భయం.. భయం..
- ఇరాక్‌లో అంతర్యుద్ధంతో జిల్లావాసుల కలవరపాటు
- అక్కడ మనోళ్లంతా క్షేమమని సమాచారం
- అయినా బిక్కుబిక్కుమంటున్న కుటుంబసభ్యులు
ఇరగవరం/అత్తిలి/దేవరపల్లి : ఎడారి దేశాల్లో చీమ చిటుక్కుమన్నా ఇరగవరం, అత్తిలి మండలాలు ఉలిక్కి పడుతున్నాయి. పొట్టచేత పట్టుకుని ఆయా మండలాల్లోని పలు గ్రామాల నుంచి గల్ఫ్ దేశాలకు వెళ్లిన వారు ఎందరో ఉన్నారు. చిన్నా చితకా ఉద్యోగాలు చేసుకుంటూ బతుకుతున్నారు.
దీంతో అక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా ఇక్కడ వారి కుటుంబసభ్యులు బిక్కుబిక్కుమంటున్నారు. ఇరగవరం మండలంలోని 21 గ్రామాలకు చెందిన సుమారు 2 వేల మంది వరకు గల్ఫ్ దేశాల్లో పనులు చేస్తున్నారు. వీరిలో అయినపర్రు, అర్జునుడుపాలెం, కంతేరు, పేకేరు, అయితంపూడి, ఓగిడి, ఏలేటిపాడు గ్రామాలకు చెందిన వారు అధికం. ముఖ్యంగా కువైట్, దుబాయ్, సౌదీ అరేబియా, దోహ ఖత్తర్, అబుదుబాయ్ వంటి దేశాల్లో వీరు జీవనోపాధి పొందుతున్నారు.
ఇరగవరం నుంచి 15 మంది..
ఇరగవరం మండలంలో సుమారు 15 మంది వరకు ఇరాక్ వెళ్లినవారిలో ఉన్నారు. వీరిలో అయితంపూడి గ్రామానికి చెందిన వారు ఏడుగురు ఉన్నారు. వీరంతా క్షేమమని సమాచారం ఉన్నా.. వారి కుటుంబసభ్యుల్లో మాత్రం భయం వెంటాడుతోంది.
యువత చూపు.. గల్ఫ్ వైపు..
ఇరగవరం, అత్తిల్లి మండలాల్లో ఎక్కువ మంది వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. వ్యవసాయం ఆటుపోట్లతో కూడుకుని ఉండటంతో వ్యవసాయ కూలీలు, యువకులు ఉపాధి కోసం గల్ఫ్ దేశాలవైపు చూస్తున్నారు. స్థానికంగా ఉన్న ఏజెంట్ల ద్వారా ఆయా దేశాలకు పయనమవుతున్నారు. అయితే కొందరి పరిస్థితి దుర్భరంగా ఉంటోంది. అక్కడ పడరాని పాట్లు పడుతూ అప్పులపాలవుతూ క ష్టాలు పడుతున్నారు. ప్రతిఏటా వందల సంఖ్యలో ఈ మండలాల నుంచి ఏడాది దేశాలకు పనుల కోసం వెళుతున్నారు.
చేదు అనుభవాలు ఎన్నెన్నో..
దేశంకాని దేశంలో.. భాష కాని భాషతో గల్ఫ్ దేశాలకు వెళ్లిన వారు ఇబ్బందులు పడుతు న్నారు. అక్కడ ప్రమాదవశాత్తు కన్నుమూస్తే మృతదేశాలు స్వదేశాలకు పంపేందుకు అధికారులు ఇబ్బంది పెడుతున్నారు. దీంతో ఇక్కడ కుటుంబసభ్యులు నెలల తరబడి మృతదేశాల కోసం పోరాడుతున్నారు. అత్తిలి మండలం, ఇరగవరం మండలంలోని కంతేరు, ఏలేటిపా డు, నారాయణపురం, ఇరగవరం గ్రామాల్లో ఇ లాంటి సంఘటనలు మనకు కనిపిస్తాయి.
భయం వెంటాడుతోంది
అయినపర్రు గ్రామానికి చెందిన వెలగల గోవిందరెడ్డి ఇరాక్ నుంచి ఫోన్‌లో ‘సాక్షి’ విలేకరితో మాట్లాడుతూ సైఫమ్ కంపెనీలో పనిచేస్తున్నట్టు చెప్పారు. రెండేళ్లుగా ఇక్కడ ఉంటున్నానని.. యుద్ధం జరుగుతున్న ప్రాంతానికి రెండు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్నానని అన్నారు. తాను పనిచేస్తున్న కంపెనీ ప్రతినిధులు పూర్తి భద్రత కల్పించారని చెప్పారు. ఏ విధమైన ఆందోళన లేకపోయినా యుద్ధం జరుగుతుందన్న భయం మాత్రం వెంటాడుతోందన్నారు. పరిస్థితులు ఏమాత్రం అనుకూలించకపోయినా స్వదేశానికి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు.
- వెలగల గోవిందరెడ్డి, ఇరాక్‌లో ఉంటున్న అయినపర్రు గ్రామస్తుడు
అత్తిలి నుంచి 40 మంది..
అత్తిలి మండలానికి చెందిన సుమారు 3 వేల మంది గల్ఫ్‌దేశాల్లో ఉపాధి పొందుతున్నారు. వీరిలో అధిక శాతం మంది దుబాయి, సౌదీ, మస్కట్, మలేషియా, సింగపూర్, ఇరాక్ దేశాల్లోని పలు కంపెనీల్లో పనిచేస్తున్నారు. ప్రధానంగా ఆరవల్లి గ్రామానికి చెందిన వారు సుమారు వెయ్యి మంది ఎడారి దేశాల్లో పనిచేస్తున్నారు. వీరితోపాటు పాలి, కొమ్మర, దంతుపల్లి, ఉనికిలి, లక్ష్మీనారాయణపురం, బల్లిపాడు, తిరుపతిపురం, వరిఘేడు, ఉరదాళ్లపాలెం, అత్తిలి, మంచిలి గ్రామాలకు చెందినవారు పెద్ద సంఖ్యలో అక్కడ పనిచేస్తున్నారు.
అంతర్యుద్ధంతో ఆందోళన
ఇరాక్‌లో అంతర్యుద్ధంతో అక్కడకు వెళ్లినవారి కుటుంబసభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. టీవీలు, పత్రికల్లో వస్తున్న కథానాలను చూడటంతోపాటు ప్రతిరోజూ ఫోన్‌లో వారి యోగక్షేమాలపై ఆ రా తీస్తున్నారు. మండలానికి చెందిన సుమారు 45 మంది ఇరాక్‌లో ఉన్నట్టు సమాచారం.
దేవరపల్లి నుంచి 30 మంది
ఇరాక్‌లో అంతర్యుద్ధంతో దేవరపల్లి మండల వాసులు ఆందోళన చెందుతున్నారు. మండలంలోని యర్నగూడెం, త్యాజంపూడి గ్రామాలకు చెందిన 30 మంది యువకులు ఉపాధి కోసం ఏడాది క్రితం ఇరాక్ వెళ్లారు. అక్కడ ఆయిల్ కంపెనీల్లో పనిచేస్తూ ఉపాధి పొందుతున్నారు. వీరిలో మత్స్యకార కుటుంబాలవారే ఎక్కువ మంది. యర్నగూడెం నుంచి 18 మంది, త్యాజంపూడి నుంచి 12 మంది యువకులు ఇరాక్ వెళ్లినట్టు రెవెన్యూ అధికారులకు సమాచారం అందింది.
ప్రస్తుతం అల్లర్లు జరుగుతున్న ప్రాంతానికి 200 కిలోమీటర్ల దూరంలో తామంతా క్షేమంగా ఉన్నామని అక్కడి యువకులు శుక్రవారం ఫోన్ ద్వారా తల్లిదండ్రులకు సమాచారం అందించారు. త్వరలో స్వగ్రామాలకు వచ్చేందుకు సిద్ధమవుతున్నట్టు చెప్పారు. ఏ సమయంలో ఏం జరుగుతుందన్న భయం వెంటాడుతోందని తల్లిదండ్రులకు సమాచారమిచ్చారని యర్నగూడేనికి చెందిన ముంగర రాము, ఉప సర్పంచ్ ముంగర వెంకటేశ్వరరావు ‘సాక్షి’ విలేకరికి చెప్పారు.
తహసిల్దార్‌ను కలిసిన కుటుంబసభ్యులు
యర్నగూడేనికి చెందిన యువకుల కుటుంబసభ్యులు శుక్రవారం తహసిల్దార్ అక్బర్ హుస్సేన్‌ను కలిసి ఇరాక్‌లో ఉంటున్న వారి వివరాలు అందజేశారు. తణుకుకు చెందిన ఏజెంట్ ద్వారా ఇరాక్ వెళ్లినట్టు చెప్పారు. ఏజెంటు వివరాలను సేకరించే పనిలో రెవెన్యూ అధికారులు నిమగ్నమయ్యారు. య ర్నగూడేనికి చెందిన ముంగర లక్ష్మణరావు, ముంగర రామకృష్ణ, ముంగర సత్యనారాయణ, గణుసుల లక్ష్మణరావు, గణుసుల సర్వేస్వరరావు, శిరువేరు రాంబాబు, ముంగర రవి, ముంగర ఏసు, ముంగర నాగేష్, గణుసుల శ్రీను, పంతుల సత్యనారాయణ, ముంగర అయ్యన్న, గణుసుల శ్రీను, ముంగర శ్రీను, ముంగర కన్నయ్య (కృష్ణంపాలెం), ముంగర శ్రీను (కృష్ణంపాలెం), గణుసుల చంద్రరావు, ఎలిగంటి తాతబ్బాయి ఇరాక్‌లో ఉన్నారు. త్యాజంపూడికి చెందిన మరో 12 మంది ఉన్నట్టు సమాచారం.
వివరాలు అందించండి
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట) : ఇరాక్‌లో పనిచేస్తున్న జిల్లావాసులకు సంబంధించి ఎటువంటి సమాచారం ఉన్నా తమకు అందించాలని డీఆర్వో కె.ప్రభాకరరావు ఓ ప్రకటనలో కోరారు. ఇరాక్‌లో ఉంటున్న జిల్లావాసులకు ఎటువంటి హాని జరగకుండా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. ఏలూరు కలెక్టరేట్ 08812-230052, ఏలూరు ఆర్డీవో కార్యాలయం 08812-232044, నరసాపురం ఆర్డీవో కార్యాలయం 08814-274401, కొవ్వూరు ఆర్డీవో కార్యాలయం 08813-231488, జంగారెడ్డిగూడెం ఆర్డీవో కార్యాలయం 08821-223661 ఫోన్ నంబర్లకు తెలియజేయాలని కోరారు.