చల్లపల్లి (అవనిగడ్డ) : కృష్ణా, గుంటూరు జిల్లాల్లో సంచరిస్తూ చోరీలకు పాల్పడే అంతర్ జిల్లాల దొంగను చల్లపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. స్థానిక సర్కిల్ పోలీస్ కార్యాలయంలో అవనిగడ్డ డీఎస్పీ వి.పోతురాజు శనివారం ఉదయం విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. చల్లపల్లి మండల పరిధిలోని ఆముదార్లంకకు చెందిన పాత నేరస్తుడు, అంతర్ జిల్లాల దొంగగా గుర్తింపు, గుంటూరు జిల్లా భట్టిప్రోలు పీఎస్‌లో సస్పెక్టెడ్ షీట్ కలిగిన గాజులేటి వీరయ్యను చల్లపల్లి, వెంకటాపురంలలో జరిగిన బంగారు నగల చోరీ కేసుల్లో సీఐ బి.జనార్దన్ శనివారం అరెస్టు చేశారు.
పదిహేడేళ్ల నుంచే చోరీలు
వీరయ్య పదిహేడేళ్ల వయసు నుంచే దొంగతనాలు చేసేవాడని డీఎస్పీ పోతురాజు తెలిపారు. బంగారు గొలుసులు, మోటారు బైక్‌లు దొంగతనాలతోపాటు ఇళ్లల్లో చోరీలకు పాల్పడేవాడు. 2017లో చల్లపల్లిలో, 2018లో వెంకటాపురంలో రెండు బంగారం చోరీ కేసుల్లో వీరయ్యపై అనుమానం వచ్చి ఆ దిశగా విచారణ చేపట్టారు. వేలిముద్రల ఆధారంగా చోరీలకు పాల్పడింది వీరయ్యగా నిర్థారించి అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
కొన్నాళ్లుగా పోలీసులకు దొరక్కుండా తప్పించుకుని తిరుగుతున్న వీరయ్యను పట్టుకోవటంలో కీలకపాత్ర వహించిన చల్లపల్లి ఏఎస్‌ఐ విస్సంశెట్టి వెంకటేశ్వర్లు, కానిస్టేబుల్ రాఘవలను డీఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. వీరికి రివార్డులు ఇవ్వాలని జిల్లా ఎస్పీని కోరనున్నట్లు ఆయన తెలిపారు. వీరయ్య మరో వ్యక్తితో కలిసి చోరీలకు పాల్పడి, 96 గ్రాములు బంగారం చోరీ చేశాడు. వీరయ్య నుంచి 64 గ్రాముల బంగారం రికవరీ చేశారు. మరో వ్యక్తి కోసం గాలిస్తున్నారు. సమావేశంలో సీఐ బి.జనార్దన్, ఘంటసాల ఎస్‌ఐ షణ్ముఖసాయి, ఏఎస్‌ఐ విస్సంశెట్టి వెంకటేశ్వరరావు, రాఘవ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment