శ్రీకాకుళం న్యూకాలనీ :ఇంటర్మీడియెట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 59 కేంద్రాల్లో విద్యార్థులు పరీక్షలు రాశారు. ఉదయం 9 నుంచి 12 గంటలకు ప్రథమ సంవత్సరం, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ద్వితీయ సంవత్సరం విద్యార్థులు పరీక్షలు రాశారు. ఫస్టియర్ విద్యార్థులు సెట్-3 ప్రశాశ్నపత్రంతో తెలుగు, సంస్కృతం, హిందీ, ఒడియా పేపర్లకు పరీక్ష రాయగా, రెండో ఏడాది విద్యార్థులు సెట్-1 ప్రశ్నపత్రంతో పరీక్ష రాశారు. తొలిరోజు ఎలాంటి మాల్‌ప్రాక్టీసు కేసులు నమోదు కాలేదు.
370 మంది డుమ్మా
ఫెయిలైన విద్యార్థులు సప్లిమెంటరీకి హాజరయ్యేందుకు ఫీజులు చెల్లించినప్పటికీ చాలామంది పరీక్షకు గైర్హాజరయ్యారు. తొలిరోజు 370 మంది డుమ్మా కొట్టారు. ప్రథమ సంవత్సరం 4,902 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 4,617 మంది పరీక్ష రాశారు. 285 మంది గైర్హాజరయ్యారు. ద్వితీయ సంవత్స రం 608 మంది ఫీజు చెల్లించగా 85 మంది డుమ్మా కొట్టారు. కాగా ఆర్‌ఐవో ఎ.అన్నమ్మ పట్టణంలోని శాంతి నికేతన్, చైతన్య సహకార, శ్రీచైతన్య జూనియర్ కళాశాలల కేంద్రాలను తనిఖీచేయగా, డీఈసీ కమిటీ సభ్యులు ఆమదాలవలసలోని పలు కేంద్రాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఫ్లయింగ్, సిట్టింగ్ బృందాలు వేర్వేరుగా పలు కేంద్రాలను తనిఖీ చేశారు.
ఉక్కపోతతో తడిసిముద్దయ్యారు
మండే ఎండలతోపాటు ఉక్కపోతతో విద్యార్థులు తడిసిముద్దయ్యారు. సుదూర ప్రాంతాలతోపాటు గ్రామీణ ప్రాంతాల్లోని పరీక్ష కేంద్రాలకు చేరుకోవడానికి ఆపసోపాలు పడ్డారు. ఆయా రూట్లలో నడపాల్సిన బస్సులు సమయపాలన పాటించకపోవడంలో మరిన్ని కష్టాలను ఎదుర్కొన్నారు. కొన్ని రూట్లలో అసలు బస్సులే నడపలేదని విద్యార్థులు వాపోయారు. దీనికితోడు పరీక్ష కేంద్రాల్లో పూర్తిస్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పించకపోవడంతో విద్యార్థులకు తిప్పలు తప్పలేదు. మంగళవారం ఇంగ్లిషు పరీక్ష జరగనుంది.
ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం
Published Tue, May 26 2015 1:37 AM | Last Updated on Sun, Sep 3 2017 2:40 AM
Advertisement