రాయవరం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహిస్తున్న విద్యార్థులు
తూర్పుగోదావరి , రాయవరం (మండపేట): విద్యార్థి దశలో అత్యంత కీలకమైనది ఇంటర్మీడియట్. కోరుకున్న కళాశాలలో, కోర్సులో సీటు దక్కించుకోవాలంటే ఇక్కడ సాధించే మార్కులు అత్యంత కీలకం. ముఖ్యంగా సైన్స్ విద్యార్థులకు ప్రాక్టికల్స్‌కు వేసే మార్కులకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఏ చిన్న తప్పిదం చేసినా మార్కులు కోల్పోయే ప్రమాదముంది. ఆసక్తి చూపితే 30కి 30 మార్కులు సాధించవచ్చని సంబంధిత నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే ప్రయోగ పరీక్షల షెడ్యూల్ ఖరారైంది. ఇక మిగిలింది వారం రోజులు మాత్రమే. ఈ క్రమంలో ప్రాక్టికల్స్‌లో విద్యార్థులకు ఎదురయ్యే ఇబ్బందులు.. వాటిని ఎలా అధిగమించాలి.. ఆయా సబ్జెక్టుల్లో నిపుణులైన అధ్యాపకులు ఇచ్చే సూచనలు.. మెళకువలు విద్యార్థుల కోసం..
ప్రయోగ పరీక్షల షెడ్యూల్..
‘ప్రయోగ’ పరీక్షలు ప్రతి రోజు ఉదయం 9–12 గంటల వరకు, మధ్యాహ్నం 2–5 గంటల వరకు జరగనున్నాయి. ప్రయోగ పరీక్షల్లో ఎంపీసీ విద్యార్థులకు 60 మార్కులు, బైపీసీ విద్యార్థులకు 120 మార్కులు కేటాయిస్తారు.
మంచి మార్కులు సాధించవచ్చు..
భౌతిక శాస్త్రానికి మూడు గంటల సమయానికి 30 మార్కులు కేటాయిస్తారు. మొత్తంగా 20 ప్రయోగాల్లో ఆరు విభాగాల నుంచి 38 ప్రశ్నలుంటాయి. ప్రతి బ్యాచ్‌కు 12 ప్రశ్నల వంతున ఇస్తారు. ప్రయోగ సూత్రానికి రెండు మార్కులు, ప్రయోగ విధానానికి మూడు పట్టికలు, పరిశీలనలు, గ్రాఫ్‌లకు ఎనిమిది, గణనకు నాలుగు, జాగ్రత్తలకు రెండు, ఫలితం, ప్రమాణాలకు రెండు మార్కులు, రికార్డులకు నాలుగు, వైవాకు ఐదు మొత్తంగా 30 మార్కులుంటాయి. గణన అనే శీర్షిక కింద రఫ్‌గా చేసినదంతా రాయాలి. దానికి నాలుగు మార్కులు వస్తాయి. అన్ని ప్రయోగాలకు జాగ్రత్తలు తప్పనిసరిగా రాయాలి. అన్ని ప్రయోగ విలువలు ఒకే ప్రమాణ పద్ధతిలో ఉండేలా చూసుకోవాలి. ప్రమాణాలు ప్రతి విలువకు ఉన్నాయో లేదో చూసుకోవాలి. పట్టికల్లో ప్రమాణాలు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. అన్ని ప్రశ్నలకు ఒకే శీర్షికలుంటాయి. విద్యుత్ ప్రయోగాలకు సర్క్యూట్ డయాగ్రామ్ (వలయ చిత్రం) తప్పనిసరిగా వేయాలి.– టేకుమూడి రామ్‌కుమార్, ఫిజిక్స్ అధ్యాపకుడు, ప్రభుత్వ జూనియర్ కళాశాల, కాజులూరు
సూటిగా సమాధానాలు చెప్పాలి..
వృక్షశాస్త్రం ప్రయోగ పరీక్ష 30 మార్కుల ప్రశ్న పత్రంలో ఐదు విభాగాలు ఉంటాయి. ఒకటో ప్రశ్నకు వృక్ష వర్గీకరణ శాస్త్రంలో మూడు కుటుంబాల్లో ఒక కుటుంబం వస్తుంది. వర్ణణ క్రమపద్ధతిలో, ప్రణాళికాబద్ధంగా రాయాలి. అడిగిన చిత్రపటాలు, లక్షణాలు, బాగా సాధన చేసి తప్పులు లేకుండా రాయాలి. ఇచ్చిన మొక్కను బట్టి పుష్పచిత్రం, సమీకరణం, కుటుంబం గుర్తింపు తప్పనిసరి. రెండో ప్రశ్న వృక్ష అంతర్నిర్మాణ శాస్త్రం నుంచి వస్తుంది. ఇచ్చిన మెటీరియల్‌ను బట్టి స్లైడ్ తయారీని చాలా శ్రద్ధగా, శుభ్రంగా చేయాలి. విస్తరించిన భాగం పటం గీసి, గుర్తింపు రాయడం ముఖ్యం. మూడో ప్రశ్న వృక్ష శరీర ధర్మశాస్త్రం (లైవ్ ప్రయోగాలు) లాటరీ పద్ధతిలో విద్యార్థికి వచ్చిన ప్రయోగానికి అనుగుణంగా పరికరాల అమరిక చేయాలి. ఉద్దేశం, సూత్రం, పరిశీలన ఫలితం మాత్రమే రాయాలి. ఇవి చాలా సులభమైన ప్రశ్నలు. నాలుగో ప్రశ్నకు ఐదు మార్కులు పొందవచ్చు. స్పాటరు లేదా స్లైడును గుర్తించి దాని లక్షణాలు రాయాలి. రికార్డు, హెర్బేరియాలలో హెర్బేరియాను నీట్‌గా తయారు చేసి కవర్‌లో ఉంచి కవర్‌పై నంబరు వేయాలి.
– కట్టు వినుతకుమారి, వృక్షశాస్త్ర అధ్యాపకురాలు, ప్రభుత్వ జూనియర్ కళాశాల, కిర్లంపూడి
ఫలితం తప్పనిసరి...
రసాయనశాస్త్రం ప్రయోగ పరీక్ష 30 మార్కులకు ఉంటుంది. మూడు గంటల సమయం ఇస్తారు. ఇందులో మూడు విభాగాలు ఉంటాయి. మొదటి విభాగంలో ఇచ్చిన లవణం రంగు భౌతిక స్థితి, జ్వాలా వర్ణ పరీక్ష, వేడి చేయడం తర్వాత ఆనయాన్, కాటయాన్‌లను గుర్తించడం, వాటి నిర్ధారణ పరీక్షలు ముఖ్యమైనవి. చివరగా ఫలితం తప్పనిసరిగా రాయాలి. ఈ విభాగానికి పది మార్కులుంటాయి. రెండో విభాగంలో ఘన పరిమాణాత్మక విశ్లేషణకు 8 మార్కులు. అందులో మొదటి పది నిమిషాల్లో ప్రయోగ విధానం రాయాలి. బ్యూరెట్ రీడింగులు, ఎటువంటి కొట్టివేతలు లేకుండా పట్టికలు రాసి, లెక్కింపు విధానం, ఫలితం రాయాలి. మూడో విభాగంలో ఎ నుంచి డి వరకు ప్రశ్నల్లో ఒకటి మాత్రమే చేయాలి. ఈ విభాగానికి ఆరు మార్కులు. ‘ఎ’లో ఇచ్చిన కర్బన పదార్ధం నుంచి ప్రమేయ సమూహాన్ని గుర్తించాలి. ‘బి’లో కొల్లాయిడల్ ద్రావణాలను తయారు చేయడం, ‘సి’లో క్రొమోటోగ్రఫీలో కార్బోహైడ్రేట్ల చర్యలు, ప్రొటీన్ల చర్యలు ఉంటాయి. – ఎ.దుర్గాప్రసాద్, రసాయనశాస్త్ర అధ్యాపకుడు,ప్రభుత్వ జూనియర్ కళాశాల, దేవిపట్నం
Comments
Please login to add a commentAdd a comment