అధికారుల జోక్యంతో ఆగిన బాల్య వివాహం | intervention of the officers stopping child marriage | Sakshi
Sakshi News home page

అధికారుల జోక్యంతో ఆగిన బాల్య వివాహం

Published Tue, Feb 18 2014 11:57 PM | Last Updated on Wed, Mar 28 2018 10:59 AM

intervention of the officers stopping child marriage

మర్పల్లి, న్యూస్‌లైన్:  తన పెళ్లిని ఆపాలంటూ ఓ బాలిక బాల్య వివాహాల నిరోధక కమిటీని ఆశ్రయించింది. వివరాలు.. మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలో 9వ తరగతి చదువుతున్న మర్పల్లి గ్రామానికి చెందిన ఆర్. శైలజ(15 సంవత్సరాలు) తండ్రి గతంలోనే మృతిచెందగా తల్లి మరో వివాహం చేసుకుంది. దీంతో అనాథగా మారిన శైలజను ఆమె మేనమామ తిరుపతి చేరదీసి చదివిస్తున్నారు. ఈక్రమంలో శైలజ వివాహం తన తమ్ముడు నర్సింలుతో చేయాలని తిరుపతి నిశ్చయించుకున్నారు.

ఈ నెల 20న వివాహం చేసేందుకు అన్ని ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. అయితే తనకింత చిన్న వయసులోనే వివాహం వద్దనుకున్న శైలజ బాల్య వివాహాల నిరోధక మండల కమిటీని ఆశ్రయించింది. ఈ సమాచారం అందుకున్న తహసీల్దార్ షాహాదా బేగం, ఎస్‌ఐ అరుణ్‌కుమార్ బాలిక మేనమామ తిరుపతిని, పెళ్లి కుమారుడు నర్సింలును పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహించారు.

 బాలికకు వివాహం చేయడం చట్టరీత్యా నేరమని, శైలజ మేజర్ అయిన తర్వాత ఆమె ఇష్టపూర్వకంగా పెళ్లి చేయవచ్చని స్పష్టం చేశారు. దీంతో వారు పెళ్లిని రద్దు చేసుకుంటున్నట్లు అధికారులకు తెలిపారు. అయితే బాలికను మర్పల్లి సీడీపీఓకు అప్పగించి మొయినాబాద్‌లోని అనాథ ఆశ్రమంలో చేర్పించి చదివించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు చెప్పారు. కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ రాములు, ఎంవీఎఫ్ మండల ఇన్‌చార్జి సంగమేశ్వర్, గ్రామ ఉపసర్పంచ్ స్వప్నశేఖర్‌లు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement