మీడియా సమావేశంలో ‘చదువుతున్న’ నిమ్మగడ్డ. చిత్రంలో ఐజీ సత్యనారాయణ
సాక్షి, అమరావతి: రాజ్యాంగం, పంచాయతీరాజ్ చట్టం ద్వారా తనకు సంక్రమించిన విస్తృత, విచక్షణాధికారాల మేరకు నామినేషన్ల ప్రక్రియ కూడా పూర్తయిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలతోపాటు మున్సిపల్ ఎన్నికలను 6 వారాలపాటు నిలుపుదల(వాయిదా) చేస్తున్నట్టు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ ప్రకటించారు. కరోనా వైరస్ కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. ఆయన ఆదివారం రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాపై పుస్తకంలో రాసుకొచ్చిన సమాచారాన్ని ఈ సందర్భంగా చదివి వినిపించారు. ఎన్నికల వాయిదా నోటిఫికేషన్‌పై సంతకం చేస్తున్నట్టు విలేకరుల సమావేశంలోనే ప్రకటించారు. నిమ్మగడ్డ రమేష్‌కుమార్ ఇంకా ఏం చెప్పారంటే...
- ఇది కేవలం నిలిపివేత మాత్రమే.. ఎన్నికల రద్దు కాదు. ఆరు వారాల తర్వాత, రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు నెలకొన్న తర్వాత.. నిలిచిపోయిన ఎన్నికల ప్రక్రియ పున:ప్రారంభం అవుతుంది. ఇప్పటిదాకా జరిగిన ప్రక్రియ రద్దు కాదు.
- ఇప్పటికే ఏకగ్రీవంగా ఎన్నికైన వారు కొనసాగుతారు. ఎన్నికలు పూర్తి కాగానే మిగిలిన సభ్యులతోపాటు వీరు కూడా బాధ్యతలు చేపడతారు. వారికి ఎలాంటి నష్టం వాటిల్లదు. ఆరు వారాల తర్వాత సమీక్ష అనంతరం వాయిదా పడిన ఎన్నికల కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం.
- జెడ్పీపీ, ఎంపీపీ, మున్సిపాల్టీలకు ఇదివరకే విడుదల చేసిన నోటిఫికేషన్లను అవసరమైన చోట సవరిస్తాం.
- పంచాయతీ ఎన్నికల విషయంలో ఆరు వారాల తర్వాత సరికొత్త షెడ్యూల్‌ను అందరికీ ఆమోదయోగ్యంగా ప్రకటిస్తాం.
- ఈ ఆరు వారాలపాటు ఎన్నికల ప్రవర్తనా నియమావళి పూర్తిస్థాయిలో ఎలాంటి సడలింపులు లేకుండా అమల్లో ఉంటుంది. యథాతథంగా కొనసాగుతుంది.
- ఓటర్లను ప్రలోభపరిచే వ్యక్తిగత పథకాలపై నిషేధం ఉంటుంది. ప్రభుత్వ దైనందిక కార్యక్రమాలపై ఎలాంటి నిషేధం ఉండదు. ప్రవర్తనా నియమావళి వర్తించదు. కావాల్సిన చోట ప్రభుత్వ అభ్యర్థన మేరకు ఎన్నికల సంఘం స్పష్టత ఇస్తుంది.
- ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్న సమయంలో ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు, వారి మద్దతుదారులకు, వారి ఆస్తులకు రాష్ట్ర ప్రభుత్వం బేషరతుగా రక్షణ కల్పించాల్సి ఉంటుంది.
- అభ్యర్థుల రక్షణపై జిల్లాస్థాయిలో జిల్లా పరిశీలకులు సమీక్ష నిర్వహిస్తారు. ఎన్నికల కమిషన్ కూడా క్రియాశీలకంగా వ్యవహరించి ఈ విషయం పర్యవేక్షిస్తుంది. రక్షణ విషయంలో ఎలాంటి పక్షపాత ధోరణి, సాచివేత వైఖరికి తావులేదు.
- ఇప్పటికే నామినేషన్లు వేసిన వారిని భయాందోళనలకు గురిచేయడం చట్టరీత్యా నేరం. వారి ప్రయోజనాలకు నష్టం కలిగించడం అభ్యంతరకరం, నిషిద్ధం. ఈ విషయంలో ఒక కంప్లైంట్ సెల్ ఏర్పాటు చేయాలని పోలీసులకు సూచిస్తున్నాం.
- గ్రామ వలంటీర్ల వ్యవస్థపై ఫిర్యాదులొస్తున్నాయి. ఈ ఫిర్యాదులను ఎన్నికల కమిషన్ పరిశీలిస్తుంది. వలంటీర్ల చర్యలు ఎన్నికలను ప్రభావితం చేసేలా, విఘాతం కలిగించేలా ఉంటే జిల్లా కలెక్టర్లు నియంత్రించాలి. కఠినంగా వ్యవహరించాలి.
కరోనా వైరస్ ప్రమాదకారి
- ఎన్నికల ప్రణాళిక ప్రకటించడానికి ముందు రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించాం. కరోనా వైరస్ వల్ల ఎన్నికల ప్రక్రియకు అవరోధం ఉండదని నిర్ణయానికి వచ్చి, ఎన్నికల ప్రక్రియ ప్రారంభించాం. అవసరమైతే పున:సమీక్షించుకుంటామని చెప్పాం.
- మారిన పరిస్థితుల నేపథ్యంలో బాధ్యతాయుతంగా స్పందించాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్‌పై ఉంది.
- స్థానిక సంస్థల ఎన్నికల్లో పెద్ద సంఖ్యలో జనం ఓట్లు వేయనున్నారు. పేపరు బ్యాలెట్ వాడుతుండడంతో అధిక సమయం పట్టనుంది. అలాగే హ్యూమన్ కాంటాక్ట్(ఒకరినొకరు తాకే) ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.
- మారుతున్న పరిస్థితుల దృష్ట్యా ప్రజారోగ్యానికి కరోనా వైరస్ ప్రమాదకారి అని అంగీకరించక తప్పదు. ఎన్నికలు నిర్వహించడం ముఖ్యమైనప్పటికీ ప్రజాభద్రతను పణంగా పెట్టకూడదన్న వాదనతో ఎన్నికల కమిషన్ ఏకీభవిస్తోంది.
ఆ పోలీసు అధికారులను బదిలీ చేయాలి
స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో తమ ముందున్న ప్రత్యక్ష సమాచారం, ప్రసార మాధ్యమాల ద్వారా వచ్చిన స్పష్టత ఆధారంగా కొందరు అధికారులపై చర్య తీసుకోవడం రాష్ట్ర ఎన్నికల కమిషన్ విధిగా భావిస్తున్నామని రమేష్‌కుమార్ పేర్కొన్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం అ«ధికారాలు కేంద్ర ఎన్నికల సంఘం అధికారాలతో పోలి ఉంటాయన్నారు. ఈ నేపథ్యంలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్న గుంటూరు, చిత్తూరు జిల్లాల కలెక్టర్లను, గుంటూరు రూరల్, చిత్తూరు అర్బన్ ఎస్పీలను విధుల నుంచి వెంటనే తప్పించి, ప్రత్నామ్నాయ అధికారులను సూచించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నానని చెప్పారు. గుంటూరు జిల్లా మాచర్లలో జరిగిన ఘటనకు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ బాధ్యత వహించాల్సి ఉంటుందని, ఆ అధికారిని తక్షణం సస్పెండ్ చేసి, ప్రత్యామ్నాయంగా ఆమోదయోగ్యమైన అధికారిని నియమించాలని ప్రభుత్వానికి సూచిస్తున్నామని అన్నారు. అలాగే చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి, పలమనేరు డీఎస్పీలతో పాటు పుంగనూరు సీఐ, అనంతపురం జిల్లా రాయదుర్గం, తాడిపత్రి సీఐలను బదిలీ చేయాలని ప్రభుత్వానికి సిఫార్సు చేస్తున్నామని వెల్లడించారు. హింస జరిగిన చోట కొత్త షెడ్యూల్‌ను ప్రకటించడానికి కూడా వెనుకాడబోమని అన్నారు.
ఆరోగ్య శాఖ అధికారులతో సంప్రదింపుల తర్వాతే...
- ఎన్నికలను ఆరు వారాల పాటు నిలిపివేయడం అనేది ఆరోగ్యశాఖ అధికారులతో సంప్రదింపులు జరిపి, పరిస్థితులను మదింపు చేసి, ప్రభుత్వ ఉద్యోగుల మనోభావాలను సైతం గుర్తిస్తూ ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయం. ప్రస్తుతం నెలకొన్న అనివార్య పరిస్థితులకు అనుగుణంగా తీసుకున్న నిర్ణయం ఇది.
- సాధారణ పరిస్థితులు నెలకొన్న తర్వాత ఎన్నికల ప్రక్రియను పున:ప్రారంభించాలని ఎన్నికల కమిషన్ భావిస్తోంది.
జాతీయ స్థాయి ఆరోగ్య అధికారులతో మాట్లాడా..
సాయంత్రానికి మాట మార్చిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్
కరోనా వైరస్ విస్తరణ గురించి ఆరోగ్య శాఖ అధికారులతో(హెల్త్ ఫంక్షనరీస్) మాట్లాడిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయాలని నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ ఆదివారం ఉదయం ప్రకటించారు. ఈ మేరకు నోటిఫికేషన్ కూడా జారీ చేశారు. ఆరోగ్య శాఖ అధికారులతో మాట్లాడినట్లు రెండో పేరాలో స్పష్టంగా పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతో మాట్లాడకుండానే ఎన్నికల వాయిదా నిర్ణయాన్ని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. సీనియర్ హెల్త్ ఫంక్షనరీస్‌తో మాట్లాడినట్లు ‘ఎన్నికల వాయిదా నోటిఫికేషన్’లో పేర్కొన్న అంశాన్ని సీఎం ప్రస్తావిస్తూ.. వైద్య–ఆరోగ్య శాఖ కార్యదర్శి కంటే సీనియర్ ఎవరు ఉంటారని నిలదీశారు.
సీఎంతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, వైద్య–ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి ఉన్నారు. సీఎం ప్రశ్నకు ఖంగుతిన్న ఎన్నికల కమిషనర్ మాట మార్చారు. సాయంత్రానికి మరో ప్రెస్‌నోట్ విడుదల చేశారు. అందులో.. జాతీయ స్థాయి హెల్త్ ఫంక్షనరీస్‌తో మాట్లాడినట్లు పేర్కొన్నారు. జాతీయ స్థాయి హెల్త్ ఫంక్షనరీస్ అని రాశారే తప్ప.. వారి హోదా/పేర్లు ఏమిటనే విషయాన్ని సాయంత్రం విడుదల చేసిన ప్రెస్‌నోట్‌లో పేర్కొనకపోవడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment