జడ్చర్ల టౌన్, న్యూస్‌లైన్ : ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే నీళ్లు, విద్య, ఉద్యోగాల సమస్య ఉత్పన్నమవుతుంద ని పది మంది సీమాంధ్ర పెట్టుబడిదారులు తప్పుదోవపట్టిస్తూ సమైక్య ఉద్యమాన్ని చేపట్టారని ఖాదీబోర్డు సౌత్‌జోన్ చైర్మన్ కాళప్ప ఆరోపించారు. ఆదివారం హైదరాబాద్ నుంచి రాయిచూర్ వెళుతూ మార్గమధ్యంలో జడ్చర్ల ప్రభుత్వ అతిథి గృహంలో విలేకరులతో ఆయన మాట్లాడారు.
కేంద్ర ప్రభుత్వం తక్షణమే పది జిల్లాలతో కూడిన తెలంగాణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. నీటి సమస్య పరిష్కారానికి తుంగభద్రపై ఉన్నట్లుగా స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన బోర్డులను కృష్ణా, గోదావరికి నియమిస్తే ఏ సమయంలో ఎవరికి ఎంత నీళ్లు ఇవ్వాలో తేల్చవచ్చన్నారు. విద్యాపరంగా తెలంగాణ కన్నా అధికంగా సీమాంధ్రలోనే యూనివర్సిటీలు ఉన్నాయన్నారు. ఐటీ విషయంలోనూ విశాఖ లాంటి పట్టణాల్లో ఎంతో అభివృద్ధి చేసే అవకాశముందన్నారు. అమెరికాలాంటి దేశాల్లో కార్యాలయాలకు వెళ్లకుండా ఇంట్లోనే ఉండి ఐటీ ఉద్యోగాలు చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు.
కేవలం పది మంది పెట్టబడిదారులు వారి జిల్లాలను అభివృద్ధి చేయకుండా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో పెద్దఎత్తున భూ వ్యాపారాలకు పాల్పడి కోట్లు గడించారని ఆరోపించారు. అభివృద్ధి అంటే నగరం చుట్టూ ఉన్న చెరువులు, కుంటలు ఆక్రమించి భవనాలు నిర్మించటమేనా? అని ప్రశ్నించారు. సీమాంధ్రలో బడుగు, బలహీనవర్గాల నాయకులే లక్ష్యంగా సమైక్య ఉద్యమం సాగుతోందని విమర్శించారు.
ఇంతవరకు బీసీ నాయకుల ఇళ్లపై దాడులు చేశారు కాని ఇతర నాయకులను ఎందుకు లక్ష్యంగా పెట్టుకోలేదో అందరూగ్రహించాలన్నారు. సమావేశంలో డీసీసీ కార్యదర్శి సంజీవ్‌ముదిరాజ్, వాల్మీకి సేవాసమితి రాష్ట్ర నాయకుడు అయ్యన్న, విశ్వబ్రాహ్మణ మనుమయ సంఘం అధ్యక్షుడు రంగాచారి, కార్యదర్శి వడ్ల శేఖర్, స్వర్ణకారుల సంఘం ఉపాధ్యక్షుడు శేఖరాచారి, న్యాయవాది వినోద్, నాయకులు జగదీశ్, వేణు, తిరుపతయ్య పాల్గొన్నారు.
పెట్టుబడిదారుల వల్లే సీమాంధ్ర ఉద్యమం
Published Mon, Oct 7 2013 3:15 AM | Last Updated on Mon, Oct 8 2018 5:04 PM
Advertisement
Advertisement