జిల్లా అంతటా నిఘా!
విజయనగరం క్రైం, న్యూస్‌లైన్ : ఎన్నికల సందర్భంగా పోలీసుల నిఘా తీవ్రమైంది. మద్యం, నగదు రవాణాను నిరోధించేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టారు. దీనికోసం జిల్లా వ్యాప్తంగా చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఆరు అంతర్ రాష్ట్ర చెక్ పోస్టులతో పాటు, 22 పోలీసు చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. విజయనగరం మున్సిపాలిటీ పరిధిలో వి.టి.అగ్రహారం వై కూడలి, అయ్యన్నపేట, పూల్‌బాగ్ కాలనీ, ఐస్ ఫ్యాక్టరీ, జమ్ము, జేఎన్‌టీయూ కళాశాల వద్ద, సాలూరు పరిధిలో కొట్టక్కి బ్రిడ్జి, సాగర్‌దాబా, బంగారమ్మపేట, గుమడాం సమీపంలోని రైల్వేస్టేషన్ రోడ్డు, శివాజీజంక్షన్‌లవద్ద, బొబ్బిలి పట్టణంలో మూడు, రామభద్రపురం మండల కేంద్రంలో ఒకటి, పార్వతీపురంలో నవిరి కాలనీ, వెంకంపేట గోరీలు, సూర్యపీఠం, కృష్ణపల్లి వద్ద వీటిని ఏర్పాటు చేశారు. ఇప్పటికే నిబంధనలకు విరుద్ధంగా తరలిస్తున్న నగదును ఎక్కడికక్కడ పట్టుకుంటున్నారు. సాలూరులో రూ. లక్షా 24వేలు, బొబ్బిలిలో రూ.2.5 లక్షలను పోలీసులు శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 12న డెంకాడ మండలం ఐనాడ, దత్తిరాజేరు మండలంలో తాడేందరవలస, గుమలక్ష్మీపురం, లక్కవరపుకోట మండలం గొల్జాంలో, గజపతినగరం, కొత్తవలస,
శృంగవరపుకోట మండలం వశి, రాజీపేట, గౌరీపురం, పార్వతీపురం ప్రాంతాల్లో మద్యం సీసాలను పట్టుకున్నారు.
మరో 20 చెక్ పోస్టులు
నామినేషన్ల పర్వం వరకు మద్యం, నగదు రవాణా తక్కువగానే ఉంటుంది. విత్‌డ్రాలు అయిన రోజు నుంచి వీటి రవాణా జోరందుకునే అవకాశం ఉంది. దీంతో రానున్న రోజుల్లో అదనంగా మరో 20 పోలీసు చెక్ పోస్టులను ఏర్పాటు చేయనున్నారు.