రాజధాని కోసం 33వేల ఎకరాలు అవసరమా: పవన్
గుంటూరు : ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని నిర్మాణం కోసం 33వేల ఎకరాలు అవసరమా అని సినీనటుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. ఆయన గురువారం రాజధాని ప్రతిపాదిత గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా రైతులతో ఆయన ముఖాముఖి నిర్వహించారు. తనకు కూడా గొప్ప రాజధాని కావాలని ఉందని, అయితే అది అందరి కన్నీళ్లతో కాదని అన్నారు.
కొందరు స్వచ్ఛందంగా భూములు ఇచ్చారని, మిగతావాళ్లు వారి భూములివ్వడానికి ఉండే ఇబ్బందులు ఏంటో ప్రభుత్వం చర్చించాలని పవన్ కల్యాణ్ అన్నారు. ఇష్టం లేకుంటే రాజధానికి భూములు ఇవ్వవద్దని ఆయన ఈ సందర్భంగా సూచించారు. రైతు కన్నీరు...దేశానికి, రాష్ట్రానికి అరిష్టమని, రైతులకు అండగా తాను ఉంటానని పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు. రైతులు ఇష్టానికి వ్యతిరేకంగా తెలుగుదేశం ప్రభుత్వం భూములు లాక్కుంటే ఊరుకోనన్నారు. అవసరమైతే ఆమరణ నిరాహారదీక్షకైనా సిద్ధమని పవన్ కల్యాణ్ హెచ్చరించారు. అన్యాయం అన్యాయమేనని...అన్యాయం ఎక్కడ జరిగినా ప్రశ్నిస్తానని ఎర్రబాలెం రైతులతో ఆయన అన్నారు.