
కుప్పం ఉపకాలువను పరిశీలిస్తున్న నిపుణుల కమిటీ
టీడీపీ పాలనలో హంద్రీ–నీవా, గాలేరు–నగరి ప్రాజెక్టులకు సంబంధించి చేపట్టిన పనులపై ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ తొలిరోజు మంగళవారం నిర్వహించిన పరిశీలనల్లో అన్నీ అనుమానాలే వ్యక్తం అయ్యాయి. నిబంధనలు ఏం చెబుతున్నాయి.. అందుకు విరుద్ధంగా పనులకు ఎలా అనుమతులు ఇచ్చారంటూ ఒక్కో పనిని సునిశితంగా పరిశీలిస్తూ నిపుణులు పర్యటన సాగించారు.
సాక్షి, బి.కొత్తకోట / తిరుపతి: గత ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టు పనులను పరిశీలించిన నిపుణుల కమిటీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది. ప్రాజెక్టు పనుల పరిశీలనకు రిటైర్డ్ సీఈ ఐఎస్‌ఎన్ రాజు, రిటైర్డ్ ఇంజినీర్ ఇన్ చీఫ్ అబ్దుల్ బషీర్, రిటైర్డ్ ఇంజినీర్ ఇన్ చీఫ్ ఎల్.నారాయణ రెడ్డి, రిటైర్డ్ ఆర్ అండ్ బీ ఇంజినీర్ ఇన్ చీఫ్ సుబ్బరాయ శర్మ, ఏపీ జెన్‌కో డైరెక్టర్ జీ.ఆదిశేషులను ప్రభుత్వం నియమించింది. ఈ బృందం మంగళవారం గాలేరు–నగరిలో భాగమైన మల్లెమడుగు రిజర్వాయర్ పనులు, హంద్రీ–నీవాలో భాగమైన కుప్పం ఉపకాలువ పనులు పరిశీలించింది. ఎన్నో ప్రశ్నల ను లేవనెత్తింది. తొలుత మల్లెమడుగు రిజర్వాయర్‌ను పరిశీలించి రూ.120కోట్లతో ఇక్కడ పనులు ఎలా చేపట్టారని అధికారులపై అనుమానం వ్యక్తంచేశారు. గాలేరు–నగరి పూర్తి కాలేదు.. ప్రస్తుతానికి ఒక టీఎంసీ సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మిస్తే సరిపోతుంది కదా? ఇది తెలిసీ భారీ అంచనాతో పనులు చేపట్టడానికి కారణమేమిటని అనుమానం వ్యక్తంచేశారు.
ప్రస్తుతం 17శాతం పూర్తయిన పనులు పరిశీలించాక ఒక టీఎంసీ సామర్థ్యానికే రిజర్వాయర్‌ను నిర్మించాలని సూచనలిచ్చారు. గాలేరు–నగరి పూర్తయి నీటి లభ్యత అందుబాటులోకి రాగానే రిజర్వాయర్ సామర్థ్యం పెంచుకోవచ్చ ని సూచనచేశారు. అక్కడి నుంచి కుప్పం ఉపకాలువ పరిశీలనకు వచ్చిన కమిటీ ఈ పనులపై అడుగడుగునా అనుమానాలు, అసంతృప్తిని వ్యక్తం చేసింది. రూ.413 కోట్ల పనులను రూ.430.27 కోట్లకు అప్పగించినా నిర్ణీత గడువులో పనిచేయకపోగా అదనంగా రూ.144.7 కోట్ల పెంపు వెనుక పెద్ద వ్యవహారమే నడిచిందని బలంగా అనుమానం వ్యక్తం చేశారని తెలిసింది. కుప్పం ఉపకాలువ 4వ కిలోమీటర్ నుంచి ప్రారంభమైన పరిశీలన చివరిదాకా సాగింది. 4వ కిలోమీటర్‌కు సమీపంలోని ఎత్తిపోతల పథకాన్ని పరిశీలించాక 11వ కిలోమీటర్ వద్ద గ్యాస్ పైప్‌లైన్ దాటేందుకు తవ్విన సొరంగం, పైప్‌లైన్ పనులు చూశారు. 26వ కిలోమీటర్ వద్ద జరిగిన ఇన్వర్టర్ సైఫన్ పైప్‌లైన్ చూశాక కమిటీకి తీవ్రమైన అనుమానాలు తలెత్తినట్టు తెలిసింది. అసలు ఈ సైఫన్ విధానం పని చేపట్టాలని డీటైల్డ్ ప్రాజెక్టు నివేదికలో ఉందా అని ఆరా తీశారు.
కాలువను తవ్వాల్సిన చోట సైఫన్ పద్ధతి అమలుచేసే విషయంలో తెర వెనుక ఏదో బలమైన వ్యవహరం నడిచిందని కమిటీ నిర్ధారణకు వచ్చినట్టు తెలిసింది. ఇక్కడ కాలువను నిర్మించకపోవడం వల్లే అదనంగా రూ.110 కోట్లు పెంచుకొన్నట్టు నిర్ధారించారని తెలిసింది. డీపీఆర్‌లోని పనులు చేపట్టడం నిబంధనలను పూర్తిగా ఉల్లంఘించడం ఒక ఎత్తయితే, దానికి భారీగా చెల్లింపులు చేయడం సాహసమేనని కమిటీ సభ్యులు చర్చించినట్టు తెలిసింది. దీనికి అనుమతులు ఇచ్చిందెవరని అధికారులను అడిగినట్టు తెలిసింది. కాలువ తవ్వకంలోనూ నిబంధనలు పాటించకుండా కాంట్రాక్టర్ల ఇష్టం మేరకు పనులు చేశారని తేల్చారు. అదే సమయంలో చేసిన పనుల్లో 20 కిలోమీటర్ల కాలువ తవ్వకం తగ్గినప్పుడు అంచనాలు తగ్గాలి కదా, అలా కాకుండా రూ.144 కోట్ల అదనపు చెల్లింపులు చేయడమేమిటని ఆశ్చర్యపోయినట్టు తెలిసింది. 140 కిలోమీటర్ వద్ద సొరంగం, కాలువలోనే పెద్దదైన అక్విడెట్ పనులు పరిశీలించారు. కాలువ పరిశీలన సమయంలో జరిగిన పనులకు నిబంధనలు పాటించలేదని, ఇష్టారాజ్యంగా వ్యవహరించారని తేల్చారని సమాచారం.
నేడు మదనపల్లెలో
కమిటీ సభ్యులు రెండో రోజు బుధవారం మదనపల్లె సమీపంలోని 59వ ప్యాకేజీకి చెందిన సొరంగం పనులు, చిప్పిలి, గుంటివారిపల్లె సమ్మర్ స్టోరేజీ ట్యాంకు పనులను పరిశీలించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment