
సాక్షి, అమరావతి: మున్సిపల్ ఎన్నికలలో పోటీకి దిగిన అభ్యర్థులు ఎవరైనా తమ నామినేషన్‌ను బలవంతంగా విత్‌డ్రా చేయించినట్టు ఆధారాలతో ఫిర్యాదు చేస్తే స్వీకరించాలని మున్సిపల్ ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ ఆదేశాలు జారీ చేశారు. అలా అందిన ఫిర్యాదులను రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు పంపాలని, వాటిని పరిశీలించి తగు నిర్ణయం తీసుకుంటామన్నారు. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి వచ్చే 2, 3 తేదీల్లో నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ జరగనున్న నేపథ్యంలోనే ఎస్‌ఈసీ ఈ ఆదేశాలు జారీ చేసినట్టు కమిషన్ కార్యాలయ వర్గాలు తెలిపాయి.
నామినేషన్ వేయకుండా అడ్డుకుంటే..
గత ఏడాది మార్చిలో జరిగిన నామినేషన్ల స్వీకరణ సందర్భంగా నామినేషన్ వేయకుండా అడ్డగింతలకు సంబంధించిన బాధితులు ఉంటే జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేయాలని ఎస్‌ఈసీ మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో సూచించారు. నామినేషన్ వేయనివ్వకుండా అడ్డుకున్నారనడానికి ఆధారాలతో సంబధిత రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేయడం/ఆ ఘటనపై పోలీసు కేసు నమోదు చేయడం లేదా ఆ ఘటనకు సంబంధించి ప్రముఖ పత్రికలు, టీవీ చానళ్లలో ప్రసారమైన కథనాలను సా«క్ష్యాలుగా కలెక్టర్ల ముందు ఉంచాలని పేర్కొన్నారు. అలాంటి సమాచారం ఉంటే కలెక్టర్ల నుంచి తెప్పించుకుని తదుపరి చర్యలు చేపడతామని నిమ్మగడ్డ పేర్కొన్నారు.