జోరుగా ఐపీఎల్ బెట్టింగ్
ప్రతి రోజూ చేతులు మారుతున్న రూ. కోట్లు
కళాశాల విద్యార్థులు సైతం బెట్టింగ్‌లకు బానిసలు
ఆస్తులు పోగొట్టుకుంటున్న వివిధ వర్గాల జనం
భీమవరం కేంద్రంగా విసృ్తతంగా సాగుతున్న జూదం
తూతూ మంత్రం దాడులతో సరిపెడుతున్న పోలీసులు
భీమవరం :
పంటర్ : హలో నేను కేఎస్‌ఆర్‌ను మాట్లాడుతున్నాను. మ్యాచ్ రేటెంత
బుకీ : 56-59 చెన్నై ఫేవరెట్
పంటర్ : 59లో 10 వేలు ఈటింగ్
బుకీ : ఒకే బెర్త్ కన్‌ఫాం
ఇంకో పందర్ : మ్యాచ్ రేటెంత
బుకీ : 63-66 ముంబ య్ ఫేవరెట్
పంటర్ : 63లో ముంబ య్‌పై 10 వేల ప్లేయింగ్
వేరే పంటర్ : నేను జీఆర్‌కే ఫ్యాన్సీ ఎంత - మిగతా 2లోఠ
బుకీ : 10 ఓవర్లలో 74-75
పంటర్ : 75 ఎస్ 10 వేలు
బుకీ : ఒకే కన్‌ఫాం
ఇదేం భాష అనుకుంటున్నారా.. ఇది క్రికెట్ బెట్టింగ్ భాష. మ్యాచ్ ప్రారంభం అయిన దగ్గర నుంచి మ్యాచ్ ముగిసే దాకా పందర్‌లకు, బుకీలకు మధ్య సంభాషణ ఎడతెరిపి లేకుండా కొనసాగుతుంది. పెద్దఎత్తున కంప్యూటర్లు, 50-100 సెల్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, బెట్టింగ్‌కు ఒక ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో కూడిన ల్యాప్‌టాప్ బాక్స్... అబ్బో ఇదంతా మనకు అర్థం కాదులెండి... ఇదంతా పందర్‌లు, బుకీలకు మాత్రమే తెలుస్తుంది. ఈ విధంగా జిల్లాలో భీమవరం కేంద్రంగా పట్టణాలు, గ్రామాలతోపాటు క్రికెట్ బెట్టింగ్‌లు జోరుగా సాగుతున్నాయి. దేశంలో ఐపీఎల్ - 8 క్రికెట్ పోటీలు రసవత్తరంగా సాగుతున్న తరుణంలో క్రికెట్ బుకీలు తమ వ్యాపారాన్ని మూడు పువ్వులు, ఆరు కాయలుగా నిర్వహిస్తూ బెట్టింగ్ రాయుళ్ల ఇళ్లు గుల్ల చేస్తున్నారు. పొట్టి క్రికెట్‌కు ఆదరణ లభించడంతోపాటు జోరుగా బెట్టింగ్ కూడా జరుగుతోంది. ప్రతి రోజు మ్యాచ్ జరగడంతో రూ.కోట్లు ఈ బెట్టింగుల్లో చేతులు మారుతున్నాయి. సాయంత్రం తీరిక సమయాల్లో ఈ మ్యాచ్‌లు జరుగుతుండడంతో విద్యార్థులు, ఉద్యోగులు సైతం పెద్దఎత్తున బెట్టింగ్‌లకు పాల్పడుతున్నారు.
జిల్లాలో బెట్టింగ్గులకు భీమవరం ప్రధాన కేంద్రం కాగా జిల్లాలోని అన్ని మునిసిపాలిటీలతోపాటు సమీప గ్రామాలు బుకీ కేంద్రాలుగా ఉన్నాయి. బుకీలు అపార్ట్‌మెంట్‌లతోపాటు ఇతర రహస్య ప్రదేశాల్లో ఉంటూ ఫోన్‌లు, కంప్యూటర్ల ద్వారా ఈ జూదం పెద్దఎత్తున నిర్వహిస్తున్నారు. ఒకొక్క మ్యాచ్‌కు జిల్లాలో రూ.50 కోట్లు చేతులు మారుతున్నాయనేది నమ్మశక్యం కాని నిజం. మ్యాచ్ ప్రారం భం నుంచి చివరి వరకు కూడా బాల్ బాల్‌కి బెట్టిం గ్‌లు జరుగుతున్నాయి. క్రేజీ సిరీస్ కావడంతో అం దరి దృష్టి దీనిపైనే ఉంది. మొదట్లో సరదాగా ప్రారంభిస్తున్నా తరువాత దానికి బానిసలై ఆస్తులు పోగొట్టుకుంటున్నారు. మ్యాచ్ అయిన మరునాడు బుకీలు బ్యాంకుల ద్వారానో, తమ ఏజెంట్ల ద్వారానో డబ్బు లు వసూలు చేసుకుంటున్నారు. భీమవరానికి చెం దిన కొందరు బుకీలు బెంగళూరు, హైదరాబాద్‌లలో మకాంవేసి మరీ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు.
అడపాదడపా దాడులతో సరి
ఐపీఎల్ సీజన్ చివరికి రావడంతో బెట్టింగ్ మరింత ముమ్మరమైంది. ఇంత జరుగుతున్నా పోలీసులు మాత్రం పెద్దగా పట్టించుకోవడం లేదు. అడపా దడపా చిన్న చిన్న దాడులు చేయడం తప్పితే పెద్ద బుకీలను అదుపులోకి తీసుకోవడం లేదు. ఇటీవల పట్టణ పోలీసులు ఒకరిద్దరు చిన్న తరహా బుకీలను అదుపులోకి తీసుకుని చేతులు దులిపేసుకున్నారు. దేశంలో ముంబ య్ ప్రధాన కేంద్రంగా ఒక చైన్‌లింక్ పద్ధతిలో ఈ బెట్టింగ్‌లు జరుగుతున్నాయి. షేర్ మార్కెట్ మాదిరిగా నిమిష నిమిషానికి మ్యాచ్ రేటు మారిపోతూనే ఉంటుంది. బుకీలు పందర్‌లకు (పంటర్ అంటే పందెం కాసేవారు, బుకీ అంటే పందెం కాయించుకునేవారు) ఇన్ని రెట్లు అని ఆశ చూపించడంతో యువత ఆశతో ఎగబడి పందాలు కాసి డబ్బులు పోగొట్టుకుంటున్నారు. కొంతమంది యువకులు సొమ్ములు పోగొట్టుకుని చెడు వ్యసనాలకు బానిసలవుతున్నారు. భీమవరం పట్టణం నుంచి ప్రతిరోజు సుమారు రూ.4 , 5 కోట్ల సొమ్ము బుకీలకే వెళ్లిపోతోంది. క్రికెట్ బెట్టింగ్‌వల్ల అనేకమంది తమ ఆస్తులను, పొలాలను అమ్ముకోవలసి వస్తోంది.
కళాశాల విద్యార్థి నిలువుదోపిడీ
భీమవరం పట్టణంలోని ఓ కళాశాల ఇంజినీరింగ్ విద్యార్థి రెండు రోజుల క్రితం క్రికెట్ బెట్టింగ్‌లో పాల్గొని తన ఒంటిపై ఉన్న బంగారాన్ని మొత్తం పోగొట్టుకుని లబోదిబోమంటూ వెనుతిరిగాడు. భీమవరం పట్టణ సమీపంలోని గ్రామానికి చెందిన ఆక్వా రైతు రూ.2 కోట్లు డబ్బును బెట్టింగ్‌లో పెట్టి పోగొట్టుకోవడంతో మనోవేదనతోఅనారోగ్యం పాలయ్యాడు.
బెట్టింగ్ తీరు
క్రికెట్ బెట్టింగ్ మొత్తం ఫోన్‌లోనే జరుగుతుంది. ముందుగా తమ వద్ద క్యాష్ డిపాజిట్ చేసిన వ్యక్తుల నుంచి బుకీలు ఫోన్ ద్వారా పందాలు తీసుకుంటారు. ఫోన్‌లో బెర్త్ ఓకే అయిన వెంటనే ఒక కంప్యూటర్ ఆపరేటర్ ద్వారా ల్యాప్‌టాప్‌లో సాఫ్ట్‌వేర్‌తో బెర్త్‌ను నమోదు చేస్తారు. అలా అన్ని బెర్త్‌లు నమోదు చేస్తారు. మ్యాచ్‌లు ముగిసిన అనంతరం ఆ సాఫ్ట్‌వేర్ నుంచి రిజల్ట్ తీసుకుని ఎవరు సొమ్ము గెలిచారో, ఎవరు ఓడారో జాబితా చూసుకుని డబ్బుల వసూళ్లు, పంపిణీ చేస్తుంటారు. చిన్న మొత్తాలను ఏజెంట్ల ద్వారా, పెద్ద మొత్తాలను బ్యాంకుల ద్వారా బట్వాడా సాగిస్తుంటారు. కొంతమంది నమ్మకస్తులకు అరువు బెట్టింగ్ కూడా ఇస్తారు. బుకీలు బెట్టింగ్‌లలో వచ్చిన కొంత సొమ్మును తమ వద్ద ఉంచుకుని మరికొంత తమ పై బుకీలకు పాస్ చేస్తుంటారు. ప్రతిరోజు డబ్బు రవాణా జరుగుతూనే ఉంటుంది. బుకీలు బెంగళూరు, ఇతర ప్రదేశాల్లో ఉన్నా వారి ఏజెంట్లు, గుమస్తాలు భీమవరంలోనే ఉండి డబ్బు మార్పిడి చేస్తుంటారు.
మూడు ఫోర్లు.. ఆరు సిక్స్‌లు
Published Mon, May 18 2015 1:31 AM | Last Updated on Sun, Sep 3 2017 2:14 AM
Advertisement
Advertisement