డ్వాక్రా మహిళలకు పూర్తిగా రుణమాఫీ చేస్తామన్న ఈ ప్రభుత్వం కుచ్చుటోపి పెట్టింది. దీనికి తోడు గతంలో సక్రమంగా రుణా లు చెల్లించిన గ్రూపులకు ప్రభుత్వం నుంచి రావాల్సిన వడ్డీ ఇంతవరకు వారి ఖాతాల్లో జమ కాలేదు.
పలమనేరు: డ్వాక్రా మహిళలకు పూర్తిగా రుణమాఫీ చేస్తామన్న ఈ ప్రభుత్వం కుచ్చుటోపి పెట్టింది. దీనికి తోడు గతంలో సక్రమంగా రుణా లు చెల్లించిన గ్రూపులకు ప్రభుత్వం నుంచి రావాల్సిన వడ్డీ ఇంతవరకు వారి ఖాతాల్లో జమ కాలే దు. సుమారు 6 కోట్ల రూపాయలను ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. వడ్డీలేని రుణాలు తీసుకుని బ్యాంకులకు సక్రమంగా చెల్లించినప్పటికీ ఇంతవరకు వడ్డీ జమ కాలేదని, ఎప్పుడు అందుతుం దని గ్రూపు సభ్యులు పలుసార్లు ఐకేపీ అధికారులను ప్రశ్నిస్తున్నారు. బ్యాంకర్లు మాత్రం తమకు ఇంకా డీఆర్‌డీఏ, సెర్ఫ్ నుంచి నిధులు అందలేదని చెబుతున్నారు.
అసలేం జరిగిందంటే..
జిల్లాలో అర్బన్, రూరల్‌లో కలిపి మొత్తం 61వేల 711 స్వయం సహాయక సంఘాలు ఉన్నాయి. వీటిల్లో 5.65 లక్షల మంది గ్రూపు సభ్యులు ఉన్నారు. వీరు ఈ ఏడాది మార్చి 31వ తేదీ వరకు రూ. 1611.03 కోట్లను బ్యాంకుల నుంచి రుణాలుగా పొందారు. వీరిలో 40 శాతం మంది సకాలంలో రుణాలు చెల్లించారు. గతంలో వైఎస్.రాజశేఖరరెడ్డి ప్రభుత్వం పావలా వడ్డీని అమలు చేసింది. రుణాలు సక్రమంగా చెల్లించిన వారికి పావలా వడ్డీని సైతం వెనక్కిచ్చింది.
అయితే ఆ తర్వాత ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన కిరణ్‌కుమార్‌రెడ్డి మరో కొత్త పథకాన్ని తెరమీదకు తీసుకొచ్చారు. తాము గ్రూపు మహిళలకు వడ్డీలేని రుణాలను అందజేస్తామని చెప్పారు. 2013 జనవరి 1 నుంచి ఈ పథకం అమల్లోకి వచ్చింది. ఈ మేరకు గ్రూపుల్లోని మహిళలు బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను నిర్ణీత వ్యవధిలో చెల్లిస్తే వారి వడ్డీని ప్రభుత్వం వెనక్కి ఇవ్వాల్సి ఉంది.
దీనికి సంబంధించి సంబంధిత బ్యాంకు ల్లో వడ్డీ వెనక్కి తీసుకునేందుకు అర్హులైన లబ్దిదారుల జాబితాను బ్యాంకర్లు ప్రభుత్వానికి అందజేశారు. ఆ మేరకు ఐకేపీకి సంబంధించి డీఆర్‌డీఏ నుంచి మెప్మాకు సంబంధించి సెర్ఫ్ నుంచి ఈ నిధులు గ్రూపులకు అందాల్సి ఉంది. గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తామెందుకు అమలు చేయాలనే ఉద్దేశ్యంతో ఈ ప్రభుత్వం అస్సలు పట్టించుకోలేదనే విమర్శలు ఉన్నాయి. ఫలితం గా జిల్లాలోని మహిళలకు అందాల్సిన రూ.6 కోట్లు ఇంతవరకు అందలేదు.
అధికారులను అడిగినా సమాధానం లేదు
గతంలో ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు తాము సక్రమంగా రుణాలు చెల్లించినా వడ్డీ ఎందుకు రాలేదని గ్రూపు సభ్యులు అధికారులను ప్రశ్నిస్తున్నారు. అయితే అధికారులు సరైన సమాధానం చెప్పడం లేదని పలువురు గ్రూపు సభ్యులు చెబుతున్నారు. బ్యాంకర్లకు విన్నవిస్తే ప్రభుత్వం నుం చి నిధులు అందితే గానీ అర్హులైన వారికి వడ్డీని వెనక్కి ఇవ్వడం కుదరదని చెబుతున్నారు. ఇప్పటికైనా తమకు న్యాయం చేయాలని మహిళా గ్రూ పులు కోరుతున్నాయి.