ముక్కోటి దేవతలకు బ్రహ్మోత్సవ ఆహ్వానం
- వేడుకగా శ్రీవారి ధ్వజారోహణం
- తిరుమల కొండ మీద బ్రహ్మోత్సవ సంబరం
సాక్షి, తిరుమల: తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల ప్రారంభానికి నాందిగా ఆలయంలో సోమవారం ధ్వజారోహణం శాస్త్రోక్తంగా నిర్వహించారు. సాయంత్రం 6.15 నుంచి 6.30 గంటల మధ్య మీన లగ్నంలో వైఖానస ఆగమోక్తంగా స్వామి వాహనమైన గరుత్మంతుడి పతాకాన్ని(ధ్వజపటం) బంగారు ధ్వజ స్తంభ శిఖరాగ్రానికి ఆవిష్కరించిన అర్చకులు బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టారు. ఉత్సవమూర్తులైన మలయప్ప, శ్రీదేవి, భూదేవిల సమక్షంలో గోధూళి వేళలో కంకణ భట్టాచార్యులు క్రతువును నిర్వహించి మంగళ ధ్వనులు, వేద మంత్రోచ్ఛారణల మధ్య ఉత్సవ వైభవానికి పతాకావిష్కరణ చేశారు. ధ్వజారోహణానికి ముందు తిరుచ్చివాహనంపై శ్రీదేవి, భూదేవి సమేతుడైన మలయప్ప పరివార దేవతలైన అనంతుడు(ఆదిశేషుడు), గరుత్మంతుడు, విష్వక్సేనుడు, గరుడధ్వజం, సుదర్శన చక్రతాళ్వార్‌తో కలసి ఆలయ పురవీధుల్లో ఊరేగుతూ భక్తులకు కనువిందు చేశారు. ఆలయ సంప్రదాయం ప్రకారం టీటీడీ ఈవో దొండపాటి సాంబశివరావు సోమవారం తొమ్మిది రోజుల బ్రహ్మోత్సవానికి నాందిగా కంకణం ధరించారు.
పెద్దశేషుడిపై పరంధాముడి దర్శనం
బ్రహ్మోత్సవాల్లో మొదటిరోజు సోమవారం రాత్రి శ్రీదేవి, భూదేవి సమేతుడైన మలయప్ప పెద్దశేష వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. సాయంత్రం సహస్ర దీపాలంకరణ సేవలో పూజలందుకున్న స్వామి వాహన మండపంలో వేంచేశారు. రాత్రి 9 గంటలకు ఛత్రచామర, మంగళవాయిద్యాల, పండితుల వేద మంత్రోచ్ఛారణలు, భక్తుల గోవింద నామస్మరణల మధ్య ఉత్సవర్లు ఆలయ పురవీధుల్లో ఊరేగారు. వాహన సేవ ముందు భజన బృందాల కోలాహలం, సాంస్కృతిక కార్యక్రమాలు, కళాకారుల నృత్యాలు, కోలాటాలు, సంకీర్తనలు భక్తులను అలరించాయి.
శ్రీవారికి ఏపీ సీఎం పట్టువస్త్రాలు సమర్పణ
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సోమవారం తిరుమలేశునికి పట్టువస్త్రాలు సమర్పించారు. రాత్రి 7.40 గంటలకు సీఎం సతీసమేతంగా ఆలయం ఎదురుగా ఉన్న బేడి ఆంజనేయ స్వామి ఆలయానికి చేరుకున్నారు. తర్వాత వెండిపళ్లెంలో పట్టువస్త్రాలు ప్రదర్శనగా మహద్వారం నుంచి ఆలయంలోకి తీసుకెళ్లి స్వామివారికి సమర్పించారు. అనంతరం పచ్చకర్పూరపు వెలుగులో శ్రీ వేంకటేశ్వర స్వామివారి దివ్యమంగళరూప విశేషాలు, క్షేత్ర సంప్రదాయాలు అర్చకులు సీఎంకు వివరించారు. టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, ఈవో దొండపాటి సాంబశివరావు, జేఈవో కే ఎస్ శ్రీనివాసరాజు సీఎంకు లడ్డూ ప్రసాదాలు అందజేశారు. తర్వాత చంద్రబాబు పెద్ద శేషవాహన సేవ లోని మలయప్పస్వామివారిని దర్శించుకున్నారు.