శివయ్యా.. సరుకులు లేవయ్యా!
శ్రీకాళహస్తీశ్వరాలయంలో ఫలసరుకుల కొరత
రెండు రోజులకు మాత్రమే నిల్వలు
నామమాత్రంగా ప్రసాదాల పంపిణీ
అసహనం వ్యక్తం చేస్తున్న భక్తులు
శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానంలో ఫలసరుకుల కొరత తీవ్రమైంది. మిరియాలు, బెల్లం, కందిపప్పు, పెసరపప్పు, జీడిపప్పు, మంచినూనె, శనగనూనె పూర్తిగా నిండుకున్నాయి. మరో రెండు రోజుల్లో మిగిలిన నిత్యావసర సరుకులూ అయిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. ఏం చేయాలో తెలియక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. కాంట్రాక్టర్ల ప్రక్రియలో ఏర్పడిన గందరగోళమే ఈ దుస్థితికి కారణమని పలువురు పేర్కొంటున్నారు.
తూతూమంత్రంగా ప్రసాదాల పంపిణీ
సాధారణంగా రోజుకు ఎని మిది వేల మంది భక్తులకు ఉచి తంగా బెల్లపు ప్రసాదం అంది స్తుంటారు. అయితే బెల్లం నిల్వలు లేకపోవడంతో సోమవారం చక్కెరతో నామమాత్రంగా ప్రసాదం తయారుచేసి తూతూమంత్రంగా పంపిణీ చేశారు. ఇందులో జీడిపప్పు, పెసర పప్పు కనిపించలేదు. నిత్యాన్నదానంలో వడ్డించే బెల్లపు ప్రసాదందీ అదే పరిస్థితి.
రెండు రోజులకు మాత్రమే సరుకులు
దేవస్థానంలో రెండు రోజులకు సరిపడా నిత్యావసరసరుకులే ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో ప్రధానంగా రాహుకేతు పూజలకు అవసరమైన ఉద్దులు, ఉలవలు, చక్కెర, మిరపకాయలు, ఆవాలు, జీలకర్ర తదితర 40 రకాల వస్తువుల నిల్వలు అంతంతమాత్రంగా ఉన్నాయి. ఉద్దిపప్పు, ఉలవలు అతికొద్ది మొత్తంలో ఉన్నాయి. బియ్యం రోజుకు 30 బస్తాలు అవసరంకాగా ప్రస్తుతం 200 బస్తాలు మాత్రమే ఉన్నట్లు తెలుస్తోంది.
గందరగోళంగా టెండర్ల వ్యవస్థ
దేవస్థానంలో టెండర్ల వ్యవస్థ గందరగోళంగా మారింది. సాధారణంగా నవంబర్ నుంచి వచ్చే ఏడాది నవంబర్ వరకు దేవస్థానానికి అవసరమైన ఫల సరకులు సరఫరా చేయుడానికి టెండర్లు నిర్వహిస్తుంటారు. అరుుతే గత ఏడాది నవంబర్‌లో జరిగిన టెండర్ల వ్యవస్థలో గందరగోళం ఏర్పడింది. ఈ ప్రక్రియ మొత్తం అస్తవ్యస్తంగా తయారైంది. దీనిపై దేవస్థానం అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఫలితంగా ప్రస్తుతం సరుకుల సరఫరాలో అవాంతరాలు ఎదురయ్యాయి.