అంతర జిల్లా దొంగ అరెస్టు | Inter-district thief arrested | Sakshi
Sakshi News home page

అంతర జిల్లా దొంగ అరెస్టు

Published Wed, May 6 2015 3:19 AM | Last Updated on Sun, Sep 3 2017 1:29 AM

ఇంట్లో ఎవరూలేని సమయంలో తాళాలు పగులగొట్టి దొంగతనాలకు పాల్పడిన అంతర్ జిల్లా దొంగను గుంటూరు అర్బన్ సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు.

గుంటూరు క్రైం : ఇంట్లో ఎవరూలేని సమయంలో తాళాలు పగులగొట్టి దొంగతనాలకు పాల్పడిన అంతర్ జిల్లా దొంగను గుంటూరు అర్బన్ సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి రూ.10 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలు స్వాధీనం  చేసుకున్నారు. ఈ సందర్భంగా అదనపు ఎస్పీ బి.శ్రీనివాసులు తన కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. కృష్ణాజిల్లా విజయవాడ పంజా సెంటర్‌కు చెందిన షేక్ మస్తాన్ 2005 నుంచి దొంగతనాలకు పాల్పడుతున్నాడు.

తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం, ఆంధ్ర రాష్ట్రంలోని విజయవాడ నగరంలోని వివిధ ప్రాంతాల్లో చోరీలకు పాల్పడి పలుమార్లు జైలు శిక్ష అనుభవించాడు. గత ఏడాది జైలు నుంచి విడుదలైనప్పటి నుంచి  గుంటూరు అర్బన్ జిల్లా పరిధిలోని కొత్తపేట, అరండల్‌పేట, పట్టాభిపురం పోలీసు స్టేషన్‌ల పరిధిలోని తొమ్మిది ప్రాంతాల్లో తాళాలు వేసి ఉన్న ఇళ్లల్లో తాళాలు పగులగొట్టి చోరీలకు పాల్పడ్డాడు. కొత్తపేట పోలీసు స్టేషన్ పరిధిలో బుచ్చయ్యతోట 6వలైనుకు చెందిన భవానీకుమారి ఇంట్లో, నెహ్రూనగర్ 9వలైనుకు చెందిన జి.సత్యదేవ్ ఇంట్లో, బుచ్చయ్యతోట 5వలైనుకు చెందిన షేక్ అక్బర్ ఇంట్లో, నెహ్రూనగర్ 3వలైనులోకు చెందిన కాకి రాఘవరావు ఇంట్లో చోరీలకు పాల్పడ్డాడు.

అరండల్‌పేట పోలీసు స్టేషన్ పరిధిలో కాకుమాను 6వలైనుకు చెందిన బి.రాఘవరావు ఇంట్లో, కాకుమాను వారితోట 4వలైనుకు చెందిన గోపిశెట్టి వెంకట హనుమంతరావు ఇంట్లో, పట్టాభిపురం పోలీసు స్టేషన్ పరిధిలో కృష్ణనగర్ 2వలైనుకు చెందిన నడింపల్లి సాంబశివరావు, విద్యానగర్ 1వలైనుకు చెందిన కొల్లిపర వెంకట రమణారావు, శ్యామలానగర్ 11వలైనుకు చెందిన పి.శ్రీనివాసరావు ఇళ్లలో కూడా చోరీలు చేశాడు. 

నిందితుడు మస్తాన్ మంగళవారం లాలాపేటలోని పూల మార్కెట్ సెంటర్‌లో ఉన్నట్టు గుర్తించి పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. నిందితుడి నుంచి రూ.10 లక్షల విలువ చేసే 45 సవర్ల బంగారు ఆభరణాలు, కెమెరా, రెండు జతల వెండి పట్టీలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని కోర్టులో హాజరు పరచగా న్యాయమూర్తి రిమాండ్ విధించినట్లు అదనపు ఎస్పీ  వెల్లడించారు. సమావేశంలో కొత్తపేట సీఐ డి.వెంకన్నచౌదరి, సీసీఎస్ సీఐ ఎ.శివశంకర్, ఎస్‌ఐ శ్రీనివాసరావు, ఏఎస్‌ఐ కోటేశ్వరరావు, హెడ్‌కానిస్టేబుళ్లు సాంబశివరావు, ఆం జనేయులు, నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement