ప్రభుత్వాసుపత్రిలో కోలుకుంటున్న బాధితుడు శాంసన్
సాక్షి, కొయ్యలగూడెం(పశ్చిమగోదావరి) : ర్యాగింగ్ భూతానికి అభం శుభం తెలియని ఓ విద్యార్థి విలవిల్లాడి మానసిక క్షోభకు గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన వెలుగుచూసింది. ప్రస్తుతం ఆ బాలుడు ఆస్పత్రిలో కోలుకుంటున్నాడు. బాలు డికి వైద్య వివరాలు బయటకు తెలియ నీయకుండా ఆసుపత్రులను మార్చుతూ జరిగిన ఘటనను కప్పిపుచ్చేం దుకు సంక్షేమ శాఖ వసతిగృహం అధికారులు ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. వివరాల్లోకి వెళితే.. జంగారెడ్డిగూడెం మండలం చల్లవారిగూడానికి చెందిన పాక గంగరాజు కుమారుడు పాక శాంసన్(15) కొయ్యలగూడెం సమీపంలోని అంకాలగూడెంలో నిర్వహిస్తున్న ప్రభుత్వ కళాశాల సంక్షేమ వసతిగృహంలో విద్యనభ్యసిస్తున్నాడు. శాంసన్ నెలక్రితం వసతిగృహంలో చేరి, కొయ్యలగూడెంలోని ఓ కళాశాలలో ఇంటర్ (ప్రథమ) చదువుతున్నాడు. బయోమెట్రిక్ అమలు కాకపోతుండటంతో 15 రోజుల క్రితం వసతిగృహం అధికారి శాంసన్‌ను స్వగ్రామం పంపినట్లు తెలిసింది.
సోదరి ఫంక్షన్ చల్లవారిగూడెంలో ఏర్పాటు చేయడంతో శాంసన్ అక్కడికి వెళ్లాడు. నాలుగు రోజుల క్రితం తిరిగి వసతిగృహానికి వచ్చిన శాంసన్ ఆగస్టు 30వ తేదీ రాత్రి ఆత్మహత్యకు యత్నించాడు. దీనిపై సంక్షేమశాఖాధికారిని వివరణ కోరగా వసతిగృహాన్ని విడిచి ఇంటికి వచ్చినందుకు తండ్రి మందలించడంతో ఆవేదన చెందిన శాంసన్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని పేర్కొన్నారు. శాంసన్‌ను వాహనంలో కొయ్యలగూడెం, అక్కడి నుంచి జంగారెడ్డిగూడెం ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నామని పేర్కొన్నారు. శాంసన్ తండ్రి గంగరాజు, ఆసుపత్రిలో కోలుకుంటు న్న తన కుమారుడు ఎదుర్కొన్న వేధిం పులను సాక్షికి వివరించారు. శాంసన్‌ను తోటి విద్యార్థులు అనాకారిగా ఉన్నావంటూ గేలి చేస్తున్నారంటూ కొద్ది రోజుల నుంచి ఫోన్‌లో వాపోతున్నాడని పేర్కొన్నారు. ఒకటి, రెండుసార్లు విద్యార్థులకు స్వయంగా వెళ్లి చెప్పి చూశానని ఆయన తెలిపారు. ఇంటికి వచ్చి వెళ్లిన శాంసన్‌ను విద్యార్థులు మరింత గేలి చేయడంతో ఆత్మహత్యకు ఒడిగట్టాడని గంగరాజు తెలిపారు.
ఇదే విషయాన్ని శాంసన్‌ను అడగ్గా సహచర విద్యార్థులు గేలిచేయడం, అవమానకర రీతిలో మాట్లాడి దూరంగా ఉంచుతున్నారని, దీనిపై సంక్షేమశాఖాధికా రికి ఫిర్యాదు చేస్తే విద్యార్థులకు దూరంగా పడుకోబెట్టేవారని తెలిపాడు. ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన అనంతరం సంక్షేమ శాఖాధికారులు నిజాలు బహిర్గతం చేయవద్దని, చేస్తే వసతిగృహం నుంచి పంపించేస్తామని బెది రించినట్టు శాంసన్ తెలిపారు. దీనిపై వివరణ ఇవ్వడానికి సంబంధిత సంక్షే మ శాఖ అధికారి సుముఖత వ్యక్తం చేయకపోగా, విద్యార్థి వసతిగృహంలో చేరలేదని, అసలు తమకు, ఆ విద్యార్థికి సంబంధం లేదని, తండ్రి మందలిం చడం వల్లే ఆత్మహత్యకు ఒడిగట్టాడని పేర్కొన్నారు. ఆత్మహత్యాయత్నాని పాల్పడిన శాంసన్‌ను ఎవరికీ తెలియకుండా ఆసుపత్రులు మార్చుతూ రహస్యంగా వైద్య చికిత్స అందించడం పలు అనుమానాలకు తావిస్తోంది. వసతిగృహం విద్యార్థులను దీనిపై నోరు మెదపకుండా కఠినంగా అధికారి ఆంక్షలు విధించినట్లు తెలిసింది.కళాశాల వసతిగృహ సంక్షేమ శాఖ అధికారులు తీరును పలువురు విమర్శిస్తున్నారు. శాంసన్ కొయ్యలగూడెం– పోలవరం రోడ్డులో పురుగు మందుల షాపులో గుళికలు కొనుగోలు చేసినట్లు విచారణలో బయటపడింది.
Comments
Please login to add a commentAdd a comment