మహబూబ్‌నగర్, సాక్షి ప్రతినిధి: తెలంగాణ ప్రత్యేకరాష్ట్ర ఏర్పాటు నిర్ణయంపై కాంగ్రెస్‌పార్టీ అధిష్టానానికి ధన్యవాదాలు తెలిపేందుకు ఆ పార్టీ నేతలు జైత్రయాత్రలు నిర్వహిస్తున్నారు. మరోవైపు టీఆర్‌ఎస్ పార్టీలు మాత్రం జైత్రయాత్రలు విజయవంతం కాకుండా ఎక్కడికక్కడ నిరసనలు వ్యక్తం చేసేందుకు వ్యూహరచన చేస్తున్నారు. తెలంగాణపై సీడబ్ల్యూసీలో నిర్ణయం తీసుకోవడం, ఆ తర్వాత రాష్ట్ర ఏర్పాటుకు తీసుకోవాల్సిన చర్యలపై కేంద్ర ప్రభుత్వం చకచకా నిర్ణయాలు తీసుకుంటున్న తరుణంలో ఇన్నాళ్లూ స్తబ్ధతగా ఉన్న కాంగ్రె స్ నేతలు తామే తెలంగాణ తెచ్చామని చెప్పుకునేందుకు ఈనెల 29న గద్వాలలో జైత్రయాత్ర నిర్వహిస్తున్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ఆ పార్టీ నేతలు సమాయత్తమవుతున్నారు.
అందులో భాగంగానే మంత్రి డీకే అరుణతో పాటు జిల్లాకు చెందిన కొంతమంది కాంగ్రెస్ నేతలు ఢిల్లీకి వెళ్లి గద్వాలలో నిర్వహించతలపెట్టిన జైత్రయాత్ర కార్యక్రమానికి రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్‌ను ఆహ్వానించిన విషయం తెలిసిందే. అయితే పార్లమెంట్‌లో బిల్లు ఆమోదం పొందేవరకు ప్రత్యేకరాష్ట్ర ఏర్పాటును నమ్మలేమని, ఆ తర్వాతనే సంబరాలు చేసుకుందామని టీఆర్‌ఎస్ నేతలు పదేపదే ప్రకటిస్తున్నారు. ఇదే విషయాన్ని శుక్రవారం జరిగిన టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సమావేశంలో ఆ పార్టీ అధినేత కె.చంద్రశేఖర్‌రావు ప్రత్యేకంగా ప్రస్తావించారు.
పార్లమెంట్‌లో బిల్లు ఆమోదం పొందిన తర్వాతే పార్టీ విలీనం గురించి ఆలోచిద్దామంటూ పార్టీ నేతలకు సూచించారు. రాష్ట్ర ఏర్పాటుకు నిర్ణయం పూర్తికాకుండానే తెలంగాణ వచ్చేసిందనే రీతిలో సంబరాలు చేసుకోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ కోసం పోరాటాలు చేసిన ఉద్యమకారులు, విద్యార్థులపై అక్రమ కేసులు బనాయించినందుకు జైత్ర యాత్రలు చేస్తున్నారా? అంటూ టీఆర్‌ఎస్ నేతలు బహిరంగ ఆరోపణలు చేస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్దగా పాలు పంచుకోకపోవడంతో జిల్లాలో ఆ పార్టీ వెనకబడిందని చెప్పొచ్చు.
తెలంగాణ ప్రకటన తర్వాత ఆ లోటును పూడ్చుకునే ప్రయత్నంలో భాగంగా నెలన్నర క్రితం విజయోత్సవ సభల పేరుతో ర్యాలీలు, అన్ని ఉద్యోగ సంఘాల నేతలతో ఇటీవల సమావేశాలు నిర్వహించారు. అయినప్పటికీ ఆశించిన మేర కాంగ్రెస్‌పార్టీకి జనంలో స్పందనరాకపోవడంతో అధిష్టానవర్గం సూచనల మేరకు జైత్రయాత్రలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఆ పార్టీకి చెందిన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తెలంగాణ రాకుండా అడ్డుకుంటామని చెబుతుంటే జైత్రయాత్రలు ఏవిధంగా నిర్వహిస్తారంటూ టీఆర్‌ఎస్ నేతలు ఎదురుదాడికి దిగుతున్నారు.
పాపం ‘తమ్ముళ్లు’!
కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌ల పరిస్థితి ఇలాఉంటే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రెండు కళ్ల విధానం ఆ పార్టీనేతలకు తలనొప్పిగా మారింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కు అనుకూలమంటూనే సీమాంధ్ర ప్రాంతానికి అన్యా యం జరుగుతోందంటూ చంద్రబాబు ఢిల్లీలో దీక్ష చేయ డం జిల్లా నేతలకు మింగుడుపడని పరిస్థితి నెలకొంది. చంద్రబాబు తీసుకున్న నిర్ణయాల వల్ల జిల్లాలో ఆ పార్టీ పూర్తిగా బలహీనపడిందని చెప్పొచ్చు. తమ ఉద్యమాల వల్లే రాష్ట్రం ఏర్పాటు ప్రక్రియ మొదలైందని టీఆర్‌ఎస్, తమ పార్టీ నిర్ణయం తీసుకోవడం వల్లే రాష్ట్రం ఏర్పాటవుతుందని కాంగ్రెస్ నేతలు హడావుడి చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు. కానీ టీడీపీ నాయకులు మాత్రం ఏం చెప్పుకోవాలో తెలియక సతమతమవుతున్నారు.
‘జై’ కొడతారా?
Published Sun, Oct 27 2013 3:55 AM | Last Updated on Mon, Oct 8 2018 5:04 PM
Advertisement
Advertisement