్లు కావడంతో అనూరాధకి ఏడాది పాటే పనిచేసే అవకాశం ఉంది.ఇదీ చదవండి: చంద్రబాబుకు ఇదే నా హెచ్చరిక: వైఎస్ జగన్ -
విజిలెన్స్ విభాగంలో ఎక్స్ క్యాడర్ పోస్టు
హైదరాబాద్ సిటీ: రాష్ట్ర విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్ విభాగంలో ఎక్స్ క్యాడర్ పోస్టు సృష్టించారు. అదనపు డీజీ స్థాయిలో దీన్ని సృష్టిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 29 వరకు ఆ పోస్టు కొనసాగుతుందని, అవసరాన్ని బట్టి కాలపరిమితిని పొడిగించుకునే అవకాశం ఉందని ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఓటుకు కోట్లు’ వ్యవహారం నేపథ్యంలో అప్పటి నిఘా చీఫ్ ఏఆర్ అనురాధపై అసంతృప్తి వ్యక్తం చేసిన సీఎం గత నెల 6న ఆమెను విజిలెన్స్ విభాగం అధిపతిగా బదిలీ చేసిన విషయం విదితమే. ఆమెకు జీతభత్యాల చెల్లింపుల్లో సాంకేతిక ఇబ్బందులు రాకుండా ఈ ఎక్స్ క్యాడర్ పోస్టు సృష్టించారు. -
నిఘా చీఫ్ అనురాధపై బదిలీ వేటు
సాక్షి, హైదరాబాద్: ఊహించినట్టుగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిఘా విభాగం చీఫ్‌గా ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారిణి ఏఆర్ అనురాధపై వేటు పడింది. ‘ఓటుకు కోట్లు’ వ్యవహారం వెలుగులోకి వచ్చిన నాటి నుంచి ఈ అంశంపై తర్జనభర్జన పడుతున్న ప్రభుత్వం ఆమెను విజిలెన్స్ విభాగం డీజీగా బదిలీ చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇంటెలిజెన్స్ అదనపు డీజీగా విజయవాడ పోలీసు కమిషనర్‌గా ఉన్న ఏబీ వెంకటేశ్వరరావును నియమించింది. ఈయన బదిలీ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీసు ఫోర్స్ అదనపు డీజీగా ఉన్న గౌతమ్ సవాంగ్‌ను విజయవాడ సీపీగా బదిలీ చేసింది. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ ఓటు కోసం టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి రూ.50 లక్షలు ఇస్తూ అడ్డంగా దొరికిపోయిన వీడియోలు, ఆ నామినేటెడ్ ఎమ్మెల్యేతో స్వయంగా చంద్రబాబు మాట్లాడిన ఆడియో టేపులు బయటపడిన వ్యవహారాన్ని ముందుగా పసిగట్టి సమాచారం ఇవ్వడంలో విఫలమయ్యారంటూ అనురాధపై ముఖ్యమంత్రి గుర్రుగా ఉన్నారు. గత నెల 9న సచివాలయంలో నిర్వహించిన అత్యవసర మంత్రివర్గ సమావేశానంతరం పలువురు మంత్రులు ఏపీకి చెందిన కీలకమైన పోలీసు ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. అప్పట్లో మంత్రులు, అధికారుల సమక్షంలో సీఎం అనురాధ పనితీరుపై తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇతర మంత్రులూ ఆమెపై అసహనం ప్రదర్శించారు. ఈ నిలదీతను తప్పుపడుతూ అనురాధ సైతం ఘాటుగానే స్పందించారు. పొరుగు రాష్ట్రంలో జరిగిన ‘ఓటుకు కోట్లు’ వ్యవహారంలో తమ వైఫల్యం ఏమాత్రం లేదని గట్టిగా చెప్పి సమావేశం నుంచి అర్ధాంతరంగా వచ్చేశారు. ఇటీవల చంద్రబాబుతో జరిగిన ఓ సమావేశంలోనూ అనురాధ నిర్మొహమాటంగా మాట్లాడినట్లు తెలిసింది. తాను ఓ ఐపీఎస్ అధికారిణిగా, నిఘా విభాగం చీఫ్‌గా మాత్రమే పని చేయగలనని, రాజకీయ పార్టీల ప్రతినిధిగా విధులు నిర్వహించలేనని స్పష్టం చేశారని సమాచారం. అలాంటి పని తీరు ఆశిస్తే తనను బదిలీ చేయమని చెప్పారని తెలిసింది. అనురాధ నిఘా విభాగం చీఫ్‌గా ఉంటే తమ ఎజెండా అమలు చేయడం కష్టమని భావించిన సీఎం జపాన్ పర్యటనకు వెళ్లేముందే బదిలీ ఫైలుపై సంతకం చేశారని తెలిసింది.