‘అందరికీ ఇళ్లు’ అంతా అక్రమాలే | Irregularities In TDP Scheme Andariki Illu In Bhimavaram | Sakshi
Sakshi News home page

‘అందరికీ ఇళ్లు’ అంతా అక్రమాలే

Published Sat, Aug 31 2019 9:41 AM | Last Updated on Sat, Aug 31 2019 9:41 AM

Irregularities In TDP Scheme Andariki Illu In Bhimavaram - Sakshi

భీమవరంలో నిర్మిస్తున్న ఇళ్లు   

సాక్షి, భీమవరం(పశ్చిమగోదావరి)  : అందరికీ ఇళ్లు (హౌసింగ్‌ ఫర్‌ ఆల్‌) అంటూ గత ప్రభుత్వం గొప్పగా ప్రచారం చేసి పెద్ద సంఖ్యలో లబ్ధిదారులను చూపించింది. వాటిలోని అవకతవకలు ప్రస్తుత సర్వేలో బయటపడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస యోజన పథకంలో భీమవరం, ఏలూరు, తాడేపల్లిగూడెం, పాలకొల్లు పట్ట ణాల్లో పేదలకు ఇళ్లు ఇచ్చేందుకు తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో పేదల నుంచి దరఖాస్తుల ఆహ్వానించారు. ఆ సమయంలో భీమవరంలో 11,670 మంది ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకోగా అధికారులు వివిధ రకాల సర్వేలు చేసి సుమారు 9,500 మందిని ఎంపిక చేశారు. అందుబాటులో ఉన్న భూమి అందరికీ ఇళ్లు నిర్మించేందుకు సరిపోతుందని అధికారులు నిర్ధారించారు. పట్టణ పరిధిలో 8,352 మందికి ఇళ్లు నిర్మించాలని నిర్ణయించారు.

పాలకొల్లులో 7,159 మంది, తాడేపల్లిగూడెంలో సుమారు 5,500 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. టీడీపీ అధికారంలో ఉండడంతో అప్పట్లో కొంతమంది ఆ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు లబ్ధిదారుల నుంచి ముడుపులు తీసుకుని పొరుగు గ్రామాల్లోన్ని టీడీపీ కార్యకర్తలు, సానుభూతిపరులకు సైతం లబ్ధిదారులు జాబితాలో చోటు కల్పించారనే విమర్శలు వచ్చాయి. అధికారులు వీటిని పట్టించుకోకుండా నాయకులు అడుగులకు మడుగులొత్తుతూ  పొరుగు ప్రాంతాల వారికి సైతం ఇళ్లు మంజూరు చేశారు.  లబ్ధిదారుల జాబితాలో చేరడానికి కొంతమంది తమ రేషన్‌ కార్డు, ఆధార్‌ కార్డులను సైతం భీమవరానికి బదిలీ చేయించుకున్నారు.

సర్వేలో బయటపడుతున్న అనర్హుల సంఖ్య 
గ్రామాలు, పట్టణాల్లో ఉగాది నాటికి 25 లక్షలమంది లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తామంటూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించడంతో మళ్లీ పట్టణాల్లో పెద్ద సంఖ్యలో ఇళ్ల స్థలాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం పట్టణాల్లోని వార్డుల వారీగా వలంటీర్లతో సర్వే చేపట్టింది. దీనిలో గతంలో ఇళ్లు పొందిన వారు, అప్పట్లో దరఖాస్తు చేసుకున్నా మంజూరుకాని పేదలు, కొత్తగా దరఖాస్తు చేసుకున్న ప్రజలు భీమవరం పట్టణంలో దాదాపు 15,682 మంది ఉన్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం పట్టణాల్లోని వార్డుల వారీగా వార్డు వలంటీర్లతో  సర్వే చేపట్టింది. దీనితో గతంలో అక్రమంగా అందరికీ ఇళ్లు పథకంలో ఇళ్లు పొందిన వారి అక్రమాలు బయటపడుతున్నాయి.

ఈ విధంగా భీమవరం పట్టణంలోనే సుమారు 2 వేల మంది అనర్హులకు అప్పటి ప్రజాప్రతినిధులు అక్రమార్గంలో అవకాశం కల్పించినట్లు తెలుస్తోంది. పాలకొల్లు, తాడేపల్లిగూడెం, ఏలూరులో కూడా అప్పట్లో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలున్నాయి. సర్వే ప్రకారం అక్రమార్కులను లబ్ధిదారుల జాబితా నుంచి తొలగిస్తారనే ప్రచారం జోరందుకోవడంతో ఇళ్ల కోసం సొమ్ములు చెల్లించిన లబ్ధిదారులు టీడీపీ నాయకులను ఆశ్రయిస్తున్నట్లు తెలిసింది. ఇల్లు మంజూరుకాకపోగా కట్టిన సొమ్ములు కూడా చేతికి అందకుండా పోతాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అప్పట్లో పార్టీ అధికారంలో ఉందని టీడీపీ నాయకులను ఆశ్రయించి మోసం పోయామని అనేకమంది లబోదిబో మంటున్నారు.  

వైఎస్‌ హయాంలో 82 ఎకరాలు సేకరణ
భీమవరం పట్టణం 12వ వార్డు తాడేరురోడ్డులో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో అప్పటి ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌ ప్రోత్సాహంతో పేదల ఇళ్ల నిర్మాణం కోసం 82 ఎకరాలు సేకరించారు. ఆ స్థలంలో ఇళ్ల నిర్మాణానికి టీడీపీ హయాంలో 2017లో శంకుస్థాపన చేశారు. ఏపీ టిడ్కో నేతృత్వంలో ఎల్‌అండ్‌టీ సంస్థ ఇళ్ల నిర్మాణం చేపట్టింది. అక్కడ దాదాపు మూడు వేలు పైగా ఇళ్ల నిర్మాణం పూర్తయ్యాయి. 323 మందికి రూ. 11.2 కోట్లు రుణం మంజూరు కాగా 300 మంది లబ్ధిదారులకు సంబంధించి రూ.3.66 కోట్ల చెక్కులు టిడ్కోకు అందజేశారు. ఇళ్ల నిర్మాణంలో అవకతవకలు జరుగుతున్నాయని నిర్మాణం వ్యయం కూడా భారీగా పెంచి అధికార పార్టీ నాయకుల సొమ్ము చేసుకోడానికి ప్రయత్నాలు చేస్తున్నారంటూ అప్పట్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో గ్రం«ధి శ్రీనివాస్‌ నేతృత్వంలో అనేక ఆందోళనలు చేపట్టారు. లబ్ధిదారుల ఎంపిక సక్రమంగా లేదని అనర్హులకు అవకాశం కల్పించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. అప్పటి అధికార పార్టీ వీటిని పట్టించుకోకుండా ఇళ్ల నిర్మాణం కొనసాగించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement