
అంతర్‌రాష్ట్ర దొంగ అరెస్టు
అంతర్‌రాష్ట్ర దొంగ గురివిల్ల అప్పలనాయుడును ఒంగోలు సీసీఎస్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు.
ఒంగోలు క్రైం : అంతర్‌రాష్ట్ర దొంగ గురివిల్ల అప్పలనాయుడును ఒంగోలు సీసీఎస్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. ఈ మేరకు స్థానిక సీసీఎస్ పోలీసుస్టేషన్‌లో అదనపు ఎస్పీ బి.రామానాయక్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి నిందితుని వివరాలు వెల్లడించారు. ఏఎస్పీ కథనం ప్రకారం.. అప్పలనాయుడు పట్టపగలు దొంగతనాలు చేయటంలో దిట్ట. ఈ ఏడాది మే 19న ఒంగోలు పట్టణం అద్దంకి బస్టాండ్ సెంటర్‌లోని టైర్ల షాపులో పట్టపగలే రూ.8.59 లక్షల నగదు చోరీ చేశాడు. అదే విధంగా 2014 నవంబర్‌లో కందుకూరు పట్టణంలో పామూరు రోడ్డులోని సిమెంట్ దుకాణంలో రూ.2.65 లక్షలు దోచుకెళ్లాడు.
తాళాలు వేసి ఉన్న క్యాష్ కౌంటర్లలోని నగదు అపహరించటంలో అప్పలనాయుడు నేర్పరి. నిందితుని స్వగ్రామం శ్రీకాకుళం జిల్లా బుడితి గ్రామం. కొంత కాలంగా సింగరాయకొండ మండలం సోమరాజుపల్లి తిరుమల పట్టాభినగర్‌లో నివాసం ఉంటున్నాడు. 22 ఏళ్ల నిందితుడు చిన్న తనం నుంచే చెడు వ్యసనాలకు లోనై దొంగతనాలు చేయడమే వృత్తిగా పెట్టుకున్నాడు. దొంగతనాలకు సంబంధించిన కేసులపై విచారిస్తున్న సమయంలో ఫింగర్ ప్రింట్స్ సీఐ ఇచ్చిన ఆధారాల ప్రకారం ఒంగోలు, కందుకూరు ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడింది అప్పలనాయుడిగా పోలీసులు గుర్తించారు.
అతని కదలికలపై నిఘా ఉంచారు. నగరంలోని ఆర్టీసీ బస్టాండ్ సెంటర్‌లో ఓ యువకుడు అనుమానాస్పదంగా తిరుగుతుండగా ఒంగోలు ఒన్‌టౌన్ పోలీసులు, సీసీఎస్ పోలీసులు పట్టుకొని విచారించగా అతడు అప్పలనాయుడుగా తేలింది. నిందితునిపై ఒంగోలు ఒన్‌టౌన్, తాలూకా, హైదరాబాద్ వనస్థలిపురం పోలీస్‌స్టేషన్లలో కేసులు నమోదై ఉన్నాయని ఏఎస్పీ వెల్లడించారు. ఈ సందర్భంగా సీసీఎస్ డీఎస్పీ వెంకటేశ్వరరావు, సీఐలు సీహెచ్ వెంకటేశ్వరరావు, భూషణం, ఏఎస్‌ఆర్‌కే రెడ్డి, ఒన్‌టౌన్ సీఐ కేవీ సుభాషిణి, సీసీఎ్‌స్ ఎస్సైలు నాయబ్ రసూల్, హెచ్‌సీ టి.బాలాంజనేయులు, కోటి, వై.చంద్రశేఖర్, అంజిబాబు, శేషు, శాంతకుమార్, ఖాదర్ బాష, లోకేష్‌లను ఏఎస్పీ అభినందించారు.